Advertisement

బైడెన్‌ బాట‌!

Apr 16 2021 @ 00:30AM

సుదీర్ఘ యుద్ధానికి స్వస్తిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ అఫ్ఘానిస్థాన్‌నుంచి అమెరికా సేనల ఉపసంహరణ ప్రక్రియను ప్రకటించారు. పూర్వాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత ఏడాది ఫిబ్రవరిలో కుదర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా మే ఒకటికల్లా నిష్క్రమించడం అసాధ్యమని బైడన్‌ ఇటీవల తేల్చేసిన విషయం తెలిసిందే. అమెరికా కొత్త అధ్యక్షుడు ఇప్పుడు ప్రకటించిన కొత్త గడువుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చరిత్రకెక్కిన సెప్టెంబరు 11ను ఆయన ఎంపికచేసుకున్నారు. అఫ్ఘానిస్థాన్‌లోకి అమెరికా సైనికుల ప్రవేశానికి కారణమైన మారణకాండకు ఇరవైయేళ్ళు పూర్తవుతున్న సందర్భంలో, అంతలోగా అమెరికా సైనికులు తిరిగి ఇంటికి చేరుకోవాలని బైడెన్‌ సంకల్పించారు.


దశాబ్దం క్రితం వరకూ లక్షమంది అమెరికా సైనికులు అఫ్ఘానిస్థాన్‌లో ఉంటే ఇప్పుడు అక్కడ మిగిలింది మూడున్నరవేలమందే. దాదాపు రెండున్నరవేలమంది సైనికులు అఫ్ఘాన్‌ రక్షణలో ప్రాణాలు కోల్పోయారనీ, అక్కడి పరిస్థితులు మెరుగుపడేవరకూ, భిన్నమైన ఫలితం వచ్చేవరకూ అంటూ కాలాన్ని మరికొంత సాగదీస్తూ సైనికులను కొనసాగించడం సరికాదని బైడెన్‌ బుధవారం ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ఐదో అధ్యక్షుడి నెత్తిమీదకు ఈ బాధ్యతను నెట్టేయలేనంటూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయంమీద అమెరికన్‌ ప్రజలకు, మరీ ముఖ్యంగా కొత్తతరానికి ప్రత్యేకమైన వ్యతిరేకతో, ఆమోదమో ఉండే అవకాశమైతే లేదు. కానీ, అమెరికా నిష్క్రమణ తరువాత అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్‌ రెచ్చిపోవడమూ, అక్కడి ప్రభుత్వం బలహీనపడటమైతే ఖాయం. తాలిబాన్‌ ఏదో మార్గంలో అధికారంలోకి వచ్చి తిరిగి తన పూర్వావతారాన్ని ప్రదర్శించినపక్షంలో బైడెన్‌కు ప్రపంచవ్యాప్తంగా అప్రదిష్ఠ తప్పదు. హక్కుల హననాలూ, ఆడవారిపై ఆంక్షలు, ఊచకోతలతో అఫ్ఘానిస్థాన్‌ తిరిగి ఒక భయానకమైన ఉగ్రవాద


కేంద్రంగా తయారైతే అందరూ బైడెన్‌నే ఆడిపోసుకుంటారు. ఉగ్రవాదాన్ని తరిమికొట్టి, ఆ దేశాన్ని దారిలోపెట్టి వెనక్కురావాల్సిన అమెరికా అలా నడిమధ్యలో వదిలేసి, చేతులు దులిపేసుకున్నందుకు చెడ్డపేరు తప్పదు. ఆ ఉగ్రవాద ప్రభావాన్ని అమెరికా ప్రత్యక్షంగా రుచిచూడాల్సి వస్తే మరింత అవమానం తప్పదు.


నగరాలు, పట్టణాలు అప్ఘాన్‌ ప్రభుత్వ పాలనలో ఉంటే, వాటి చుట్టూ ఉన్న అత్యధిక భూభాగాలు ఇప్పటికీ తాలిబాన్‌ అధీనంలోనే ఉన్నాయి. యుద్ధంలో అమెరికా ఘోరంగా ఓడిపోయింది, ఇంకెన్ని దశాబ్దాలు ఇక్కడ ఉన్నా గెలిచేది లేదని దానికి తెలుసు, అందుకే ఈ నిష్క్రమణ అని తాలిబాన్‌ కమాండర్లు అంటున్నారు. అమెరికాతో ఒప్పందం తరువాత తాలిబాన్లు విదేశీ సైనికుల మీద దాడులు దాదాపు ఆపేశారు కానీ, అఫ్ఘాన్‌ బలగాల మీద మాత్రం విరుచుకుపడుతూనే ఉన్నారు. భారీ విధ్వంసాలు, విస్ఫోటనలూ కొనసాగిస్తూనే ఉన్నారు. తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తాలిబాన్‌ నిరీక్షిస్తున్న తరుణం ఇది. శాంతిచర్చలు ఫలితాన్నివ్వవనీ, అమెరికా నిష్క్రమణ తరువాత తాలిబాన్లు ఒక్కసారిగా రెచ్చిపోతారనీ, అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వం పెద్ద దెబ్బతింటుందని అమెరికా ఇంటలిజెన్స్‌ నివేదికలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, అఫ్ఘానిస్థాన్‌ని ఓ కంట కనిపెడుతూనే ఉంటాననీ, ప్రభుత్వానికీ, తాలిబాన్‌కూ మధ్య సయోధ్యకు కృషిచేస్తానని బైడెన్‌ హామీ ఇస్తున్నప్పటికీ పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. అఫ్ఘానిస్థాన్‌ విషయంలో ట్రంప్‌ కేవలం పాకిస్థాన్‌ను మాత్రమే నమ్మితే, బైడెన్‌ అందుకు భిన్నంగా భారత్‌, రష్యా, చైనా, ఇరాన్‌, టర్కీలను రంగంలోకి దించి, ఐక్యరాజ్యసమితి పాత్రను కూడా పెంచి శాంతియత్నాలు చేస్తున్నమాట నిజం. బుధవారం ప్రసంగంలోనూ బైడెన్‌ పాకిస్థాన్‌ పేరు ప్రధానంగా పేర్కొంటూ, భారత్‌ పాత్రనూ ప్రస్తావించారు. అఫ్ఘాన్‌ పునర్నిర్మాణానికి ఇతోధికంగా సహకరించిన భారత్‌నుంచి అమెరికా ఎటువంటి భూమిక నిర్వహించాలని ఆశిస్తున్నదో ఇప్పటికైతే స్పష్టత లేదు. మిగతా అమెరికా పాలకులతో పోల్చితే, బైడెన్‌ రాబోయే రోజుల్లో భారత్‌ అఫ్ఘానిస్థాన్‌ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రశస్థమైన పాత్ర పోషించాలని కోరుకుంటున్నమాట వాస్తవం. కానీ, ఒకే ఒరలో భారత్‌, పాకిస్థాన్‌లను ఏ మేరకు ఇమడ్చగలరో చూడాలి. అమెరికా సైన్యం రెండు దశాబ్దాలుగా అక్కడ ఉన్నా, ఇప్పుడు దాని నిష్క్రమణ తరువాత కూడా అఫ్ఘాన్‌ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న అలాగే మిగిలివుండటం విచిత్రం, విషాదం.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.