చైనాకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2022-04-27T22:12:09+05:30 IST

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి నేపథ్యంలో బలోచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ....

చైనాకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి నేపథ్యంలో బలోచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ....  చైనా, పాకిస్థాన్‌లకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. బలోచిస్తాన్ భూమిని కాపాడుకునేందుకు చైనీయులే లక్ష్యంగా మున్ముందు మరిన్ని ఆత్మాహుతి దాడులు చేస్తామని ప్రకటించింది. ఆత్మాహుతి దాడుల కోసం ప్రత్యేక దళాలను సిద్ధం చేశామని తెలిపింది. తక్షణమే చైనా, పాక్ బలగాలు బలోచిస్తాన్‌ను వదిలివెళ్లాలని హెచ్చరించింది. పాక్ సైన్యం మద్దతుతో బలోచిస్తాన్‌ను కబలిస్తున్నారని, తాము చూస్తూ ఊరుకోబోమని బీఎల్‌ఏ జనరల్ అస్లమ్‌ను ఉటంకిస్తూ వీడియో సందేశం విడుదల చేసింది.


బలోచిస్తాన్‌లో చేపడుతోన్న ప్రాజెక్టులను విరమించుకోవాలని, తక్షణమే గ్వాదర్ పోర్ట్‌ను వదిలివెళ్లాలని బీఎల్‌ఏ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకాలం పాక్, చైనా ఆడిందే ఆట అయిందని, ఇక ఆటలు సాగనీయబోమంటూ నేరుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేసింది. 60 బిలియన్ డాలర్లతో చేపట్టిన చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను ముమ్మాటికీ అడ్డుకుంటామని బీఎల్‌ఏ హెచ్చరించింది. 




కరాచీ యూనివర్సిటీలో జరిగిన ఆత్మాహుతి దాడి తమ పనే అని నిన్న ప్రకటించుకున్న బీఎల్‌ఏ ఇందుకోసం షరీ బలూచ్‌ అనే తొలి మహిళా ఆత్మాహుతి బాంబర్‌ను వినియోగించామని వెల్లడించింది. కన్ఫూషియస్‌ సంస్థలో పనిచేస్తున్న చైనీయులు లక్ష్యంగా జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చైనీయులు, ఒక పాకిస్థానీ గార్డ్ ఉన్నారు. బుర్ఖాలో బాంబుతో వచ్చిన ఒక మహిళ తనను తాను పేల్చి వేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ఇటీవల బీఎల్‌ఏ జరిపిన వేర్వేరు దాడుల్లో 100 మందికిపైగా పాకిస్థాన్ సైనికులు చనిపోయారు. చైనా ఇంజనీర్లు కూడా చనిపోయారు. 

Updated Date - 2022-04-27T22:12:09+05:30 IST