Covaxinపై బహ్రెయిన్ కీలక నిర్ణయం.. భారతీయులకు భారీ ఉపశమనం!

ABN , First Publish Date - 2021-11-13T15:26:31+05:30 IST

భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకాకు గల్ఫ్ దేశం బహ్రెయిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.

Covaxinపై బహ్రెయిన్ కీలక నిర్ణయం.. భారతీయులకు భారీ ఉపశమనం!

మనామా: భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకాకు గల్ఫ్ దేశం బహ్రెయిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ(ఎన్‌హెచ్ఆర్ఏ) ఆ దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్ల జాబితాలో తాజాగా కోవాగ్జిన్‌ను చేర్చింది. ఇది భారతీయ ప్రవాసులకు ఊరటనిచ్చే విషయమనే చెప్పొచ్చు. ఈ విషయాన్ని బహ్రెయిన్‌లోని భారత ఎంబసీ శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. "భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ@NHRABahrain అత్యవసర వినియోగానికి ఆమోదించింది" అని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. 


అలాగే ఈ నెల 7న కూడా భారత రాయబార కార్యాలయం భారత్ నుంచి బహ్రెయిన్ వచ్చే ప్రవాసులకు కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ విదేశీ ప్రయాణికులకు విధించిన ప్రయాణ మార్గదర్శకాలపై ఓ ట్వీట్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం పొందిన, బహ్రెయిన్‌ గుర్తించిన కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారు దాని తాలూకు క్యూఆర్ కోడ్ కలిగిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే బహ్రెయిన్ రావాలని సూచించింది. దీంతో పాటు ప్రయాణానికి ముందు టెస్టు చేయించుకున్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి అని పేర్కొంది. ఇలా ఈ రెండు ధృవపత్రాలు కలిగిన ప్రయాణికులకు బహ్రెయిన్ చేరుకున్న తర్వాత 10 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుందని ఎంబసీ వెల్లడించింది. 


ఇదిలాఉంటే.. ఇటీవల కోవాగ్జిన్ టీకాను పలు దేశాలు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్, ఒమన్, స్వీట్జర్లాండ్, హాంగ్‌కాంగ్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలు కోవాగ్జిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అటు నవంబర్ 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే పలు దేశాలు ఈ టీకాకు వరుసగా ఆమోదం తెలుపుతున్నాయి. ఇక కోవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాపై 78 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది.   

Updated Date - 2021-11-13T15:26:31+05:30 IST