మీరు కాశీకి వెళ్లారా? అయితే బెనారస్, కాశీ, వారణాసి... మధ్యగల తేడాలు తెలుసుకోండి.. ఇన్నిపేర్లెలా వచ్చాయో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-09T12:54:38+05:30 IST

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తన..

మీరు కాశీకి వెళ్లారా? అయితే బెనారస్, కాశీ, వారణాసి... మధ్యగల తేడాలు తెలుసుకోండి..  ఇన్నిపేర్లెలా వచ్చాయో తెలిస్తే..

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించి, రూ.339 కోట్లతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను ప్రారంభించారు. అయితే వారణాసి గురించి మాట్లాడినప్పుడల్లా కొంతమంది బెనారస్ అని, మరికొందరు కాశీ అని పిలుస్తారు. ఒకే నగరాన్ని ఇలా మూడు పేర్లతో ఎందుకు పిలుస్తుంటారో తెలుసా? దీని వెనుక గల చరిత్ర  ఏమిటో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


కాశీ

వారణాసికి గల పురాతన నామధేయం కాశీ. మత గ్రంథాలలో కూడా ఈ నగరం కాశీ పేరుతో కీర్తిపొందింది. ఈ పేరు సుమారు 3 వేల సంవత్సరాల నుంచి భక్తుల నోళ్లలో నానుతోంది కాశీని గతంలో కాశికా అని కూడా పిలిచేవారు. కాశీ అనే పదానికి ప్రకాశం అని అర్థం. పరమశివుడు కొలువైన నగరం కావడంతో ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుందని చెబుతుంటారు.

బెనారస్

కాశీ నగరానికి గల మరొక పేరు బెనారస్. చాలా మందికి కాశీని బెనారస్ పేరుతో పిలుస్తుంటారు. మొఘలులు, బ్రిటిష్ వారి పాలనలో దీని పేరు బనారస్‌గా ఉండేది. ఈ పేరు ప్రస్తావన మహాభారతంలో కనిపిస్తుంది. పాళీ భాషలోని బనారసి కాలాంతరంలో బనారస్‌గా మారింది. ఇక ఈపేరు కాశీకి ఎలావచ్చిందనే  విషయానికొస్తే, ఇది బనార్ అనే రాజుతో సంబంధం కలిగి ఉందని చరిత్ర చెబుతోంది. మహమ్మద్ ఘోరీ దాడిలో బనార్ ఇక్కడే హతమయ్యాడని అంటారు. దీనికి గుర్తుగా మొఘలులు ఈ పేరు పెట్టారని చెబుతుంటారు. 

వారణాసి 

కాశీకి గల మరొక పేరు వారణాసి. దీని ప్రస్తావన బౌద్ధ జాతక కథలతో పాటు, హిందూ పురాణాలలో కూడా కనిపిస్తుంది. ఈ పవిత్ర నగరం గుండా ప్రవహించే వరుణ, అసి అనే రెండు నదుల కారణంగా వారణాసి అనే పేరు వచ్చింది. వారణాసిలో, వరుణ నది ఉత్తరాన గంగానదిలో కలుస్తుంది. అసి నది దక్షిణాన గంగానదిలో కలుస్తుంది.


మరికొన్ని పేర్లు

కాశీ, బనారస్, వారణాసి  అనే పేర్లే కాకుండా ఈ నగరానికి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అవి.. అవిముక్త్ క్షేత్రం, ఆనందకానన్, రుద్రవస్, కాశిక, స్థాలి, ముక్తి భూమి, శివపురి, త్రిపురారిరాజనగరి, విశ్వనాథనగరి, దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. అలాగే కాశీని.. శంకర్‌పురి, జిత్వారి, ఆనందరూప, శ్రీనగరి, అపరభభభూమి, శివరాజధాని, గౌరీముఖ్, మహాపురి, తపస్థలి, ధర్మక్షేత్రం, విష్ణుపురి, హరిక్షేత్రం, అలర్కపురి, నారాయణవాస్, బ్రహ్మవాస్, కేతుమతి, మౌలిని, కాశీపూర్, కాశీనగర్, కాశీగ్రామం అని కూడా పిలుస్తారు.

Updated Date - 2022-01-09T12:54:38+05:30 IST