బండ రూపంలో ఉండే వెంకటేశ్వర స్వామి నా కంటే ఎక్కువా..

Published: Thu, 07 May 2020 16:30:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బండ రూపంలో ఉండే వెంకటేశ్వర స్వామి నా కంటే ఎక్కువా..

కర్నూలులో సమస్య వస్తే ఆయనను ఎవడూ అడగరు

40 ఏళ్ల క్రితం ఆయనకు 500 మంది భక్తులు కూడా లేరు

లత్కోర్లు, పనికిరాని వాళ్లందరివి అయ్యాక నా ఓపెన్ హార్ట్ అవుతోంది

ఓ నత్తిగుడ్డి చానెల్‌ చేసిన ప్రచారం అది

నేను పురుషుడినా, స్త్రీనా, నపుంసకుడినో నాకే తెలియదు.

ప్రజలకోసం జీవిస్తున్నా, వ్యక్తిగతంగా మరణించి ఉన్నా

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో బాలసాయిబాబా


బాలసాయిబాబా.. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆరోపణలు.. వాటన్నింటికీ సమాధానాలిచ్చారు. తనకు అయిదు పీహెచ్‌డీలు ఉన్నాయని చెబుతున్నారు. విధే తనను బాబాను చేసిందంటున్నారు. తానెప్పుడూ ఏ దేవుడికీ పూజలు చేయలేదనీ, వారికి ఉండే పాపులారిటీ వారికి ఉంటే తనకున్న పాపులారిటీ తనకు ఉందంటున్నారు. ఆయా దేవుళ్ల గురించి చెబితే వారి భక్తులు హర్ట్ అవుతారని బాలసాయిబాబా చెబుతున్నారు. తన మాటే మంత్రమనీ, ఏ మాయలు చేయనక్కర్లేదని ఆయన అంటున్నారు. ప్రజల కోసమే తాను ఉన్నాననీ, డబ్బు యావ తనకు లేదని చెబుతున్న బాలసాయిబాబా... ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 06-03-2016న ఏబీఎన్ చానెల్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు....

 

ఆర్కే : మహిమలతో బాబా అయ్యారు. ఏదైనా మహిమతో ఈ ప్రొగ్రామ్‌ మొదలుపెడదామా?

బాలసాయిబాబా : ఇది నిదర్శనే కాని ప్రదర్శన కాదు కదా.

 

ఆర్కే : ఈ ప్రొగ్రామ్‌ చూసే ప్రేక్షకులకు నమ్మకం కలగాలి కదా?

బాలసాయిబాబా : వాళ్ల నమ్మకాలు వాళ్లకున్నాయి. కొత్త భక్తులను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మిన భక్తులను ఉద్దరిస్తే సరిపోతుంది. శివుని భక్తులు శివునికి, వెంకటేశ్వరస్వామి భక్తులు వెంకటేశ్వరస్వామికి, నా భక్తులు నాకు ఉన్నారు. ఎవరి దగ్గరా నేను రూపాయి తీసుకుంది లేదు. నేనే విదేశీ భక్తులు ఇచ్చిన కొన్ని వందల కోట్ల రూపాయలను ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాను. మహిమ అంటే చూపేదే కాకుండా ఎవడైతే కష్టాల్లో ఉన్నాడో వాన్ని ఉద్దరించి, మనశ్శాంతి కలిగిస్తే అది కూడా మహిమే.

 

ఆర్కే : మీరు దేవుడనుకుంటారా?

బాలసాయిబాబా : నేను ఏంటనేది నాకే తెలియదు. వజ్రం ఎప్పుడూ వజ్రం అనుకోదు. నేను దేవుడినే అయితే మనమిద్దరం ఇక్కడ కూర్చుండే వాళ్లమే కాదు. కలిస్తే స్వర్గంలో కలవాలి లేక దేవలోకంలో కలవాలి. అంటే అర్థమేమిటి. మనిషి చావు గురించి మాట్లాడుతారు. కానీ చావు తరువాత ఇలా ఉంటుందని చెప్పిన వాడు లేడు. చచ్చిపోయి తిరిగి వచ్చిన వాడు లేడు. కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవడం వృథా. పదిమందికి మంచి చేసే వాడే దేవుడు.

