ఎలా బతకాలి?

ABN , First Publish Date - 2020-07-06T10:55:33+05:30 IST

మహానంది మండలం తమ్మడపల్లికి చెందిన ఈ వ్యక్తి పేరు బాలనాగరాజు. ఊరి పక్కనే ఉన్న చెరువులో చేపల వేటతో ఉపాధి ..

ఎలా బతకాలి?

చేపల వేటపై నిషేధం

ఈ రెండు నెలలు అవస్థలు

కోస్తాలో మత్స్యకారులకు సాయం

రాయలసీమపై కొనసాగుతున్న వివక్ష

ప్రభుత్వ తీరుపై మత్స్యకారుల ఆగ్రహం


కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై 5: మహానంది మండలం తమ్మడపల్లికి చెందిన ఈ వ్యక్తి పేరు బాలనాగరాజు. ఊరి పక్కనే ఉన్న చెరువులో చేపల వేటతో ఉపాధి పొందుతున్నాడు. జూలై, ఆగస్టు నెలల్లో ప్రభుత్వం చేపల వేటను నిషేధించింది. ఈ రెండు నెలల్లో చేపలు పడితే వాటి సంతతి పెరగదని ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బాల నాగరాజుకు ఉపాధి లేకుండా పోయింది. ఈ  రెండు నెలలు వేరే పని కల్పించాలని, లేదంటే ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. జిల్లాలో దాదాపు 70 వేల మత్స్యకార కుటుంబాలది ఇదే పరిస్థితి.


మత్స్యకారులకు చేపల వేట తప్ప వేరే ఉపాధి ఉండదు. ఏడాదిలో రెండు నెలల పాటు పూర్తిగా పని లేకుంటే బతకడం కష్టమౌతుంది. ప్రభుత్వ నిర్ణయం తమ జీవితాలను దుర్భరంగా మారుస్తోందని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో మంత్రాలయం, శ్రీశైలం, ఆళ్లగడ్డ, పాణ్యం, డోన్‌, పత్తికొండ, ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో మత్స్యకారులకు చేపల వేటే ఉపాధి. వీరికి పొలాలు, ఇతర ఆస్తులు లేవు. చేపల వేట సాగిన సమయంలో పూట గడుస్తుంది. మిగిలిన రోజుల్లో ఇబ్బందులు తప్పవు. ఈ రెండు నెలలు తమకు ప్రత్యామ్నాయం చూపాలని మత్స్యకారులు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. జూన్‌ 24 నుంచి చేపల వేట ఆపేయాలని అధికారులు ఆదేశించారు.  తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశిస్తే.. తమ చేతుల్లో ఏమీ లేదని తేలిపోయారు.


కోస్తాలో రూ.10 వేల భృతి

కోస్తాలో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు ఎక్కువ. అయినా సరే, చేపల వేట లేని ఈ రెండు నెలలూ నెలకు రూ.10 వేల ప్రకారం ప్రభుత్వ సాయం అందుతోంది. గతంలో సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు బియ్యాన్ని మాత్రమే అందజేసేవారు. ఆ తరువాత బియ్యం స్థానంలో నెలకు రూ.2 వేలు ఇచ్చేఆరు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచింది. ప్రస్తుత ప్రభుత్వం రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ రాయలసీమలో ఇది అమలు కావడం లేదు. 


భృతి ఇవ్వరా..?

జిల్లాలో శ్రీశైలం, వెలుగోడు, అలగనూరు, గోరుకల్లు, అవుకు, సిద్ధాపురం, సుంకేసుల, గాజులదిన్నె తదితర జలాశయాలు, 600 దాకా చెరువుల్లో చేపల వేటను నిషేధించినట్లు మత్స్యశాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీహరి తెలిపారు. దీనిపై మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నట్లు జేడీ తెలిపారు. ఈ రెండు నెలలు భృతి కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారని, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ఆయన తెలిపారు. 


మంత్రి మాట ఉత్తిదేనా..?

గత ఏడాది ఆగస్టులో జిల్లా మత్స్యకారుల కార్తీక వనభోజనాలకు మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరయ్యారు. రాయలసీమ కరువు పరిస్థితులను ప్రస్థావించిన ఆయన, చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ అమలు కావడం లేదు. 


రోడ్డున పడాల్సిందే..నాగశేషులు, గని

ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో చేపల వేటను ఆపేయమంటున్నారు. మేమంతా ఉపాధి లేక రోడ్డున పడుతున్నాము. పస్తులు ఉండల్సి వస్తోంది. కోస్తా ప్రాంతంలో ఇచ్చినట్లుగా మాకూ నెలకు రూ.10 వేలు ఇవ్వాలి. 


వివక్ష తగదు.. వెంకటేశులు, రాయలసీమ ఇన్‌చార్జి, జాతీయ మత్స్యకారుల సంఘం 

ప్రభుత్వం అందరినీ సమ దృష్టితో చూడాలి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం న్యాయం ఉండదు కదా..? కోస్తా ప్రాంతంలో ఈ రెండు నెలలు మత్స్యకారులకు నెలకు రూ.10 వేలు ఇస్తున్నారు. రాయలసీమలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఇతర ఉపాధి అవకాశాలు లేవు. మంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేకపోతే ఆందోళన చేస్తాం.

 

Updated Date - 2020-07-06T10:55:33+05:30 IST