భగ్గుమన్న బాలినేని!

ABN , First Publish Date - 2022-04-11T08:04:42+05:30 IST

భగ్గుమన్న బాలినేని!

భగ్గుమన్న బాలినేని!

రాజీనామాకు సిద్ధమైన నేత

‘ఆదిమూలపు’ కొనసాగింపుపై అసంతృప్తి

నమ్మించి మోసం చేశారని ధ్వజం

రెండుసార్లు చర్చించిన సజ్జల

తనకు అన్యాయమంటూ బాలినేని ఆక్రోశం

ఒంగోలులో అనుచరుల నిరసనల హోరు

సీఎం దిష్టిబొమ్మ దహనం.. రాజీనామాలకు సై


విజయవాడ/ఒంగోలు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సమీప బంధువు, ‘మాజీ’గా మారిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. తనను కేబినెట్‌ నుంచి తొలగించడం... అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్‌ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారు. బాలినేనిని బుజ్జగించేందుకు  ఆదివారం ఉదయం నుంచి రాత్రిదాకా అధిష్ఠానం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తొలుత... ఆదివారం ఉదయం విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్వయంగా వెళ్లారు. ‘ఆదిమూలపు సురేశ్‌ను కూడా తొలగిస్తున్నాం. మీ జిల్లా నుంచి ఎవరూ కేబినెట్‌లో ఉండరు’ అని సజ్జల చెప్పారు. దీంతో... బాలినేని శాంతించారు. సర్దుకుపోయేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రానికి సీన్‌ మారిపోయింది. తుది జాబితాలో ఆదిమూలపు పేరూ కనిపించడంతో బాలినేని హతాశులయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... రాజకీయాలను వదులుకునేందుకు సిద్ధమై... మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన కుమారుడు, వియ్యంకుడు అతి కష్టంమీద ఆయనకు నచ్చచెప్పి... లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు బాలినేని మరోసారి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో  చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. బాలినేనిని బుజ్జగించారు. ‘మీరు కూడా వచ్చి మాట్లాడండి’ అని శ్రీకాంత్‌ రెడ్డి కోరడంతో... సజ్జల రామకృష్ణా రెడ్డి మరోమారు బాలినేని నివాసానికి వచ్చారు. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నానని... సీఎం బంధువునంటూ అన్యాయం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని బాలినేని ఆక్రోశించారు. మంత్రి పదవి విషయంలో తనను నమ్మించి మోసం చేశారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ సమయంలో తిప్పేస్వామి, కరణం బలరాం, కొండెపి ఇన్‌చార్జి వెంకయ్య, అద్దంకి వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణ చైతన్య కూడా అక్కడే ఉన్నారు. సజ్జల సుమారు గంటపాటు మాట్లాడినా... బాలినేని శాంతించలేదు. దీంతో... ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైసీపీ  నేత.. సజ్జలతో వాగ్వాదానికి దిగారు. బాలినేనికి అన్యాయం చేశారంటూ నిలదీశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సజ్జల.. బుర్ర, బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా అంటూ ఆ నేతపై మండిపడ్డారు. ‘సోమవారానికి అంతా సర్దుకుంటుంది. మీరెవరూ ఆయనను రెచ్చగొట్టవద్దు’ అని పార్టీ శ్రేణులకు సజ్జల హితవు పలికారు. అనంతరం బాలినేనితో తిప్పేస్వామి ఏకాంతంగా భేటీ అయ్యారు. తొలుత విడుదలైన జాబితాలో... తిప్పేస్వామి పేరు కూడా ఉంది. ఆఖరు నిమిషంలో ఆయన పేరు మాయమై... ఆదిమూలపు పేరు ప్రత్యక్షమైంది. దీనిపై తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొద్దిసేపు బాలినేనితో చర్చించిన అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు.


నిరసనల హోరు... 

బాలినేనికి మంత్రి పదవి దూరమైందని తెలిసి... నియోజకవర్గంలోని ఆయన అనుచరులు నిరసనలతో హోరెత్తించారు. ఒంగోలు మంగమూరు రోడ్డు జంక్షన్‌లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కొందరు కిందిస్థాయి నాయకులు పదవులకు రాజీనామాల ప్రకటనలు చేశారు. ఇంకొల్లు జడ్పీటీసీ సభ్యురాలు భవనం శ్రీలక్ష్మి తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనతోపాటు, పార్టీ కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధమైనట్లు ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌ వెల్లడించారు. కొందరు కార్పొరేటర్లు రాజీనామా లేఖలను మేయర్‌కు అందజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటు పార్టీ, అటు ప్రభుత్వ పదవుల్లో ఉన్న కొందరు రాజీనామాకు సిద్ధమయ్యారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ ముఖ్యనాయకులు బాలినేనికి మద్దతుగా నిలిచారు. పార్టీ ఎమ్మెల్యేలు సైలెంట్‌ అయిపోయారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కించుకున్న ఆదిమూలపు సురేశ్‌కు ఫోన్‌చేసి అభినందించగా.. మిగిలిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, ముఖ్యనాయకులు వేచిచూసే ధోరణిలో ఉండిపోయారు. బాలినేని తీసుకునే తుది నిర్ణయానికి అనుగుణంగా ఆయన బాటపట్టేందుకు ఒంగోలు నియోజకవర్గంలోని నాయకులతోపాటు ఇతర నియోజకవర్గాల్లోని కొందరు సిద్ధమయ్యారు. 

Updated Date - 2022-04-11T08:04:42+05:30 IST