 

ఆర్కే : అలాంటప్పుడు భగవాన్‌ అని ఎందుకు పెట్టుకున్నారు?

బాలసాయిబాబా : వ్యక్తిగతంగా నేను పెట్టుకున్నది ఏదీ లేదు. చెట్టు వేసింది నేను. ఆ చెట్టు కింద కూర్చుని పండ్లను రాళ్లతో కొడుతున్న వారు వేరే. ఇప్పుడు జనాలంతా ఇటువంటి వారే.

 

ఆర్కే : విదేశీ విరాళాలు సంవత్సరానికి ఎంతొస్తాయి?

బాలసాయిబాబా : దీనికి కొలతంటూ ఉండదు. ప్రజలు ఊహిస్తునట్టుగా వందలు, వేల కోట్లు మాత్రం రావు. కొడుకు అమెరికా పోవాలనో, మరొకటో దేవునికి మొక్కుకుంటారు. కోరిక నెరవేరితే వెంకటేశ్వరస్వామికో, నాకో హుండీలో వేస్తారు.

 

ఆర్కే : మీరు వెంకటేశ్వరస్వామి సమానమా?

బాలసాయిబాబా : నాకు తెలిసి 40 ఏళ్ల క్రితం వెంకటేశ్వరుని స్వామిని దర్శించుకున్న వారు 500 మంది కూడా లేరు.

 

ఆర్కే : మరి ఆయన పాపులర్‌ అయ్యారు. మీరు అన్‌పాపులర్‌ అయినట్టా?

బాలసాయిబాబా : అట్లా ఏంలేదే? ఆయన పాపులారిటీ ఆయనకుంది. నా పాపులారిటీ నాకుంది. ఒకరోజు కూడా ఎవ్వరినీ దేహీ అని బ్రెడ్‌ ముక్క కూడా అడగలేదు. నేను పదిమందికీ ఇస్తూ వస్తున్నాను. ఇప్పటికీ కర్నూలు జిల్లాలో ఏదయినా సమస్య వస్తే వెంకటేశ్వరస్వామి దగ్గరకు వెళ్లి ఎవడూ అడగడు. బాలసాయిబాబానే అడుగుతారు.

బండ రూపంలో ఉండే వెంకటేశ్వర స్వామి నా కంటే ఎక్కువా..

మనకు ఇస్త్రీ తప్ప మరొకటి తెలియదు


ఆర్కే : ఇండియన్స్‌ కన్నా విదేశీయులు తెల్లవాళ్లు వచ్చి ఎక్కువ డబ్బులిస్తుంటారు ఎందుకుని?

బాలసాయిబాబా : అలా అనుకుంటున్నారని అంటున్నా.


ఆర్కే : వందలకోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది?

బాలసాయిబాబా : అదే చెబుతున్నా. అంత ఆదాయం లేదు. కోట్ల రూపాయలు వస్తున్నాయని ఊహిస్తున్నారంతే. 25 ఏళ్ల క్రితమే నేను భూములు కొన్నా. వాటి విలువలు పెరిగాయంతే. భూములు ఎవడూ ఎత్తుకుపోయేది కాదు. రాజ్యాలు నశించినా, పోరాటాలు సాగినా భూమి గురించే. 

 

ఆర్కే : భూమి, స్త్రీ....

బాలసాయిబాబా : మనకు ఇస్త్రీ తప్ప మరొకటి తెలియదు.(నవ్వులు)

 

ఆర్కే : మీ కుటుంబ నేపథ్యం ఏంటి?

బాలసాయిబాబా : మాది సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. మేం కేరళ నుంచి వచ్చిన వాళ్లం అనుకుంటారు. కానీ కాదు. మా పూర్వీకులు కాజీపేట(కడప)నుంచి కర్నూలుకు వచ్చి స్థిరపడ్డారు. మా అమ్మ వాళ్లది ఆధునిక కుటుంబం అయితే మా నాన్న వాళ్లది సనాతన సంప్రదాయ కుటుంబం.

