దీపంలా వెలిగిన జీవితం

ABN , First Publish Date - 2022-08-12T09:05:32+05:30 IST

విద్యారంగంలో మూడుదశాబ్దాలకు పైగా సేవలు అందించడమే కాక, తన కార్యాచరణను మరింత విస్తృతపరచి మరిన్ని రంగాలకు విస్తరించివాడు పడాల బాల్ జంగయ్య.

దీపంలా వెలిగిన జీవితం

విద్యారంగంలో మూడుదశాబ్దాలకు పైగా సేవలు అందించడమే కాక, తన కార్యాచరణను మరింత విస్తృతపరచి మరిన్ని రంగాలకు విస్తరించివాడు పడాల బాల్ జంగయ్య. ఐదేండ్లుగా తనకు కేన్సర్ ఉన్న విషయాన్ని తానే మరిచిపోయాడా అన్నంతగా అనేక ఉద్యమాలలో, సభలలో పాల్గొన్న బాల్ జంగయ్య జులై 20న 60 ఏండ్ల జన్మదినవేడుకలు జరుపుకొని, మరో పదిరోజులకు అందరినీ వదిలివెళ్ళిపోయాడు.


పడాల రాములమ్మ, బాలయ్యలకు మూడో సంతానం బాల్‌ జంగయ్య. బాల్‌ జంగయ్య పుట్టేటప్పటికి ఆ ఇల్లు ఖాళీ కుండలతో, కాలే కడుపులతో కష్టాల కొలిమిలో ఉంది. అప్పటికే ఆ తల్లిదండ్రులు నాగార్జునసాగర్‌ నిర్మాణానికి రాళ్లెత్తారు. నల్లమల అడవంచు బల్మూరులో పటేండ్ల దగ్గర గాసం ఉన్నారు. నిర్బంధచాకిరీ చేయలేక హైదరాబాద్‌లో శంకర్‌ సేఠ్‌ హోటల్లో అరవచాకిరీ చేశారు. 1960ల కాలం కరువు కాటకాల కాలమే అయింది గనుక అయిదేండ్ల బాల్‌ జంగయ్యను తీసుకుని 1967లో రాయలసీమలోని నందికొట్కూరు దగ్గర పగిడాలకు నడిచి వలసపోయారు. అయిదు రోజుల నడక. పొట్టిగా, బక్కపలుచగా కాలుచేయి గట్టిపడని బాల్‌జంగయ్య తల్లిదండ్రుల వెంట నడిచి, పరుగెత్తి, బయటి ప్రపంచం చూశాడు. ఆకలి తట్టుకోలేని కొడుకు నిస్సత్తువ బాలయ్యకు రంపపుకోతలా ఉండింది. ఇంక గాసమూ, వలసా ఏదీ వద్దని బిడ్డను చదువులలో శిఖరాలకు చేర్చాలని ఆ తండ్రి గట్టి నిర్ణయం తీసుకున్నాడు.


