కరువునేలపై సిరులపంట.. ‘భక్తరామదాసు’తో తీరిన ‘పాలేరు’ సాగునీటి వెతలు

ABN , First Publish Date - 2021-02-28T05:03:26+05:30 IST

కరువునేలపై సిరులపంట.. ‘భక్తరామదాసు’తో తీరిన ‘పాలేరు’ సాగునీటి వెతలు

కరువునేలపై సిరులపంట.. ‘భక్తరామదాసు’తో తీరిన ‘పాలేరు’ సాగునీటి వెతలు
పచ్చని పొలాలు

దశాబ్దాల కరువుకు చరమగీతం

జలకళ సంతరించుకున్న మెట్ట ప్రాంతాలు

రాష్ట్ర ఆవిర్భావం తరువాత పూర్తయిన తొలిప్రాజెక్టుగా రికార్డు

మాజీమంత్రి తుమ్మల కృషిని కొనియాడుతున్న రైతులు

కూసుమంచి, ఫిబ్రవరి 27: ఖమ్మం జిల్లాలోని కరువు నేలపై సిరుల పంటలు పండుతున్నాయి. ఐదేళ్లక్రితం ప్రారంభమైన భక్తరామాదాసు ఎత్తిపోతల పథకంతో మెట్టభూములు మాగాణులుగా మారాయి. ఖమ్మం జిల్లాలో కరువు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పాలేరు నియోజకవర్గం.. తలాపునే పాలేరు జలాశయం ఉన్నా కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలు సాగునీటి సమస్యతో విలవిల్లాడేవి.. వర్షాలు ఆశించినస్ధాయిలో పడకపోవడంతో ఏటా పంటలు పండక తీవ్రస్థాయిలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనేవి. వేసవిలో తాగునీటికోసం సైతం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. కానీ నేడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. దశాబ్దాలుగా నీరు లేక వెలవెలబోయిన పాలేరు నియోజకవర్గం 2017 నుంచి వరుసగా  జలకళను సంతరించుకుంటోంది. ఈ పెను మార్పులకు భక్తరామదాసు ఎత్తిపోతల నిర్మాణం నిలువెత్తు నిదర్శనం. పాలకులలో చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ప్రజలకు అనుకూలంగా మార్చవచ్చని నిరూపించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కృషి, పట్టుదల ముందస్తు చూపుతో నియోజకవర్గాన్ని నీటి కష్టాలనుంచి దశ దిశ మార్చిన తుమ్మలను మర్చిపోలేమంటున్నారు ఈ ప్రాంత అన్నదాతలు. పాలేరు జలాశయం పక్కనే ఉన్నా.. అది దిగువన ఉన్న మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు మాత్రమే సాగునీటి వనరుగా ఉపయోగపడేది. కానీ భక్తరామదాసు నిర్మాణంతో ఈ అభిప్రాయం మారింది. పాలేరు జలాశయం బ్యాక్‌వాటర్‌ ఆధారంగా భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మించడంతో ఖాళీగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గ్రామాల్లోని చెరువులకు మళ్లిస్తామన్న మాటలు కార్యరూపం దాల్చడంతో ఏళ్లుగా బీళ్లుగా ఉన్న భూములు పచ్చగా రెపరెప లాడుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు మదిలో పుట్టిన ఈ ఆలోచనతో వెంటనే సీఎం కేసీఆర్‌కు చెప్పి నిధులు మంజూరు చేయించారు. వెంటనే పనులు ప్రారంభించి రికార్డుస్థాయిలో ఆరునెలల్లోనే నిర్మాణం పూర్తి చేశారు.  తెలంగాణ ఎర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసి పూర్తిచేసిన తొలిప్రాజెక్టుగా భక్తరామదాసు నిలిచింది. 


ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు

పాలేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో తుమ్మల నాగేశ్వరరావు బీళ్లుగా ఉన్న పాలేరు నియోజకవర్గం భూములను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. పాలేరు జలాశయం బ్యాక్‌వాటర్‌ వాడుకుంటూ ఎస్సారెస్పీ కాల్వలను ఉపయోగంలోకి తీసుకొస్తూ రూ.307కోట్లతో భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు పనులను తుమ్మల దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో 14గ్రామాల్లో 16,286 ఎకరాలకు, కూసుమంచి మండలంలో 13 గ్రామాల్లో 23,418 ఎకరాలకు, ఖమ్మంరూరల్‌ మండలంలో 12 గ్రామాల్లో 12,605 ఎకరల్లో, నేలకొండపల్లి మండలంలో 2959 ఎకరాలకు నీరు అందుతోంది. 

Updated Date - 2021-02-28T05:03:26+05:30 IST