 

ఆర్కే : మీ ఇంటి పేరేంటి?

బాలసాయిబాబా : కందనూరు.

 

ఆర్కే : మీరెంత మంది అన్నదమ్ములు?

బాలసాయిబాబా : ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు.

 

ఆర్కే : ఇప్పుడు పీఠాధిపతులు, స్వాములు వేల ఎకరాలు సంపాదిస్తున్నారు కదా?

బాలసాయిబాబా : లేదు. మన వాళ్లకు తెలియదు.

 

ఆర్కే : మీక్కూడా భూములు ఉన్నాయి కదా?

బాలసాయిబాబా : ఎక్కడ?

 

ఆర్కే : దేవుడ్ని చూసిన వాళ్లు లేరు కదా. ఇక్కడ మీరే దేవుడు కాబట్టి ఆ ప్రశ్న ఎందుకంటారా?

బాలసాయిబాబా : దేవుడినని నేను అనడం లేదు. ప్రజలు అంటున్నారు. నన్ను స్నేహితుడని అనుకుని వచ్చే వారికి స్నేహితుణ్ణి. గురువు అనుకుని వచ్చే వారికి గురువుని.

 

ఆర్కే : మీ దగ్గరకు వచ్చే వారికి ఏం చెబుతుంటారు?

బాలసాయిబాబా : కష్టాలు తీర్చమని వస్తుంటారు.

బండ రూపంలో ఉండే వెంకటేశ్వర స్వామి నా కంటే ఎక్కువా..

మేం ముగ్గురం ఒక్కటే అని చెప్పాల్సి వస్తుంది..


ఆర్కే : మీ తాతలు మంచి ఉద్యోగాలు చేశారు కదా? మీరు అటువైపు వెళ్లకుండా ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు?

బాలసాయిబాబా : మనిషి కోరికలతో పుడతాడు. ఫలానా చోటనే జన్మించాలనే జన్మిస్తాడు. ఒక కారణంతోనే జన్మిస్తాడు. నరసింహస్వామిని చూసిన వాళ్లు ఎవరూ లేరు. ప్రహ్లాదుడు కోరిక మేరకు వచ్చాడు, పని కానిచ్చి వెళ్లిపోయాడు. అంతే..ఏం మాట్లాడుకుంటున్నాం.


ఆర్కే : ఈ లైన్‌లోకి ఎలా వచ్చారని? 

బాలసాయిబాబా : ఈ లైన్‌ సెలక్ట్‌ చేసుకున్నది కాదు. ముందే సెలక్ట్‌ చేయబడ్డది. విధి లిఖితం నేను ఇక్కడకు పొమ్మని. విధి రాతను విధాత అయినా మార్చలేడు కదా!

 

ఆర్కే : నేను అడుగుతున్నది అదే. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా. అలాంటప్పుడు బాబాల దగ్గరకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఏముంటుంది?

బాలసాయిబాబా : కాదు కాదు. జబ్బు చేసినప్పుడు డాక్టర్‌ దగ్గరకు వెళ్లకుండా ఉండలేరు కదా. డాక్టర్‌ దగ్గరకు వెళితేనే ఉపశమనం లభిస్తుంది. విధిని తప్పించ విధాతకు సాధ్యం కాదు. కానీ నేను కొత్త కొటేషన్‌ చెబుతాను. మదితో విధినైనా తప్పించవచ్చు. ఇప్పుడు షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా, బాల సాయిబాబా పరంపరనే తీసుకుందాం.

 

ఆర్కే : మీరు ముగ్గురూ ఒక్కటేనా?

బాలసాయిబాబా : అనే చెప్పాల్సి వస్తుంది.

 

ఆర్కే : మీ ముగ్గురిలో దైవత్వం ఉందనా?

