ఆగిన గూడెం గుండెచప్పుడు

ABN , First Publish Date - 2022-06-18T06:06:59+05:30 IST

ఎదిగి వచ్చిన దారుల్ని మరువని ఆణిముత్యాలు కొందరే ఉంటారు. చాలా తక్కువమంది మాత్రమే తమను అందించిన సమాజానికి ఏదో చేయాలని తాపత్రయపడతారు.

ఆగిన గూడెం గుండెచప్పుడు

ఎదిగి వచ్చిన దారుల్ని మరువని ఆణిముత్యాలు కొందరే ఉంటారు. చాలా తక్కువమంది మాత్రమే తమను అందించిన సమాజానికి ఏదో చేయాలని తాపత్రయపడతారు. అట్లా ఆదివాసీ గుండెల్లో నిలిచిపోయిన విద్యావంతుడు, ఉద్యమకారుడు, బహుజన నాయకుడు నానుమాద్రి కృష్ణార్జునరావు. పూర్వ ఖమ్మం జిల్లా చర్లలో నిరుపేద ఆదివాసీల కడుపున పుట్టాడు కృష్ణార్జునరావు. ఇవాళే ఆదివాసీల్లో అక్షరాస్యత సగం కూడా లేదంటే, ఆయన పుట్టే నాటికి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఏటికి ఎదురీది గెలిచిన బతుకుపోరు విజేత కృష్ణన్న. మూడేళ్ల వయసు కూడా లేని నాడే తండ్రి మరణించాడు. తల్లి కూలీనాలీ చేసి పోషించింది. చదువుకోవాలనే పట్టుదల ఉన్నా కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే. అందుకే తల్లితో కలిసి కూలీపనులకు వెళ్లాడు. బడిలో హుషారుగా ఉండే కృష్ణార్జునరావు బడికెందుకు రావడం లేదని ఆరా తీశాడు ప్రభుదాస్‌ అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో చేర్పించాడు. ఆ మనసున్న ఉపాధ్యాయుని ప్రయత్నమే కృష్ణార్జునరావును చదువుల బాట పట్టించింది. పట్టుదలతో ఒక్కో చదువుల మెట్టు ఎక్కుతూ హైదరాబాద్‌లో పై చదువులు పూర్తిచేశాడు. బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. ఇక్కడితోటే తాను ఆగిపోయి ఉంటే ఇవాళ బహుజనులు ఇంతగా విలవిలలాడే వారు కాదు. కృష్ణార్జునరావుకు ఉద్యోగం లభించగానే తన ఆదివాసీ జాతి గుర్తుకు వచ్చింది. తనలాగే చదువుల కోసం కష్టపడే విద్యార్థులు గుర్తుకొచ్చారు. స్ఫూర్తి ఫౌండేషన్‌ పేరుతో ఒక ఎన్‌జీవోను స్థాపించి బడి ఈడు పిల్లల కోసం పుస్తకాలు, స్కూల్‌ యూనిఫామ్స్‌, ఫీజులు అందించాడు. కేవలం పిల్లల గురించే కాదు, తల్లుల గురించి, వారి ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచించాడు. స్ఫూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. గడిచిన ఇరవై ఐదేండ్లుగా ఈ కృషి కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇందుకోసం ఆనాటి నుండి నేటి దాకా సుమారు యాభై లక్షల రూపాయలకు పైనే ఖర్చు చేశాడు.


ఎస్‌బీఐలో బ్యాంకు మేనేజర్‌ స్థాయి ఎదిగినా తన స్వార్థం తాను చూసుకున్నది లేదు. తన మనసంతా ఆదివాసీ జీవితాల మీదే ఉండేది. ఇదే సమయంలో పేదల జీవితాల్లో అక్షరాలతో మార్పు తీసుకురావాలని ఉద్యోగాన్ని ఉద్యమంలా నిర్వర్తిస్తున్న డా. ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ని కలుసుకున్నాడు. తాను అనుకున్న ఆదివాసీ సాధికారతకు స్వేరో నెట్‌వర్కే సరైన వేదికని గుర్తించి, ఉద్యోగం నుండి రిటైర్‌ అయ్యాక పూర్తిగా స్వేరో కార్యక్రమాలతో గడిపాడు. కరోనా కాలంలో ఆర్‌ఎస్పీ సూచనల మేరకు విలేజ్‌ లర్నింగ్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేశాడు. పిల్లల చదువుల విషయంలో వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన అవసరం అని పదహారు వారాల పాటు ఆన్‌లైన్‌లో ఫ్యూచర్‌ పేరెంటింగ్‌ కార్యక్రమాలను నిర్వర్తించాడు. జూమ్‌ మీటింగ్స్‌లో వందలాదిమంది గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఎనలేని ప్రేరణను పొందేలా కృష్ణార్జునరావు తీసుకున్న చొరవ మరువలేనిది. ఆరుపదుల వయసులో తన ఆరోగ్యం సహకరించకున్నా, బహుజనులకు రాజ్యాధికారం దక్కి తీరాలి, ఆర్‌ఎస్పీ తెలంగాణకు సీఎం కావాలనే లక్ష్యంతో కార్యరంగంలోకి దిగాడు. బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరి ఆర్‌ఎస్పీ ఆంతరంగికుల్లో ఒకడిగా మెలిగాడు. కష్టించి పని చేసే లక్షణమే ఆభరణంగా కలిగిన కృష్ణార్జునరావు పని యావత్‌ తెలంగాణ రాష్ట్ర బహుజన శ్రేణులకు ఊపును, ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటిదాకా ఆదివాసీల విముక్తి కోసం ఎందరో పని చేశారు. వారిలో ఎక్కువమంది గిరిజనేతరులే. కానీ, కృష్ణార్జునరావు స్వతహాగా ఆదివాసీ కావడం వల్ల తన జాతి పట్ల మరింత ఎక్కువ అంకితభావం కనబరిచాడు. ఆదివాసీ విముక్తే తన విముక్తిగా తలచాడు. నలభై నాలుగేళ్ల వయసులోనే తనకు హార్ట్‌స్ట్రోక్‌ వచ్చిందన్న విషయాన్ని మరిచిపోయి మెలిగాడు. ఆయన ఆశయమైన బహుజన రాజ్యాధికారాన్ని సాధించడమే ఆయనకు నిజమైన నివాళి.


– పసునూరి రవీందర్‌

Updated Date - 2022-06-18T06:06:59+05:30 IST