20 గంటలు... లక్ష మెట్లు!

ABN , First Publish Date - 2020-11-23T02:14:40+05:30 IST

జంధ్యాల తీసిన ఒక సినిమాలో సుత్తి వీరభద్రరావుకు నడక అలవాటు ఉంటుంది. గదిలో పెట్టినా సరే, అక్కడే ఉన్న బల్ల మీద వాకింగ్‌ చేస్తూ నవ్వులపూలు పూయిస్తాడు. అయితే 28 ఏళ్ల బాలాజీ సూర్యవంశీ మాత్రం సీరియస్‌గా.....

20 గంటలు... లక్ష మెట్లు!

జంధ్యాల తీసిన ఒక సినిమాలో సుత్తి వీరభద్రరావుకు నడక అలవాటు ఉంటుంది. గదిలో పెట్టినా సరే, అక్కడే ఉన్న బల్ల మీద వాకింగ్‌ చేస్తూ నవ్వులపూలు పూయిస్తాడు. అయితే 28 ఏళ్ల బాలాజీ సూర్యవంశీ మాత్రం సీరియస్‌గా ఇంట్లోనే లక్షకు పైగా మెట్లు ఎక్కి దిగుతూ... 68 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించాడు. 


మహారాష్ట్రలోని థానేకు చెందిన బాలాజీ సూర్యవంశీ రెగ్యులేటరీ ఎఫైర్స్‌ ప్రొఫెషనల్‌గా పని చేస్తున్నాడు. వయసు 28 ఏళ్లే అయినా భారీకాయంతో ఉండేవాడు. బరువు తగ్గేందుకు నడకను మించిన మార్గం లేదని గ్రహించి, ఈ ఏడాది ప్రారంభంలో ఇంట్లోనే వాకింగ్‌ మొదలెట్టాడు. ఇంట్లోని మెట్లు ఎక్కడం, దిగడం... ఇలా సాగేది అతడి వాకింగ్‌. అలా చేయడం వల్ల కేవలం రెండు నెలల్లోనే 15 కిలోల బరువు తగ్గాడు. దాంతో అతడిలో పట్టుదల పెరిగింది. సరదాగా ఒక రికార్డు సృష్టిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే మెట్లు లెక్కించడానికి గూగుల్‌ ఫిట్‌లో ‘స్టెప్స్‌ యాప్‌’ సాయం తీసుకున్నాడు. సెప్టెంబర్‌ 20న అర్థరాత్రి 12 గంటలకు ఇంట్లోనే నడక ప్రారంభించి సాయంత్రం 7.55 గంటలకు పూర్తి చేశాడు. అంటే 19 గంటల 55 నిమిషాల్లో అతడు అక్షరాల ఒక లక్షా నూట ఇరవై ఎనిమిది మెట్లు ఎక్కి దిగాడు. ఆ దూరం 67.8 కిలోమీటర్లుగా నమోదయ్యింది. ఈ రికార్డును గుర్తించిన ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నిర్వాహకులు అతడికి అక్టోబర్‌ 3న సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.


నొప్పి నివారిణి వాడుతూనే...

ఆరుబయట నడకకు, ఇంట్లో నడకకు చాలా తేడా ఉంటుంది. ఏకబికిన ఇంట్లో మెట్లు ఎక్కుతూ దిగుతూ నడవాలంటే అంత సులువేం కాదు. ఊపిరి పీల్చు కోవడం కూడా కష్టమవుతుంది. ‘‘నడక ప్రారంభించిన తర్వాత ప్రతీ గంటకు ఒక నిమిషం పాటు బ్రేక్‌ తీసుకునేవాడిని. శ్వాస తీసుకోవడానికి ఆ సమయం సరిపోయేది. ఆ తర్వాత క్రమక్రమంగా సమయాన్ని పొడిగించాను. కొన్ని గంటల తర్వాత ఐదు నిమిషాల బ్రేక్‌ ఇచ్చేవాణ్ణి. ఆ సమయంలో కాళ్లకు నొప్పిని నివారించే ఆయింట్‌మెంట్స్‌ రాస్తూ తిరిగి నడక మొదలెట్టేవాణ్ణి’’ అని తన అనుభవాన్ని పంచుకున్నారు సూర్యవంశీ.


లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో ఫిట్‌నెస్‌ వైపు దృష్టి సారించాడతను. ప్రతీరోజూ ఇంట్లోనే 10 వేల మెట్లు ఎక్కి దిగడం వల్ల రెండు నెలల్లో 15 కిలోల బరువు తగ్గాడు. ఆ ప్రయత్నమే అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రికార్డు సృష్టించాలనే ఆలోచనకు బీజం వేసింది. ‘‘లోకల్‌ ట్రెయిన్‌లో అరగంట నిలుచుంటే చాలు చెమటలు పట్టేవి. శ్వాస ఆడేది కాదు. భారీ కాయం వల్ల ఎక్కువ దూరం నడవలేక పోయేవాణ్ణి. ఈలోపు లాక్‌డౌన్‌ రావడంతో ఆ సమయాన్ని ఫిట్‌నెస్‌ కోసం వినియోగించుకోవాలని అనుకున్నా. నెమ్మదిగా ఇంట్లోనే ఒక ప్రయత్నం చేశా. అది సక్సెస్‌ కావడంతో రికార్డు వైపు ఆసక్తి ఏర్పడింది’’ అన్నారు సూర్యవంశీ.


డైట్‌ కూడా ముఖ్యమే...

ఈ టైపు వ్యాయామం అందరికీ సరైనది కాదనే క్లారిటీ సూర్యవంశీకి ఉంది. అందుకే అతడు ఇది కేవలం తను వ్యక్తిగతంగా చేసిందే తప్ప, ఎవరికీ చేయమని సలహా ఇవ్వనంటాడు. బరువు తగ్గేందుకు ఇంట్లోనే మెట్లు ఎక్కి దిగే వ్యాయామాన్ని ఎంచుకున్నప్పటికీ అందుకు తగ్గ డైట్‌ను కూడా అతడు ఎంచుకున్నాడు. ‘‘బరువు తగ్గే క్రమంలో డైట్‌ ప్లాన్‌ కూడా ఏర్పరచుకున్నా. అందులో భాగంగా ప్రతీరోజూ ఉదయం మూడు ఉడికించిన గుడ్లు తినేవాణ్ణి. కొన్ని రోజులు వాటి స్థానంలో ‘పోహా’ 


లేదా ఇడ్లీలు అల్పాహారంగా తీసుకునేవాణ్ణి. లంచ్‌లోకి చపాతీలు, వెజ్‌ కర్రీ, సలాడ్‌... రాత్రి డిన్నర్‌లోకి రెండు రొట్టెలు, వెజ్‌ కర్రీ, పెరుగు... ఇలా డైట్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా. జంక్‌ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉన్నా’’ అన్నారాయన. మొదట్లో రోజుకు రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, దాన్ని క్రమక్రమంగా ఐదు కిలోమీటర్లకు పెంచాడు. ఆ విధంగా కొన్నాళ్లకు రోజూ పదివేల మెట్ల ఎక్కి, దిగడం అతడికి సులువయ్యింది. ‘‘బరువు తగ్గాలను కునేవారు ముందుగా బద్ధకాన్ని వదిలించుకోవాలి. బెడ్డు దిగి వ్యాయామానికి శరీరాన్ని అలవాటు చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది’’ అంటున్న సూర్యవంశీ తన రికార్డుతో ప్రస్తుతం థానేలో సెలబ్రిటీగా మారాడు. 

Updated Date - 2020-11-23T02:14:40+05:30 IST