బాలసాయిబాబా : కాదు. షిరిడి సాయిబాబాలో ఏముందో మీరైతే చూడలేదు. ఆ పీరియడ్‌లో మీరు లేరు. ఇక రెండో ఆయన విషయానికొస్తే... ఆయన గురించి కాకరకాయ కథలు ఎన్ని వచ్చాయో అన్నీ తెలుసు... ఆయన గురించి.. ఆయన దగ్గర ఉన్న వారి కంటే నాకే ఎక్కువ తెలుసు.. ఇక డబ్బంటారా... నాకు ఇంతవరకు లక్ష రూపాయలు ఎంచడం కూడా రాదు.

 

ఆర్కే : మరి కోట్లు ఉన్నాయి కదా?

బాలసాయిబాబా : ఉంటుండేవి కదా అనాలి.

 

ఆర్కే : ఇప్పుడు లేవా?

బాలసాయిబాబా : నా దగ్గర ఎలాంటి అరమరికలు లేవు. నా దగ్గర ఉన్నాయని అంటే దోచుకుంటారా? లేదు కదా?

 

ఆర్కే: అబ్బే నాకవసరం లేదు?

బాలసాయిబాబా : పర్లేదు రండి. కలిసి పంచుకుందాం(నవ్వులు). నాకు పంచుకునే అలవాటు ఎక్కువ. మన దగ్గర మిఠాయి ఉందనుకోండి. మనం కొంచెం తిని నలుగురికి కాస్త పంచితే తృప్తిగా ఉంటుంది. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

 

ఆర్కే : మీ దినచర్య ఎలా ఉంటుంది?

బాలసాయిబాబా : ప్రజల గురించి ఆలోచించడమే. వారి కష్టాలు వినడమే.

బండ రూపంలో ఉండే వెంకటేశ్వర స్వామి నా కంటే ఎక్కువా..

మీదేం పోయింది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ


ఆర్కే : మీరు దేవుడని భావిస్తున్నప్పుడు మీ వెనకాల వినాయకుడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి బొమ్మలున్నాయి ఎందుకు?

బాలసాయిబాబా : వారిని ఏమన్నా అంటే భక్తులు హర్ట్‌ అవుతారు. అప్పటికప్పుడు మీతో మాట్లాడి ఉపశమనం అందించి పంపించే నేను ఎక్కువా, బండ రూపంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఎక్కువా. మీరే ఊహించుకోండి?


ఆర్కే : మీ దృష్టిలో వెంకటేశ్వరస్వామి కన్నా మీరే ఎక్కువ. అవునా? 

బాలసాయిబాబా : అది కూడా అనను. దేవుని కన్నా ముందు పుట్టింది నమ్మకం. నమ్మకం ముఖ్యం.

 

ఆర్కే : మీ బోటి వాళ్లందరూ కలిసి నమ్మకంలో నుంచి భయం సృష్టిస్తున్నారు. భయపెట్టి భక్తులుగా మారుస్తున్నారు. అవునా కాదా?

బాలసాయిబాబా : మనం అరగంట నుంచి మాట్లాడుకుంటున్నాం. నేను మిమ్మల్ని చూసి భయపడుతున్నానే తప్ప మీరు భయపడటం లేదు.

 

ఆర్కే : నేను భయపడను.

బాలసాయిబాబా : మీదేం పోయింది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. అవసరమైతే టపాకాయలు తెచ్చి అక్కడ పెడతారు లేదంటే నా గౌన్‌ కింద పెడతారు. అది పెట్టించుకుందామా వద్దా అనేది నేను చూసుకోవాలి(నవ్వులు).

 

ఆర్కే : మీ దగ్గరకు వచ్చే వారికి మీరే దేవుడయినపుడు మళ్లీ మీరు దేవుణ్ణి పూజించడం ఎందుకు?

బాలసాయిబాబా : నేనేం పూజించనే.

 

ఆర్కే : అక్కడ దేవుని దగ్గర పూలు పెట్టారు కదా?

బాలసాయిబాబా : అవి నేను పెట్టలేదు. అవన్నీ వాళ్లు చూసుకునేవి.