బాల్ జంగయ్య ప్రాథమిక విద్య బల్మూరులో, ఉన్నత విద్య నాగర్ కర్నూలులో, కాలేజీ విద్య మహబూబ్‌నగర్‌లో పూర్తయి, ఉపాధ్యాయ వృత్తికి అర్హత సాధించాడు. ఉపాధ్యాయుడుగా, చిత్రకారుడుగా, క్రీడాకారుడుగా, ఉత్తమ సామాజిక శాస్త్రాల బోధకుడుగా విద్యార్థులలో ఒకడుగా ఆయన అభ్యాసం చేయించే పద్ధతి ఆదర్శమైంది. ఆయన పాఠం చెప్పేవాడు కాదు. అందమైన అక్షరాలతో, బొమ్మలతో ప్రదర్శించేవాడు. ఉపాధ్యాయ వృత్తితో ఆగిపోయి ఉంటే అది అందరి జీవితాల్లాగే ఉండేది. బాల్‌ జంగయ్య ఎపిటిఎఫ్‌ నిర్మాణంలో భాగమై సంస్థ విస్తృతికి కృషి చేశాడు. అచ్చంపేట నియోజకవర్గంలో చరిత్ర మరచిపోని మహత్తర పోరాటం నడిపారు. అవినీతి, అక్రమాలు, నిధుల లూటీ నిరూపించాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా కరువు, వలసలు, అసహజ మరణాలు చర్చకు తెస్తూ మేం 1994లో కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పరచినప్పుడు ఆ ఉద్యమంలో భాగమయ్యాడు. 1998లో కుల నిర్మూలన పోరాట సమితి ఏర్పడినపుడు ఆ సంస్థలో చేరి క్రియాశీల కృషి చేశాడు. నామాల బాలస్వామిని గడ్డివాములో వేసి సజీవంగా కాల్చినప్పుడు ఆ ఉద్యమంలో జిల్లా అంతా తిరిగాడు. ఉపాధ్యాయ ఉద్యమాన్ని, ప్రజాసంఘాల ఆచరణను ప్రభుత్వాలు సహించలేక హింసకు తెగబడ్డాయి. పౌరహక్కుల ఉద్యమ లాయర్‌ పురుషోత్తం, తెలంగాణ ఉద్యమకారుడు కె.కనకాచారి, హొలియదాసరుల సంఘాన్ని నడిపించిన మునెప్పను కసితో చంపించాయి. ఈ తీవ్ర నిర్బంధ కాలంలో బాల్ జంగయ్య అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో చేరి జిల్లా అంతా తిరిగి, ఉద్యమకృషినంతా పోగుచేసి ‘మహబూబ్‌నగర్‌ జిల్లా దళితులు–మానవహక్కులు’ అనే పరిశోధన పత్రం రాశాడు. ఆ పత్రాన్ని బాల్‌ జంగయ్య గీసిన నామాల బాలస్వామి సజీవదహన దృశ్యం ముఖచిత్రంతో పాలమూరు అధ్యయన వేదిక ప్రచురించింది.


2006 తరువాత పాలమూరు అధ్యయన వేదిక ఏర్పడగా వేదిక నిర్వహించే సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాల కార్యక్రమాలన్నింటినీ ముందుకు నడపడానికి వేదికలో చేరి కృషి చేశాడు. మలి తెలంగాణ ఉద్యమంలో అచ్చంపేటలో అహోరాత్రులు పనిచేసిన మిత్రులలో తనది ప్రశంసనీయమైన పాత్ర. అందరూ పండగని ఇళ్లలో ఉంటే ఆయన కుటుంబం అంతా తండ్రితో పాటు దీక్షా శిబిరంలో కూర్చునేవారు. మేం ఒకవైపు తెలంగాణ పోరాటంలో ఉంటూనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సాధన కోసం నిరంతర పోరాటాలు నడిపేవాళ్లం. 2013లో 72 జీఓతో ఆ పథకం సాధించినపుడు ఎంతో సంతోషపడ్డాడు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆ పథకాన్ని రీడిజైన్‌ పేరిట స్థలం మార్చి చేపట్టడాన్ని, దానికి డిండి పథకాన్ని జోడించడాన్ని నిరసించాడు. కె.ఎల్‌.ఐ పథకంలో భాగంగా చంద్రసాగర్‌ నుంచి అమ్రాబాద్‌ ఎత్తిపోతల, తుమ్మాన్‌పేట నుంచి బల్మూరు ఎత్తిపోతల చేపట్టాలని పోరాడాడు. నల్లమలలో చెంచుల సమస్యల పరిష్కారానికి పాటుపడడంతో పాటు డిబీర్స్‌ వ్యతిరేక పోరాటం, యురేనియం వ్యతిరేక పోరాటంలో తన పాత్ర పోషించాడు. పీడిత ప్రజలకి, ప్రజా ఉద్యమాలకి, నల్లమలకి ముద్దుబిడ్డగా ఎదిగాడు. ఆయనను బతికించుకోవాలని తండ్లాడాం. బతికించుకోలేకపోయాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం వెల్లివిరిసే సమాజాన్ని స్వప్నించి అందుకు జీవితమంతా అర్పించిన బాల్‌ జంగయ్య మరణంతోనైనా ప్రభుత్వం శాస్త్రీయ విజ్ఞానానికి, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందా?


– ఎం. రాఘవాచారి

కన్వీనర్‌, పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - 2022-08-12T09:05:32+05:30 IST