అరటికి సిగటోక

ABN , First Publish Date - 2022-09-17T06:04:18+05:30 IST

సిగటోక వైరస్‌ దెబ్బకు అరటి పంట దెబ్బతింటోంది.

అరటికి సిగటోక
వైర్‌స సోకడంతో నల్లగా మారిన కాండం, ఆకులు

వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంట

తీవ్రంగా నష్టపోతున్న రైతులు

యాడికి, సెప్టెంబరు 16: సిగటోక వైరస్‌ దెబ్బకు అరటి పంట దెబ్బతింటోంది. రైతులు కుదేలవుతున్నారు. మండలంలోని రాయలచెరువు, పచ్చారుమేకలపల్లి, చందన, లక్షుంపల్లి, కేశవరాయునిపేట, దైవాలమడుగు, తూట్రాళ్లపల్లి, రామరాజుపల్లి, పెద్దపేట, కొత్తపల్లి, నగరూరు తదితర గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో రైతులు అరటి పంటను సాగుచేశారు. అరటిలో సిగటోక వైరస్‌ వ్యాపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ సోకిన అరటిచెట్టు మొదలు నుంచి ఎండుతూ వస్తోంది. తీవ్రత పెరగగానే పూర్తిగా ఎండిపోతోంది. గెలలోని కాయలు వృద్ధి చెందడం లేదు. వైరస్‌ సోకిన అరటి చెట్టు ఆకులపై చిన్నచిన్న పసుపురంగు మచ్చలు ఏర్పడుతున్నాయి. అవి క్రమేపి పెరిగి పెద్దవై బూడిద రంగుకు మారి, ఒకదానితో ఒకటి కలిసిపోతున్నాయి. ఆకులు ఎండిపోవడంతో కిరణజన్య సంయోగక్రియ జరగక, కాయలు చెట్టుమీదనే పక్వానికి వస్తున్నాయని, కొన్ని పండక ముందే రాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గెలమీదనే అరటికాయలు మాగి చెట్టంతా ఎండిపోతోందని, దీంతో తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తోందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


పత్తాలేని అధికారులు

అరటికి గతంలో మూడో పంటకు సిగటోక వైరస్‌ ఎక్కువగా సోకేది. ప్రస్తుతం మొదటి పంటకే వైరస్‌ వస్తోందని రైతులు తెలిపారు. దీంతో రూ.లక్షలు ఖర్చు చేసి సాగుచేసిన పంటను వదిలేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. మండల వ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో అరటి సాగుచేస్తే.. 80 శాతానికి పైగా పంటకు వైరస్‌ సోకింది. వైరస్‌ నివారణపై అవగాహన కల్పించాల్సిన ఉద్యానవనశాఖ అధికారులు పత్తా లేకుండా పోయారు. ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహించి, వైరస్‌ నివారణ చర్యలను సూచించి ఉంటే ఉధృతి తగ్గేదేమోనని రైతులు అంటున్నారు. 


మొదటి పంటకే సిగటోక..

15 ఎకరాల్లో అరటిపంట సాగుచేశాను. మొదటి పంటకే సిగటోక వైరస్‌ సోకింది. కాండం అంతా నల్లగా తయారైంది. అరటి ఆకులపై పసుపు మచ్చలు వచ్చి, నల్లగా మారుతున్నాయి. వైరస్‌ కారణంగా పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. రసాయన మందులు ఎన్నివాడినా అదుపులోకి రావడం లేదు. తీవ్రంగా నష్టపోతున్నాము.

- శ్రీనివాసనాయుడు, అరటిరైతు, రాయలచెరువు


ఎనిమిది ఎకరాల్లో..

మొదటి పంట మూడు ఎకరాలు, రెండో పంట ఐదు ఎకరాల్లో సాగుచేశాను. మొత్తం 8 ఎకరాల్లో అరటి పంటకు వైరస్‌ సోకింది. ఈ కారణంగా దిగుబడికి నష్టం జరుగుతోంది. పెట్టుబడి కూడా తిరిగివచ్చే పరిస్థితి లేదు.

- శ్రీహరి, అరటిరైతు, పచ్చారుమేకలపల్లి


పంట తొలగించా..

పది ఎకరాల్లో అరటి రెండోపంట ఉంది. సిగటోక వైర్‌స కారణంగా పంట పూర్తిగా దెబ్బతినింది. మందులకు వైరస్‌ అదుపులోకి రావడం లేదు. అందుకే ఐదెకరాల్లోపంటను రెండురోజుల్లో తొలగించాలని అనుకుంటున్నాను. 

- రవికుమార్‌రెడ్డి, అరటిరైతు, లక్షుంపల్లి

Updated Date - 2022-09-17T06:04:18+05:30 IST