 

ఆర్కే : పీఠాధిపతులైనా, మఠాధిపతులైనా ప్రజలచేత పూజింపబడాలి, గౌరవింపబడాలి. కానీ ఆస్తుల విషయంలో వివాదాలు ఎందుకు వస్తున్నాయి?

బాలసాయిబాబా : విస్తరిస్తున్న కొద్దీ వచ్చే సమస్యలే. ప్రస్తుతం ట్రస్టులో ఇద్దరం మాత్రమే ఉన్నాం. ఒకటి నేను, ఇంకొకరు రామారావు. ట్రస్టు విస్తరించినపుడు, విభాగాలు పెరిగినపుడు సమస్యలు సహజంగానే వస్తుంటాయి. ఒకరి మాట మరొకరు వినని పరిస్థితి వస్తుంటుంది.

 

ఆర్కే : మీరు హెయిర్‌కట్‌ చేయించుకుంటారా?

బాలసాయిబాబా : హెయిర్‌ అంటూ ఉంటే స్నానం చేయాల్సిందే. హెయిర్‌ ఉంటే సంస్కరించుకోవాల్సిందే.

 

ఆర్కే : మీ హెయిర్‌స్టయిలిస్ట్‌ ఎవరో తెలుసుకుందామని?

బాలసాయిబాబా : మీరు వెళతారా?

 

ఆర్కే : నాకు అవసరం లేదు? తెలుసుకుందామని?

బాలసాయిబాబా : నాకు నేనే చేసుకుంటాను. స్నానం చేస్తున్నపుడు హెయిర్‌ చిన్నగానే ఉంటుంది. తరువాత హెయిర్‌ను రింగ్‌లుగా చేయాల్సి ఉంటుంది.

బండ రూపంలో ఉండే వెంకటేశ్వర స్వామి నా కంటే ఎక్కువా..

మీరు బి.వి పట్టాభిరామ్‌ను పెట్టుకున్నారు కదా..


ఆర్కే : రోజూ రెడీ కావడానికి చాలా టైం పడుతుంది కదా?

బాలసాయిబాబా : చాలా.


ఆర్కే : నలభై ఏళ్లుగా ఇదే గెటప్‌లో ఉండి బోర్‌ కొట్టలేదా?

బాలసాయిబాబా : అలవాటుగా మారింది.


ఆర్కే : చిన్నతనంలో బాగా పేదరికంలో ఉన్నారని, సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్‌ టిక్కెట్లు అమ్మే వారని కూడా ప్రచారం జరిగింది. నిజం ఏంటి? 

బాలసాయిబాబా : ఆ మాట అన్న వ్యక్తి మీడియా వ్యక్తి కాకుండా మరొకరు అని ఉంటే వాని స్నేహితులు, మరో నలుగైదురు అనే వారు. మీడియా ఒకవైపు స్టాండ్‌ తీసుకోవడం తెలిసిందే. ఒక నత్తిగుడ్డి చానెల్‌ చేసిన ప్రచారం అది. ఆ చానెల్‌ ఇప్పుడు ప్రమోటర్‌ను కూడా నేనే.

 

ఆర్కే : బాబాలు సైతం ఈర్షాఅసూయద్వేషాలకు అతీతంగా లేరు కదా?

బాలసాయిబాబా : మిగతా వారి సంగతి నాకు తెలియదు. నాలో మాత్రం అవి లేవు. మీరు అవి వచ్చేలా చేయనూ లేదు(నవ్వులు)

 

ఆర్కే : మహిమలు ఎక్కడ నేర్చుకున్నారు. ఒక్కటైనా మహిమ చూపించండి?

బాలసాయిబాబా : మీరు రండి. చూపిస్తాను. మహిమ అంటే మాటే.

 

ఆర్కే: ఇక్కడ చూపించండి? లక్షల మంది భక్తులుగా మారతారు కదా?

బాలసాయిబాబా : బి.వి పట్టాభిరామ్‌ను పెట్టుకున్నారు కదా.

 

ఆర్కే : ఆయన మెజీషియన్‌ కదా?

