బజరంగ్‌దళ్‌ కార్యకర్త హత్య.. ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-02-22T08:40:15+05:30 IST

కర్ణాటకలో హిజాబ్‌ వివాదం తారస్థాయిలో కొనసాగుతున్న

బజరంగ్‌దళ్‌ కార్యకర్త హత్య.. ఉద్రిక్తత

  • శివమొగ్గలో హింసాకాండ
  • వాహనాలు దహనం..
  • దుకాణాలు ధ్వంసం
  • గాలిలోకి పోలీసుల కాల్పులు
  • రెండు రోజులు నిషేధాజ్ఞలు
  • విద్యాసంస్థలకు సెలవు

 


 బెంగళూరు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో హిజాబ్‌ వివాదం తారస్థాయిలో కొనసాగుతున్న తరుణంలో శివమొగ్గ జిల్లాలో బజరంగ్‌దళ్‌ కార్యకర్తను కొందరు దారుణంగా హత్య చేయడం హింసాకాండకు దారితీసింది. శివమొగ్గ నగరంలో ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత కారులో వచ్చిన ఐదారుగురు దుండగులు బజరంగ్‌దళ్‌ కార్యకర్త హర్ష(22)ను కత్తులతో వెంటాడి పొడిచి చంపారు. దీంతో హిందూసంఘాల కార్యకర్తలు పెద్దఎత్తున రోడ్డెక్కారు. రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం ఇంటికి తరలించే సమయంలోనూ దుకాణాలపైకి రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలను తగలబెట్టారు.


పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రాళ్లు రువ్విన ఘటనల్లో ఫొటో జర్నలిస్టు, మహిళా కానిస్టేబుల్‌ సహా ముగ్గురికి గాయాలయ్యాయి. హత్యకు కారకులుగా భావిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఏడీజీపీ మురుగన్‌ తెలిపారు. సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రెండు రోజులు నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్టు యంత్రాంగం ప్రకటించింది. నగరంలో 144 సెక్షన్‌ విధించామని డిప్యూటీ కమిషనర్‌ సెల్వమని చెప్పారు.


హత్య దారుణమని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై విచారం వ్యక్తం చేశారు. హంతకులు ఎంతటి వారైనా అరెస్టు చేస్తామన్నారు. హంతకులు ఎవరైనా శిక్ష వేయాల్సిందేనని ప్రతిపక్షనేత సిద్దరామయ్య డిమాండ్‌ చేశారు. కాగా ‘ముస్లిం గూం డాలే’ హర్షను హత్య చేశారని పంచాయతీరాజ్‌ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప ఆరోపించారు. హర్షపై  గతంలో 2 కేసులున్నాయ ని, వాటికి సంబంధించిన అందరినీ విచారిస్తామని హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర చెప్పారు. నిందితులను హైదరాబాద్‌ రేప్‌ కేసు తరహాలో ఎన్‌కౌంటర్‌ చేయాలని మైసూరు బీజేపీ ఎంపీ ప్రతా్‌పసింహ డిమాండ్‌ చేశారు.  



స్కూళ్లలో యూనిఫాంలే.. అమిత్‌షా మనోగతం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: హిజాబ్‌ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్‌ షా స్పందించారు. స్కూళ్లలో విద్యార్థులు యూనిఫాంలే వేసుకోవాలని, ధార్మిక వస్త్రాలు ధరించకూడదన్నది తన అభిమతమని తెలిపారు. అయితే కర్ణాటక స్కూళ్లలో హిజాబ్‌పై నిషేధం విధింపుపై న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలకు కట్టుబడి ఉంటానని సోమవారం ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అన్ని మతాల ప్రజలు పాఠశాలల్లో డ్రెస్‌ కోడ్‌ను ఆమోదించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు.


పరీక్షల బహిష్కరణ..

రాష్ట్రమంతటా పీయూ(ఇంటర్మీడియెట్‌) ప్రీ-ఫైనల్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హిజాబ్‌ వివాదం తలెత్తిన ఉడుపి పీయూ కళాశాలలో ఆరుగురు విద్యార్థినులు పరీక్షలను బహిష్కరించారు. వారిని హిజాబ్‌తో కళాశాలలోకి అనుమతించకపోవడంతో గేటు వద్ద నుంచి వెనుతిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కళాశాలల వద్ద కూడా ఇలాంటి  దృశ్యాలు కనిపించాయి.




విద్యాసంస్థల్లో మతాచారాలు వద్దు

హైకోర్టులో కర్ణాటక ప్రభుత్వ వాదనలు

బెంగళూరు, ఫిబ్రవరి 21: కర్ణాటకలో హిజాబ్‌ వివాదం కొనసాగుతోంది. హిజాబ్‌తో తరగతులకు అనుమతించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది విద్యార్థినులు ప్రీ-ఫైనల్‌ పరీక్షలను బహిష్కరించారు. మరోవైపు హిజాబ్‌ అనేది ముఖ్యమైన మతాచారం కాదని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టులో పునరుద్ఘాటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితు రాజ్‌ అవస్థీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట సోమవారం కూడా హిజాబ్‌పై విచారణ కొనసాగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ప్రభులింగ్‌ నావదగి వాదనలు వినిపించారు. ‘హిజాబ్‌ ముఖ్యమైన మతాచారం కాదని మేం భావిస్తున్నాం. విద్యాసంస్థల్లోకి మతాచారాలను రానివ్వొద్దని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ అసెంబ్లీలో ప్రకటించారు’ అని ఏజీ తెలిపారు. ముఖ్యమైన మతాచారాలకు మాత్రమే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 రక్షణ కల్పిస్తుందన్నారు. కాగా, హిజాబ్‌పై ప్రభుత్వ జీవోకు సంబంధించి కొన్ని స్పష్టతలు అవసరమని సీజే పేర్కొన్నారు. ‘ప్రభుత్వ ఆదేశంలో పక్షపాతం లేదని మీరు వాదిస్తున్నారు.


హిజాబ్‌ను ప్రభుత్వం నిషేధించలేదని, దానిపై ఏ విధమైన పరిమితులూ విధించలేదని కూడా చెబుతున్నారు. విద్యార్థులు నిర్దేశిత యూనిఫాం ధరించాలని జీవోలో పేర్కొన్నారు. మీ వైఖరి ఏమిటి? విద్యాసంస్థల్లో హిజాబ్‌ను అనుమతించాలా? వద్దా?’ అని సీజే ప్రశ్నించారు. విద్యాసంస్థలు హిజాబ్‌ను అనుమతిస్తే, సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ఏజీ సమాధానమిచ్చారు. దీంతో విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. 


Updated Date - 2022-02-22T08:40:15+05:30 IST