ltrScrptTheme3

బజరంగ్‌ దళ్‌.. ఓ తీవ్రవాద సంస్థ..!

Oct 25 2021 @ 01:20AM

‘ప్రమాదకర సంస్థ’ల జాబితాలో

చేర్చేందుకు ఫేస్‌బుక్‌ యత్నం.. వెనుకంజ

బీజేపీ అనుబంధ సంస్థ కావడమే కారణం!

వెల్లడించిన ఫేస్‌బుక్‌ పరిశోధన పత్రాలు

‘న్యూయార్క్‌ టైమ్స్‌’ సంచలన కథనం

భారత్‌లో ఫేక్‌న్యూస్‌తో ఫేస్‌బుక్‌ పోరు


వాషింగ్టన్‌, అక్టోబరు 24: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ హిందూత్వ సంస్థ బజరంగ్‌ దళ్‌ను ‘ప్రమాదకర సంస్థ’ల జాబితాలో చేర్చేందుకు ఒక దశలో ప్రయత్నించిందా? ఈ ప్రశ్నకు ఫేస్‌బుక్‌ పరిశోధన పత్రాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. భారత్‌లో ఫేక్‌న్యూస్‌, తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే పోస్టులు, దారుణ హింసలకు సంబంధించి విజయోత్సవాలు వంటి వాటిని నిలువరించడంలో ఫేస్‌బుక్‌ ఏటికి ఎదురీదుతోందంటూ పేర్కొన్న ఫేస్‌బుక్‌ అంతర్గత పరిశోధన పత్రాలను, ‘ప్రతికూల ప్రమాదకర నెట్‌వర్క్‌లు: భారత్‌లో కేస్‌ స్టడీ’ నివేదికను న్యూయార్క్‌ టైమ్స్‌, అసోసియేటెడ్‌ ప్రెస్‌ సహా.. వార్తా సంస్థల కన్సార్టియం సంపాదించింది. ఈ పరిశోధన పత్రాలకు ‘ద ఫేస్‌బుక్‌ పేజెస్‌’ అని నామకరణం చేసింది. దానికి సంబంధించి న్యూయార్క్‌ టైమ్స్‌ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా బజరంగ్‌ దళ్‌ను ఫేస్‌బుక్‌ ఓ తీవ్రవాద సంస్థగా భావిస్తోందని ఆ నివేదికలు స్పష్టం చేశాయి. ‘‘బజరంగ్‌ దళ్‌ను ప్రమాదకర సంస్థల జాబితాలో చేర్చేందుకు ఫేస్‌బుక్‌ సిద్ధమైంది. అయితే, ఇంకా ఆ దిశలో చర్యలు తీసుకోలేదు’’ అని వెల్లడించాయి. ఈ సంస్థ ముస్లిం వ్యతిరేక పోస్టులకు ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకుందని పేర్కొన్నాయి. ‘‘భారత్‌లో అధికార పార్టీ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ బజరంగ్‌ దళ్‌ ముస్లిం వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఆ సంస్థ, నేతలు, కార్యకర్తల పోస్టులను తొలగించడం ఫేస్‌బుక్‌కు ఓ పెద్ద టాస్క్‌గా మారింది. బజరంగ్‌ దళ్‌ గ్రూపుల్లో హిందువులను చేర్చడం, తమ పోస్టులను వీలైనంతగా వైరల్‌ చేయడం, పోస్టులను షేర్‌ చేయించడం వంటి చర్యలకు పాల్పడుతోంది’’ అని ఆ పరిశోధన పత్రాలు స్పష్టం చేశాయి. అయితే.. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక గత ఏడాది డిసెంబరులోనే ప్రచురించింది. గత ఏడాది డిసెంబరు 16న భారత పార్లమెంటరీ కమిటీ కూడా ఫేస్‌బుక్‌ను ఈ విషయంపై నిలదీసింది. ‘‘బజరంగ్‌ దళ్‌ పోస్టులపై చూసీచూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. అప్పట్లో ఫేస్‌బుక్‌ తన తీరును సమర్థించుకుంటూ.. ‘‘బజరంగ్‌ దళ్‌ మా పాలసీని ఉల్లంఘించినట్లు తేలలేదు’’ అని పేర్కొంది. కాగా.. హిందూత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌సం్‌ఘ(ఆరెస్సెస్‌) కూడా అదే రీతిలో మతపరమైన హింసకు ప్రేరేపించే పోస్టులను పెడుతోందని ఎఫ్‌బీ పరిశోధన పత్రాలు పేర్కొన్నాయి. ‘‘భారత్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ కావడం వల్ల తగిన చర్యలు తీసుకోవడంలో ఫేస్‌బుక్‌ వెనుకంజ వేస్తోంది. అలా చేస్తే.. అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌లో ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తోంది’’ అని ఆ నివేదికలు వెల్లడించాయి. బజరంగ్‌ దళ్‌, ఆరెస్సె్‌సతోపాటు.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే పోస్టులను వైరల్‌ చేస్తున్నారని గుర్తించిన ఫేస్‌బుక్‌.. 2019 ఎన్నికలకు ముందు తమ రీసెర్చర్‌తో కేరళ భౌగోళిక వివరాలతో ఖాతా తెరిపించి, ఓ డెకాయ్‌ ఆపరేషన్‌ను నిర్వహించి, పలు వివరాలను సేకరించింది.

ఫేస్‌బుక్‌ అంతర్గత పరిశోధనల్లో గుర్తించిన మరికొన్ని అంశాలు

ఫ ఫేస్‌బుక్‌కు 34 కోట్ల మంది యూజర్లున్న భారత్‌ అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడ ఫేక్‌ న్యూస్‌, రెచ్చగొట్టే ప్రసంగాలను నిలువరించడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం.. 22 అధికారిక భాషలు ఉండడమే. ఆయా భాషల్లో చేసే పోస్టుల్లో ఫేక్‌, హింసాత్మక, రెచ్చగొట్టే కేటగిరీని గుర్తించే నైపుణ్యత ఉన్న ఉద్యోగులు తక్కువగా ఉండడమే అందుకు కారణం

ఫ 2019 ఎన్నికల సమయంలో ఎఫ్‌బీ ప్రధాన కార్యాలయానికి చెందిన నిపుణులను భారత్‌లో మోహరించినా.. థర్డ్‌ పార్టీ సహకారం తీసుకున్నా.. ఫేక్‌, రెచ్చగొట్టే పోస్టుల తొలగింపు ప్రహసనంగానే మారింది. హిందీ, బెంగాల్‌ భాషల్లో నిపుణుల సంఖ్య ఆశాజనకంగానే ఉన్నా.. మిగతా భాషల్లో ఇలాంటి పోస్టుల గుర్తింపులో ఆలస్యం ఏర్పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి కొన్ని ఆటోమేటెడ్‌ టూల్స్‌ని ఫేస్‌బుక్‌ అభివృద్ధి చేసింది. ఏఐ సాయంతో అలాంటి పోస్టులను తొలగిస్తోంది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.