బాలసాయిబాబా : మమ్మల్ని అదే అన్నారు కదా.

 

ఆర్కే : అంటే ఎంతసేపు అడిగినా మహిమను ప్రదర్శించరా?

బాలసాయిబాబా : లేదు. ఇప్పుడు ఇద్దరం ఇక్కడ మిత్రులం అంతే.

 

ఆర్కే : మీ జన్మకు సార్థకత ఏంటి? ఏం సాధించినట్టు?

బాలసాయిబాబా : ఒక సైన్స్‌ టీచర్‌ ఏం సాధించాల్సిన పనిలేదు. తరగతి గదిలో పిల్లలకు సైన్స్‌ పాఠాలు సరిగ్గా చెబితే చాలు. అలాగే విశ్వమానవ ప్రేమ మానవత్వమే. మంచే దేవుడు, దేవుడే మంచి. నువ్వు మంచి చేయి మంచిని పొందుతావు.

 

ఆర్కే : అంటే మీరు దైవ చింతన బోధిస్తారా? సన్మార్గంలో నడవమని చెబుతున్నారా?

బాలసాయిబాబా : కరెక్ట్‌. సనాతనమైన విషయాన్ని అధునాతనంగా జోడించి చెబుతున్నాను.

 

ఆర్కే : ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా?

బాలసాయిబాబా : అసలు పెళ్లి అనేది ఒకటి ఉంటుందనే విషయం తెలియదు. నేను పురుషుడినా, స్త్రీనా, నపుంసకుడినా, బాలుడినా, వృధ్ధుడినా నాకే తెలియదు. ప్రజలకోసం జీవిస్తున్నా, వ్యక్తిగతంగా మరణించి ఉన్నా.

 

ఆర్కే : అంత త్యాగం ఎందుకు? శరీరం అన్నప్పుడు కొన్ని వాంఛలుంటాయి కదా?

బాలసాయిబాబా : త్యాగం ఏం కాదు. జేబులో వంద రూపాయలున్నప్పుడే కదా ఖర్చు పెట్టాలని అనిపిస్తుంది.

 

ఆర్కే : అంటే మీరు ఒక పదార్థం అంతేనా?

బాలసాయిబాబా : ఒక ఆబ్జెక్ట్‌ను అంతే.


ఆర్కే : వేడుకల్లో డ్యాన్స్‌లను ఎలా సమర్థిస్తారు?

బాలసాయిబాబా : అవి అప్పుడు తీసినవి కాదు. ఎప్పుడో బర్త్‌డే, శివరాత్రి వేడుకల్లో తీసి టెక్నాలజీతో మార్చి చూపించినవే. నేను ముఖాముఖి బయటకు వచ్చింది ఇదే మొదటిసారి.


ఆర్కే : బర్త్‌డే రోజు మాత్రమే శివలింగాన్ని తీస్తారా?

బాలసాయిబాబా : శివరాత్రి రోజున.


ఆర్కే : భక్తులతో ఎప్పుడైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా? 

బాలసాయిబాబా : లేదు.

 

ఆర్కే : భగవంతునిగా పిలిపించుకునే మీరు కోర్టు మెట్లే ఎక్కే సమయంలో ఎలా ఫీలయ్యారు?

బాలసాయిబాబా : న్యాయాలయం అయినా, దేవాలయం అయినా నాకు ఒకటే. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఫీలవ్వలేదు.

 

ఆర్కే : రాజకీయ నాయకులను పిలిపించుకోవడం ద్వారా ప్రచారం కోసం ప్రయత్నిస్తారని అంటారు. నిజమేనా?

బాలసాయిబాబా : అదే నిజమైతే ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కే ఇన్ని ఎపిసోడ్‌లు సాగినాక నేను రావడం ఎందుకు జరిగేది. లత్కోర్లు, పనికిరాని వాళ్లు అందరివీ అయ్యాక నాదవుతోంది. అలా లాబీయింగ్‌ చేసే వాణ్ణయితే ముందే వచ్చేది కదా.

 

ఆర్కే : మీకు ఎన్ని భాషలొచ్చు?

