బహుజనులను మరువొద్దు

ABN , First Publish Date - 2022-06-11T07:18:02+05:30 IST

ప్రజారాజధాని అమరావతి ఉద్యమంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు..

బహుజనులను మరువొద్దు

ప్రజారాజధాని అమరావతి ఉద్యమంలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు, విడివడిన అవశేషాంధ్రకు ఒక రాజధాని ఉండాలన్న సంకల్పం మొదటిదైతే, రాజధాని కోసం భూములిచ్చిన దళిత, బహుజన కులాల రైతుల త్యాగాలు, రాజధాని నిర్మాణం జరిగితే అధికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే బడుగు వర్గాల జీవన దృశ్యం రెండో పార్శం. చాలా మంది మేధావులు, రాజకీయ పక్షాల నాయకులు మొదటి అంశానికి ఇచ్చిన ప్రాధాన్యత, గుర్తింపు రెండవ అంశానికి ఇవ్వకపోవడం రాజధాని ఉద్యమంలో బలమైన బలహీనత. ఈ ఉద్యమం 13 జిల్లాలకు శాఖోపశాఖలుగా విస్తరించక పోవటానికి ప్రధాన కారణం కూడా అదే.


దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అన్నారు గురజాడ. నిజానికి మనుషులు అంటే పీడిత, తాడిత ప్రజలు అని దీని అర్థం. ఏ సంపన్న వర్గాల పాదాల కిందో, ఏ ధనవంతుల దౌర్జన్యాల కిందో అణచివేయబడుతున్న అణగారిన పేదలే ప్రజలని. కూడు, గుడ్డ, నీడకు నోచుకోని నిరుపేదలు అనే. అందుకేనేమో, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసే బోయీ లెవ్వరు? అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఈ స్ఫూర్తితోనే రాజధాని ఉద్యమంలోకి రైతులతో పాటు బహుజన కులాలు కదంతొక్కాయి. భూములు ఇచ్చిన రైతుల్లో 34 శాతం ఎస్సీ, ఎస్టీలు, 14 శాతం బీసీలు, 9 శాతం మైనార్టీ, ఇతర కులాలు వెరశి 51 శాతం పొలాలు మావే అని నినదించాయి. రాజధానిలో బహుజనుల పొలికేకలు వినిపించారు. రాజధాని ఉద్యమంలో నాయకత్వ పగ్గాలు చేతికి అందకపోయినా, విస్తృతమైన ఉద్యమ నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేశారు. వారి ఉనికిని, గొంతుకను బలంగా వినిపించారు. ఉద్యమ క్రమంలో వారు కూడా ప్రభుత్వ దౌర్జన్యాలకు, దాడులకు గురయ్యారు. రాజధాని ఉద్యమంలో దాదాపు 3,500కు పైగా ప్రభుత్వం కేసులు పెడితే, దళితులపై 450 కేసులు పెట్టారు. క్రియాశీలక పాత్ర పోషించకుండా అడుగడుగునా బెదిరించారు. ఆటంకపర్చారు. హెచ్చరికలు జారీ చేశారు. హౌస్‌ అరెస్టులు చేశారు. కృష్ణాయపాలెంలో 9మంది దళిత నాయకులపై దళితుల చేత సెక్షన్‌ 3 కేసులు పెట్టించారు. 24 రోజులు జైల్లో పెట్టారు. చేతులకు బేడీలు వేసి బస్సుల్లో తిప్పారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత నాయకులు పులి చిన్నపై భౌతిక దాడి చేశారు. దళిత కులాల చేతనే మూడు రాజధానుల పోటీ శిబిరం పెట్టించి, రోజు వారీ డబ్బులు వెదజల్లి వారిని విభజించే ప్రయత్నం చేశారు. అయినా రాజధాని కోసం భూములిచ్చిన ఒక్క దళిత రైతు కానీ, రాజధాని లేక ఉపాధి పోగొట్టుకున్న ఒక్క బహుజన కూలీ కానీ పోటీ శిబిరం వంక కన్నెత్తి చూడలేదు.


