
ముంబై: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 189 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)కు సవాలు విసిరింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. బెయిర్‌స్టో అర్ధ సెంచరీ (56)తో అదరగొట్టగా చివర్లో వికెట్ కీపర్ జితేశ్ శర్మ చిచ్చరపిడుగల్లే చెలరేగడంతో స్కోరు పరుగులు తీసింది.
18 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు (నాటౌట్) చేసిన జితేశ్ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. భానుక రాజపక్స 27, లియామ్ లివింగ్ స్టోన్ 22 పరుగులు చేయగా, శిఖర్ ధవన్ 12, మయాంక్ అగర్వాల్ 15 పరుగులు చేశారు. రిషి ధావన్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌కు మూడు వికెట్లు లభించాయి.
ఇవి కూడా చదవండి