రోడ్డు మీద తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న ఈయనెవరో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-09-28T23:06:59+05:30 IST

భారత్‌లో బుల్లితెర ప్రేక్షకులపై ధారావాహికల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హిందీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన ధారావాహికల్లో...

రోడ్డు మీద తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న ఈయనెవరో తెలిస్తే..

తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న ‘బాలికా వధు’ దర్శకుడు..!

యూపీ: భారత్‌లో బుల్లితెర ప్రేక్షకులపై ధారావాహికల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హిందీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన ధారావాహికల్లో ‘బాలికా వధు’ కూడా ఒకటి. ‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకూ ఈ ధారావాహిక సుపరిచితమే. ఈ ధారావాహిక దర్శకుల్లో ఒకరైన రామ్ వృక్ష గౌర్ ప్రస్తుతం కూరగాయలు అమ్ముకుంటున్నారు.


అంతలా ప్రేక్షకుల్లో ఆదరణ పొందిన ‘బాలికా వధు’ దర్శకుల్లో ఒకరైన గౌర్ కూరగాయలు అమ్ముకోవడం ఏంటని కొట్టిపారేయకండి. ఇది ముమ్మాటికి నిజం. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల నష్టపోయిన వారిలో గౌర్ కూడా ఒకరు. యూపీలోని అజమ్‌ఘర్ పట్టణంలో గౌర్ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటూ కనిపించారు. ఇదేంటని.. మీడియా ఆరా తీయగా.. ఓ సినిమా తెరకెక్కించాలనే ఉద్దేశంతో తాను అజంఘర్ పట్టణానికి వచ్చానని, ఇక్కడికి వచ్చిన కొన్నాళ్లకు లాక్‌డౌన్ విధించారని.. తిరిగి వెళ్లలేకపోయినట్లు ఆయన చెప్పారు. 


అయితే.. ఇలా ఉండగానే.. ఈ చిత్ర నిర్మాత సినిమా నిలిపివేసినట్లు.. మరో సంవత్సరం తర్వాత సినిమా గురించి ఆలోచిద్దామని తనకు చెప్పినట్లు రామ్ వృక్ష గౌర్ చెప్పారు. ఆ సమయంలో.. తన తండ్రి చేసిన కూరగాయల వ్యాపారాన్ని తానూ మొదలుపెట్టానని గౌర్ వివరించారు. తనకు కూరగాయల వ్యాపారం తెలుసని, కూరగాయలు అమ్ముకుంటున్నందుకు తానేమీ విచారం వ్యక్తం చేయడం లేదని గౌర్ చెప్పారు. 2002లో తాను ఒక స్నేహితుడి ద్వారా ముంబై వచ్చానని, ఇండస్ట్రీలోని లైట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడినని గౌర్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టీవీ సీరియల్స్ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశానని చెప్పారు. తాను తొలుత చాలా సీరియల్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని, ఆ తర్వాత ‘బాలికా వధు’ సీరియల్‌కు ఎపిసోడ్ డైరెక్టర్‌గా, యూనిట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు రామ్ వృక్ష గౌర్ తెలిపారు.

Updated Date - 2020-09-28T23:06:59+05:30 IST