బల్దియా ప్రత్యేక సమావేశం రసాభాస

ABN , First Publish Date - 2021-10-24T04:54:46+05:30 IST

బల్దియా ప్రత్యేక సమావేశం రసాభాస

బల్దియా ప్రత్యేక సమావేశం రసాభాస
ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తున్న అసీఫ్‌, తదితరులు

తాండూరు: పట్టణంలో సర్వేనెంబర్‌-52కు సంబంధించి మున్సిపల్‌ స్థలం అంశం, పట్టణంలో వివిధ మున్సిపల్‌ స్థలాలు, ఆస్థుల గురించి శనివారం చైర్‌పర్సన్‌ స్వప్న అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఇతర అంశాలు తెరపైకి రావడంతో కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. ముఖ్యంగా ఎంఐఎం ఫ్లోర్‌లీడర్‌ సాజిత్‌, సీపీఐ ఫ్లోర్‌లీడర్‌ ఆసీఫ్‌ మధ్య వాగ్వివాదం జరిగి ఒకరినొకరు దూషించుకున్నారు. ఓదశలో చేయిచేసునేంత పనిచేసినట్లు సమాచారం. అయితే ఎంఐఎం ఫ్లోర్‌లీడర్‌ సాజిత్‌ కౌన్సిల్‌ సమావేశంలో అందరూ చూస్తుండగానే దాడికి యత్నించారని, దుర్భాషలాడారని సీపీఐ ఫ్లోర్‌లీడర్‌  ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఆసీ్‌ఫతోపాటు బీజేపీ, టీజేఎస్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కూడా ఫిర్యాదు చేశారు. సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించకుండానే చైర్‌పర్సన్‌ స్వప్న సమావేశం హాల్‌ నుంచి వెళ్లిపోయారు. సమావేశంలో వైస్‌చైర్‌పర్సన్‌ దీపా, ఇన్‌చార్జి కమిషనర్‌, ఆర్డీవో అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో అశోక్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో వాగ్వివాదం జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ఎలాంటి అంశాలు చర్చించి ఆమోదించలేదని, ఈనెల 28న మున్సిపల్‌ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.  

Updated Date - 2021-10-24T04:54:46+05:30 IST