నవ వాగ్గేయకారుడు

ABN , First Publish Date - 2022-07-06T05:33:09+05:30 IST

అంతారామమయం.. ఈ జగమంతా రామమయం.....తక్కువేమి మనకు......ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి అంటూ రామయ్యను కీర్తిస్తూ రామదాసు రచించిన కీర్తనలకు జనబాహుల్యంలో విశేష ప్రాచుర్యం కల్పించిన ఘనత డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణకే దక్కింది..

నవ వాగ్గేయకారుడు
రామయ్య సన్నిధిలో రామదాసు కీర్తనలు ఆలపిస్తున్న బాలమురళీకృష్ణ

భక్తరామదాసు కీర్తనలకు విశేష ప్రాచుర్యం తెచ్చిన మంగళంపల్లి

నేడు పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి

భద్రాచలం, జూలై 5: అంతారామమయం.. ఈ జగమంతా రామమయం.....తక్కువేమి మనకు......ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి అంటూ రామయ్యను కీర్తిస్తూ రామదాసు రచించిన కీర్తనలకు జనబాహుల్యంలో విశేష ప్రాచుర్యం కల్పించిన ఘనత డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణకే దక్కింది.. దేశ విదేశాల్లో భక్తరామదాసు కీర్తనలకు తన గానంతో మంగళంపల్లి జీవం పోశారు. భజన సంప్రదాయంకు ఆద్యుడైన రామదాసు కీర్తనలకు యాప్తిని, దీప్తిని కలిగించిన నవ వాగ్గేయకారులు పద్మవిభూషణ్‌ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయన రామసంబంధమైన కీర్తనలను చాలా శృతిబద్దంగా ఆలపించి రామభక్తులను భక్తితన్మయత్వంలో ఓలలాడించారు. రామునిపై రామదాసు కీర్తనలు రచించగా ఆ కీర్తనలకు బహుళ ప్రాచుర్యం తెచ్చిన ఘనత మాత్రం డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణదే. నేటికి తెలుగునాట ఏ ఇంట రామదాసు కీర్తనలు విన్నా అందులో తొలుత వినపడే వాణి బాలమురళీవారిదే. రామునిపై తనకున్న మక్కువను చాటుతూ ఆయన గానం చేసిన కీర్తనలు విన్న రామభక్తుల మురిసిపోని హృదయాలు ఉండవు. రామదాసు గారి హృదయాన్ని అర్దం చేసుకొని ఆర్తితో ఆ కీర్తనలను ఆలపించి అశేష రామభక్తగణాన్ని ఆనందింపజేసారు. నేడు డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ  జయంతి. భద్రాద్రి రాముడితో ........దేవస్థానంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. 

బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఆయనదే 

భక్తరామదాసు రచించిన అజరామరమైన అమూల్యమైన రామదాసు కీర్తనలను అవలీలగా ఆలపించి దేశ విదేశాల్లో ఆబాల గోపాలాన్ని భక్తి సాగరంలో ముంచిన మహా గాయకుడు డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ.  జూలై 6వ తేదీ ఆయన జయంతి సందర్భంగా బాలమురళీకృష్ణతో భద్రాద్రికి ఉన్న అనుబంధాన్ని రామభక్తులు, భద్రాద్రివాసులు స్మరించుకుంటున్నారు.  ఆ మహా గాయకుడికి భద్రాద్రి రామునితో ఉన్న అనుబంధం అజరామరం. రెండుసార్లు భద్రాద్రికి వచ్చిన ఆయన రామదాసు రచించిన కీర్తనలను భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆలపించారు.  అపర భక్తాగ్రేసరుడుగా పేరుగాంచిన భక్తరామదాసు తన ఆరాధ్య దైవమైన రామయ్యను స్మరిస్తూ రాసి ఆలపించిన కీర్తనలకు డా. మంగళంపల్లి జీవం పోశారనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. దేశ విదేశాల్లో నాటి నుంచి నేటికి దశాబ్దాల కాలంగా రామదాసు కీర్తనలను అలవోకగా ప్రతి రామ భక్తుడు ఆలపిస్తున్నాడంటే అది డా. మంగళంపల్లి వారి చలవే. రామదాసు ఆలపించిన కీర్తనలను తన గానంతో భక్తులను మైమరిపించేందుకు క్యాసెట్లను, సీడీల రూపంలో తొలినాళ్లలో తీసుకురావడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భద్రాద్రి దేవస్థానం సైతం ఇవే పాటలను ప్రత్యేక ఉత్సవాలు, పండగ పర్వదినాల సమయంలో భక్తులకు శ్రావ్యంగా వినపడేలా మైకుల ద్వారా ప్రసారం చేయడం జరుగుతోంది. కాగా డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబరు 22న పరమపదించారు. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ తొలిసారిగా 1972లో భద్రాచలంకు రావడం జరిగింది. భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటిని పురస్కరించుకొని నిర్వహించిన వాగ్గేయకారోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన తొలిసారిగా వచ్చారు. అప్పటి భద్రాద్రి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌ అల్లూరి మూర్తిరాజు, ఇవో నాగిరెడ్డిలు మంగళంపల్లిని భద్రాచలానికి ఆహ్వానించారు. 1972లో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన వాగ్గేయకారోత్సవాలకు తొలిసారిగా డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణను ఆహ్వానించారు. ఆ సమయంలో ఆయనకు ఇచ్చిన గౌరవ పారితోషకాన్ని రామయ్యకే సమర్పించారు. రామయ్య సన్నిధిలో కూడా ఆయన కీర్తనలను ఆలపించి రామయ్యపై ఉన్న తన భక్తిని చాటుకున్నారు. 2011 ఫిబ్రవరి 10న మరోసారి భద్రాచలంకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ వచ్చారు. 

దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా 

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా ఉన్న ఆయనను భద్రాద్రి దేవస్థానం ఆస్థాన విధ్వాంసుడిగా కూడా ఉండాలని అప్పటి భద్రాద్రి దేవస్థానం ఈవో ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ కోరారు. దీంతో ఆయన అందుకు అంగీకరించడంతో భద్రాచలం దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా ఆయనను నియమించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేసి అప్పటి దేవాదాయ శాఖ కమీషనర్‌ ఆమోదంకు పంపగా అవి ఆమోదంకు నోచుకున్నాయి. దీంతో 2011 ఫిబ్రవరి 10న దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణతో భద్రాచలంలోని చిత్రకూట మండపంలో అప్పటి దేవస్థానం ఇవో ప్రమాణ స్వీకారం చేయించారు. 

Updated Date - 2022-07-06T05:33:09+05:30 IST