రాజధాని ఉద్యమంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 189 మంది రైతులు మృతిచెందితే, వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు 60కి పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి గొంతుపై కాలుమోపి చేసిన మొదటి పని ఏమిటంటే, రాజధాని నుంచి బడుగులను వెళ్ళగొట్టటం. రాజధాని నిర్మాణంలో పని చేస్తున్న 40 వేల మంది కార్మికులను పనులను బంద్‌ పెట్టించి తరిమేశారు. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వారే. సిమెంట్‌ పని చేసినా, ఆగర్లు తీసినా, రాడ్‌ బెండింగ్‌ పనులు చేసినా, రంగులు వేసినా, ఎలక్ట్రికల్‌ పనులు చేసినా, రహదారులు పోసినా వారంతా దళితులే. కింది కులాలకు చెందిన పనివారలే కదా ఉపాధి కోల్పోయి వీధినపడ్డది, ముఖ్యమంత్రి చెప్పిన ప్రత్యర్థి సామాజిక వర్గం కాదు కదా? మరో విషాదకరమైన విషయం ఏమిటంటే, రాజధానిలో దాదాపు ఐదు నుంచి ఏడు వేల ఎకరాల భూములు ఇచ్చిన అసైన్డ్‌ రైతుల బతుకు తెరువు. ఆనాటి ప్రభుత్వం రైతులతో పాటు ఎసైన్డ్‌ రైతులకు న్యాయం చేస్తామని 41 జీఓ ద్వారా వారికి రైతులతో పాటు కొంత సమానమైన ప్యాకేజీ ప్రకటించింది. రైతులకు ఇచ్చిన చోటే వ్యాపార, నివాస ప్లాట్లు కేటాయించారు. అయితే అసైన్డ్‌ భూముల్లో కూడా అక్రమాలు జరిగాయని ప్రభుత్వం కేసులు పెడితే, దళితులు ధైర్యంగా తిప్పి కొట్టారు. ఇప్పటికీ వీరికి కౌలు చెల్లింపు జరగాలంటే, సిఆర్డీఎ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. రాజధాని కోసం భూములు తీసుకున్న తరువాత పూర్తిగా ఉపాధి పోగొట్టుకున్న మరో వర్గం కౌలురైతులు, వ్యవసాయ కూలీలు. చేసేం దుకు వ్యవసాయ భూములు లేక, ఉపాధి అవకాశాలకు రాజధాని నిర్మాణం లేక వీరు పూర్తిగా రోడ్డున పడ్డారు. పెళ్ళిళ్ళు వాయిదా వేశారు. పనుల కోసం చాలా మంది వలసలు పోయారు. వ్యవసాయ కూలీలకు ఇచ్చే రాజధాని ఫించన్లు సైతం సక్రమంగా ఇవ్వటం లేదు. 


మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, రాజధాని ప్రాంతం ఏకంగా తాటికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. దీనికి అటు గుంటూరు జిల్లాలో వేమూరు, పత్తిపాడు అనే మరో రెండు ఎస్సీ నియోజకవర్గాలు, ఇటు కృష్ణా జిల్లాలో నందిగామ, తిరువూరు, పామర్రు అనే మరో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే రమారమి 12 లక్షల మంది ప్రజలు అచ్చంగా దళితులే. దశాబ్దాలుగా రాజధాని ప్రాంతం దళిత చైతన్యాల కూడలి ప్రాంతం. రాష్ట్రంలో జరిగిన కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, వేటపాలెం, కంచికచర్ల, గోపరాజుపల్లి వంటి ఉద్యమాలకు నాడీ కేంద్రంగా ఉండటం గమనార్హం. ఇక్కడ నుంచే ఉద్యమ కార్యాచరణ పవనాలు వీచేవి. ఏ వర్గాలకైతే ఆర్థికస్థితి మెరుగుగా ఉంటుందో, ఆ వర్గాలే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలనూ శాసిస్తాయి అన్నది పచ్చి నిజం. ఈ కోణంలో రాజధాని అమరావతి ఉంటే అత్యంత మేళ్ళు, ఆర్థిక ప్రయోజనాలు పొందేది ప్రధానంగా క్రింది కులాల వారే. తద్వారా రాజకీయ అధికారం వారికీ చేరువ అవుతుందన్న ఆలోచన మాలాంటి ఉద్యమకారులకు లేకపోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అమరావతిని రక్షించుకోవడం అంటే దళిత బహుజన కులాల భవిష్యత్తును రక్షించుకోవడం అనీ, రాజధానిని కాపాడుకోవటం అంటే క్రింది కులాలకు రాజ్యాధికారాన్ని దగ్గర చేయటం అనీ అర్థం.


పోతుల బాలకోటయ్య

అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు

Updated Date - 2022-06-11T07:18:02+05:30 IST