కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌

ABN , First Publish Date - 2021-10-03T05:40:25+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు హుజురాబాద్‌ ఉప ఎన్నికలో పోటీలో నిలిపే అభ్యర్థి పేరును ఖరారు చేసింది.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌

- ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడికి అవకాశం 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు హుజురాబాద్‌ ఉప ఎన్నికలో పోటీలో నిలిపే అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌నర్సింగారావు పేరును ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ ఆమోదంతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇన్‌చార్జి ముఖుల్‌ వాస్నిక్‌ అధికారికంగా ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ నోటిఫికేషన్‌ రాకున్నా మూడునెలల నుంచి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్‌ మాత్రం  అభ్యర్థి ఎంపిక పై కుస్తీపడుతూ ఎట్టకేలకు నామినేషన్‌ వేసేందుకు ఆరు రోజుల గడువు ఉన్న సమయంలో పోటీలో నిలిపే వ్యక్తి విషయంలో అవగాహనకు వచ్చి ప్రకటన చేసింది. 

యువకుడు.. విద్యాధికుడు

30 సంవత్సరాల వయసు మాత్రమే కలిగి ఎంబీబీఎస్‌ కోర్సును పూర్తిచేసిన వెంకట్‌నర్సింగారావు  2018 నుంచి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2017లో ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శిగా, 2015 నుంచి 17 వరకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్‌నర్సింగారావు బల్మూరి వెంకట్‌గా కాంగ్రెస్‌వర్గాల్లో సుపరిచితుడు. అవివాహితుడైన ఆయన స్వగ్రామం పెద్దపల్లి కాల్వశ్రీరాంపూర్‌ మండలం తారుపల్లిగా పేర్కొంటున్నా జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందినవారు. మానాల నుంచి చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్ళిన ఆయన కుటుంబం అక్కడే స్థిరపడింది. ఆయన అమ్మమ్మ గ్రామమైన తారుపల్లిని స్వగ్రామంగా మార్చుకొని రాజకీయాల్లోకి వచ్చారు.

తర్జనభర్జనల తర్వాత ఎంపిక

కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ నేతృత్వంలో వేసిన కమిటీ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, నివేదిక అందజేసింది.  ఇక్కడి నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను పోటీలో దింపాలనే ప్రతిపాదన వచ్చింది. స్వయంగా పార్టీ రాష్ట్ర అధిష్ఠానమే  ఆ అభిప్రాయానికి వచ్చినా దామోదర రాజనర్సింహ మాత్రం స్థానికులకే అవకాశం ఇవ్వాలని సూచించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డిని హుజురాబాద్‌ అభ్యర్థిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందో సూచించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. ఈ కమిటీ కూడా స్థానిక అభ్యర్థిపై మొగ్గు చూపడం, కొండా సురేఖ కూడా తాను హుజురాబాద్‌లో పోటీచేయాలంటే వచ్చే ఎన్నికల్లో తనకు ఇదే స్థానంలో పోటీచేసే అవకాశం ఇవ్వడంతోపాటు వరంగల్‌, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల టికెట్లు కూడా ఇవ్వాలని కండిషన్‌ పెట్టడంతో ప్రత్యామ్నాయం వెతకాల్సి వచ్చింది. దీంతో హుజురాబాద్‌లో పోటీచేసేందుకు 10 రోజులపాటు దరఖాస్తులను స్వీకరించింది. 19 మంది పార్టీ నాయకులు ఐదు వేల రూపాయల డిపాజిట్‌ చేస్తూ దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో పత్తి కృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. ఆయన అభ్యర్థిత్వానికే పార్టీలో అత్యధికులు ఆమోదం తెలిపారని ప్రచారం జరిగింది. చివరి క్షణంలో కృష్ణారెడ్డితోపాటు బల్మూరి వెంకట్‌నర్సింగారావు పేరు పరిశీలనకు వచ్చి ఆయన పేరే ఖరారైంది. బల్మూరి వెంకట్‌ పెద్దపల్లి జిల్లా పరిధిలోని తారుపల్లి గ్రామం నుంచి రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో అక్కడ అభ్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు పోటీగా మారబోతారని ఉప ఎన్నికలో ఆయనను అభ్యర్థిగా ప్రకటించారని ప్రచారం జరుగుతున్నది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వెంకట్‌ పేరును ప్రతిపాదించగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా విజయరమణారావుతో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే వెంకట్‌ను అభ్యర్థిగా ఎంపికయ్యేలా చూశారని పార్టీలో ఒక వర్గం ప్రచారం చేస్తున్నది. 

ఐసీయూలో అభ్యర్థి వెంకట్‌ 

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన విద్యార్థి, నిరుద్యోగ  సైరన్‌ పిలుపు మేరకు జరిగిన కార్యక్రమంలో హుజురాబాద్‌ అభ్యర్థిగా ఎంపికైన బల్మూరి వెంకట్‌నర్సింగారావు పోలీసుల లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లోని అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంలో పోలీసులకు, కాంగ్రెస్‌శ్రేణులు, విద్యార్థులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేయడంతో బల్మూరి వెంకట్‌ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆయనను కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. వెంకట్‌ అభ్యర్థిగా ఎంపికైన సమయంలోనే అపస్మారక స్థితిలో ఐసీయూలో అడ్మిట్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2021-10-03T05:40:25+05:30 IST