బాలసాయిబాబా : విదేశీ భాషలతో కలిపి 18 భాషలు వచ్చు.

 

ఆర్కే : సమాజంలో నావల్ల ఈ మేలు జరిగింది అని వాక్యంలో చెప్పండి?

బాలసాయిబాబా : మనను నమ్ముకుని ఉన్న వాళ్లను ఎంత మందిని ఉద్దరించాము అన్నదే ముఖ్యం. ట్రస్టును స్థాపించిందే అందుకు.

 

ఆర్కే : వెంట్రుకలు కొన్ని తెల్లబడ్డాయి కదా?

బాలసాయిబాబా : అవునా! ఎక్కడ.

 

ఆర్కే : రంగేసినట్టున్నారు?

బాలసాయిబాబా: నిజమే అనుకుని షాక్‌ అయ్యా. కనబడని చోట ఏమైనా ఉన్నాయో ఏమోనని(నవ్వులు)

 

నేను పదహారో ఏట నుంచే కెరీర్‌ ప్రారంభించా. జ్ఞానీజైల్‌సింగ్‌ నుంచి ఇప్పటి వరకు అందరూ బాబాను దర్శించుకున్న వారే.


ట్రస్ట్‌కు నేను ఫౌండర్‌ని, చైర్మన్‌ని. భక్తులు ఇచ్చిన డబ్బంతా నా కోసమే ఇచ్చారు.


జర్మన్‌ భక్తుడొకరు బెంజ్‌ కారును బహుమతిగా ఇచ్చారు. కస్టమ్స్‌ వారికి కారు ధర చెల్లించి తీసుకున్నాను.


వ్యక్తిగత కోరికలతోనే దేవుని దగ్గరకు వెళుతున్నారు.


నాకు ఐదు పీహెచ్‌డీలున్నాయి. థియాలజీలో కూడా పీహెచ్‌డీ చేశాను.


శ్రీపాదరావు గారు ఒకరోజు మంత్రులందరినీ సమావేశ పరుస్తాను. ఒకసారి వచ్చి దర్శనం ఇయ్యండి అన్నారు. కానీ దాహం వేసే వాడు చెరువు దగ్గరకు వెళ్లాలే తప్ప చెరువు దగ్గరకు రాదు. మీకు భక్తుంటే మీరే రండి అని చెప్పాను.


అంతా దగ్గరే పెట్టుకోకుండా పక్కవాడికి కూడా కొంత ఇస్తే వాడి ఏడుపు ఉండదు. మనకూ మనశ్శాంతి లభిస్తుంది.


నేను ధరించేది అంగారక. లోపల ధోతీ ఉంటుంది. దాన్ని పైన కవర్‌ చేస్తూ కాళ్ల వరకు గౌన్‌ ఉంటుంది.


నా గురించి నేను తెలుసుకునే సమయం లేదు. ప్రజల గురించే నా ఆలోచన.


డీజీపీ ఆఫీస్‌ ముందు దొరికింది నా డబ్బే. భూమి కొనడం కోసం మా పర్సనల్‌ అడ్వైజర్‌కు చెక్‌ ఇచ్చా. ఆయన దాన్ని క్యాష్‌గా మార్చి తీసుకెళ్లే క్రమంలో దొరికింది.

నేను ఎప్పుడు చనిపోతానో చెప్పడం ఎందుకు?

 

బతికి ఉన్నప్పటి కంటే చనిపోయిన తరువాత పూజలందుకున్న వాడే గొప్పవాడు.


మీడియానే నాకు మంచికీ, చెడుకూ సహకరించింది.


నా దర్శనం కోసం కేంద్రమంత్రి నిరీక్షిస్తున్నా బయటకు రాని నేను మీరు పిలిస్తే వచ్చానంటే అదే మీ గురించి నా అనాలసిస్‌.


అందరిలా అన్నమే తింటాను. వ్యాయామాలు చేయను.

ఆర్కే : మీ వల్ల సమాజానికి మంచి జరగాలని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్‌.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.