భూ బకాసురుల కోరల్లో బల్దియా శివార్లు?

ABN , First Publish Date - 2020-07-07T07:52:19+05:30 IST

నగరంలో ఖాళీ స్థలాల లభ్యత అంతగా లేకపోవడంతో కబ్జాదారుల కన్ను శివార్లపై పడిందా? అక్కడి కొత్త లే-అవుట్‌లు, ఖాళీ స్థలాలు, చెరువులను హాంఫట్‌ చేయాలని చూస్తున్నారా? ఈ ప్రశ్నలకు జీహెచ్‌ఎంసీలో నూతనంగా ఏర్పాటు చేసిన అసెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు వచ్చిన ఫోన్లు

భూ బకాసురుల కోరల్లో బల్దియా శివార్లు?

హైదరాబాద్‌ సిటీ, జూలై 6(ఆంధ్రజ్యోతి): నగరంలో ఖాళీ స్థలాల లభ్యత అంతగా లేకపోవడంతో కబ్జాదారుల కన్ను శివార్లపై పడిందా? అక్కడి కొత్త లే-అవుట్‌లు, ఖాళీ స్థలాలు, చెరువులను హాంఫట్‌ చేయాలని చూస్తున్నారా? ఈ ప్రశ్నలకు జీహెచ్‌ఎంసీలో నూతనంగా ఏర్పాటు చేసిన అసెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు వచ్చిన ఫోన్లు చూస్తే అవుననే సమాధానం వినవస్తోంది. 18005990099 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు మొదటి రోజైన సోమవారం ఏకంగా 316 కాల్స్‌ వచ్చాయి. వీటిలో బల్దియా బయటి మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనివే 275 ఉండడం గమనార్హం. గ్రేటర్‌ పరిధికి సంబంధించి 41 కాల్స్‌ మాత్రమే వచ్చాయని ఈవీడీఎం అధికారులు తెలిపారు. బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్‌, మణికొండ, పుప్పాల్‌గూడ, మహేశ్వరం తదితర ప్రాంతాల్లోని పార్కులు, చెరువులను భూ బకాసురులు మింగేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ స్థానికులు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. బాచుపల్లిలోని కేవీఆర్‌ రెయిన్‌ బో చిల్డ్రన్‌ పార్కును కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని ట్విట్టర్‌లో కేటీఆర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. గ్రేటర్‌కు సంబంధించి తమ ఖాళీ స్థలాల గురించి 15 మంది.. పార్కులు, చెరువుల కబ్జాపై 13 మంది ఫోన్‌లో సమాచారమిచ్చారు. ఎల్‌బీనగర్‌ జోన్‌ నుంచి అత్యధికంగా 14 ఫిర్యాదులు రాగా.. అత్యల్పంగా సికింద్రాబాద్‌ జోన్‌ నుంచి మూడు వచ్చాయి. ఇక గ్రేటర్‌లో పార్కులకు సంబంధించి 13, చెరువులపై 13, ఖాళీ స్థలాలపై 15 ఫిర్యాదులు అందాయి. జోన్ల వారీగా చూస్తే ఎల్‌బీనగర్‌ 14, చార్మినార్‌ 4, సికింద్రాబాద్‌ 3, ఖైరతాబాద్‌ 6, కూకట్‌పల్లి 7, శేరిలింగంపల్లి నుంచి 7 కాల్స్‌ వచ్చాయి. కాగా, అసెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ గ్రేటర్‌ పరిధికి సంబంధించినది మాత్రమేనని జీహెచ్‌ఎంపీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. బల్దియా పరిధిలోని పార్కులు, చెరువులు, ఖాళీ స్థలాల కబ్జాపై మాత్రమే ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - 2020-07-07T07:52:19+05:30 IST