బాణసంచాపై నిషేధం!

ABN , First Publish Date - 2020-12-03T08:21:29+05:30 IST

దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాణసంచా అమ్మకాలు, వినియోగంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) పూర్తిస్థాయిలో నిషేధం విధించింది.

బాణసంచాపై నిషేధం!

కొవిడ్‌ సమయంలో అమ్మొద్దు, వాడొద్దు

ఆదేశాలు జారీ చేసిన ఎన్జీటీ


న్యూఢిల్లీ, డిసెంబరు 2: దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాణసంచా అమ్మకాలు, వినియోగంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ప్రస్తుతం కొవిడ్‌ ఉధృతి కొనసాగుతున్నందున దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)తో పాటు గాలి నాణ్యత తక్కువగా ఉన్న అన్ని పట్టణాలు, నగరాల్లో బాణసంచాపై పూర్తిగా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బాణసంచా వినియోగం వల్ల వాయు కాలుష్యం పెరిగితే ప్రజారోగ్యానికి మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌ (చైర్‌పర్సన్‌) నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.


అయితే గాలి నాణ్యత మధ్యస్థ, కాస్త దిగువ స్థాయిలో ఉన్న పట్టణాలు, నగరాల్లో బాణసంచా వినియోగించరాదని.. పండగలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం రెండు గంటలు హరిత బాణసంచా వాడుకోవచ్చని గతంలో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ధ్వని స్థాయుల నిబంధనలనూ కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. రెండో ఉల్లంఘన అంతకంటే ఎక్కువ ఉల్లంఘనలకు రెట్టింపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారం చేసే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించింది. క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల్లో రాత్రి 11.55 గంటల నుంచి 12.30 గంటల వరకు, అది కూడా హరిత బాణసంచాను మాత్రమే కాల్చాలని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-12-03T08:21:29+05:30 IST