బైజూస్‌ భారీ డీల్‌

ABN , First Publish Date - 2021-07-27T05:56:04+05:30 IST

దేశంలో అతిపెద్ద ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ బైజూస్‌ మరో భారీ కొనుగోలు ఒప్పందం

బైజూస్‌ భారీ డీల్‌

రూ.4,466 కోట్లకు గ్రేట్‌ లెర్నింగ్‌ కొనుగోలు


న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ బైజూస్‌ మరో భారీ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌కు చెందిన గ్రేట్‌ లెర్నింగ్‌ను 60 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.4,466 కోట్లు) చేజిక్కించుకుంది. ఆన్‌లైన్‌లో వృత్తి నైపుణ్య పెంపు శిక్షణ, ఉన్నత విద్య సేవలందిస్తోన్న గ్రేట్‌ లెర్నింగ్‌ స్థానా న్ని బలోపేతం చేసేందుకు మరో 40 కోట్ల డాలర్ల పెట్టుబడి కూడా పెట్టనుంది.


‘‘ఈ పోటీ ప్రపంచం లో ప్రస్తుత పరిస్థితులకు తగిన శిక్షణతో పాటు అత్యుత్తమ బోధకులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంలో భాగంగా మేము ఒక్కటి కావడం జరిగింది. తద్వారా ఈ విభాగంలో ప్రపంచ మార్కెట్‌ లీడర్‌గా ఎదగాలన్నది మా లక్ష్య’’మని బైజూస్‌ వ్యవస్థాపకులు, సీఈఓ బైజు రవీంద్రన్‌ అన్నారు. 


సంస్థకిది మూడో టేకోవర్‌: ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌లో అన్ని విభాగాల్లోకి విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న బైజూస్‌ ఈ మధ్య కాలంలో కుదుర్చుకున్న మూడో టేకోవర్‌ ఒప్పందమిది. అమెరికాకు చెందిన డిజిటల్‌ రీడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఎపిక్‌’ను 50 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.3,729.8 కోట్లు) కొనుగోలు చేసున్నట్లు గత వారం బైజూస్‌ ప్రకటించింది.


అలాగే, ఉత్తర అమెరికా మార్కెట్లో 100 కోట్ల డాలర్ల (రూ.7,459.7 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. అంతేకాదు, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ను 100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.7,459 కోట్లు) దక్కించుకుంది. 


10 కోట్లకు పైగా యూజర్లు: 2015లో ప్రారంభమైన బైజూ్‌సకు ప్రస్తుతం 10 కోట్లకు పైగా రిజిస్టర్డ్‌ యూజర్లున్నారు. అందులో 65 లక్షల మంది వార్షిక చందాదారులు. వీరి రెన్యువల్‌ రేటు 86 శాతంగా ఉంది. గ్రేట్‌ లెర్నింగ్‌ విషయానికొస్తే.. 2013లో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్‌ 170 దేశాల్లోని 15 లక్షల మందికి 6 కోట్ల గంటల శిక్షణ అందించింది. బైజూస్‌ కొనుగోలు చేసినప్పటికీ, గ్రేట్‌ లెర్నింగ్‌ వ్యవస్థాపకులు, సీఈఓ మోహన్‌ లఖమరాజు, సహ వ్యవస్థాపకులు హరి నాయర్‌, అర్జున్‌ నాయర్‌ల నాయకత్వంలో స్వతంత్ర ప్లాట్‌ఫామ్‌గానే కొనసాగనుంది. 


Updated Date - 2021-07-27T05:56:04+05:30 IST