ఆపత్కాలంలో మానవత

May 8 2021 @ 00:30AM

దేశ ప్రజలు అందరూ ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితులను ఎవరూ తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకోకూడదు. ప్రతి ఒక్కరూ మానవతా విలువలతో వ్యవహరించాలి. ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు అవసరం. కరోనా మహమ్మారిపై యుద్ధంలో అవే మనకు ఆలంబన.


గతఏడాది మార్చిలో కొవిడ్–-19 ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడం ప్రారంభమయినప్పుడు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మహమ్మారిని అదుపు చేసేందుకు సకల చర్యలు చేపట్టాయి. ప్రజలు సైతం ప్రభుత్వాలకు పూర్తిగా సహకరించి, అవి నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించారు. ఈ కారణంగా కొవిడ్ మొదటి దఫా విజృంభణను మన ప్రజలు చాలా ధైర్యంగా విజయవంతంగా ఎదుర్కొన్నారు. అంతేకాదు, ఆ ఆరోగ్య విపత్తునెదుర్కోవడంలో ప్రపంచ దేశాలకు ఒక ఉదాహరణగా నిలిచారు. 


అయితే కొవిడ్ విషమ ప్రభావాలు తగ్గు ముఖం పట్టిన తరుణంలో మనం వైయక్తికంగానూ, సమష్టిగానూ నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించాం. ప్రమాదం తొలగి పోయిందనట్టుగా ప్రవర్తించాం. ఫలితంగా కొవిడ్ రెండో దఫా విజృంభించసాగింది. మొదటిసారి కంటే రెండోసారి అది మహా భయానకంగా విస్తరిల్లింది. అశేషప్రజల ఆరోగ్యాన్ని అమితంగా దెబ్బ తీసింది. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వాలు, ప్రజలు తీవ్ర సవాళ్లనెదుర్కొంటున్నారు. అయితే మానవతావాదులు, ప్రతిభావంతులైన మన వైద్యనిపుణులు, ఇతర వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకు అండగా నిలబడ్డారు. ఈ క్లిష్టసమయంలో సంఘీభావం, అప్రమత్తత, అవగాహన, పరస్పర సహకారం మనకు ఎంతైనా అవసరం. అవే మనకు శ్రీరామరక్ష. 


ఇప్పుడు మనం సమష్టిగా జీవితాలు, జీవితాధారాలను సంరక్షించుకోవల్సిన అవసరముంది వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శీఘ్రగతిన అమలుజరపడంతోపాటు ఆక్సిజన్‌ను విరివిగా సమకూర్చుకోవలసిన అవసరముంది. ఆసుపత్రులలో పడకల సంఖ్యను భారీగా పెంచాలి. ఆరోగ్యభద్రతా వ్యవస్థ సదుపాయాలను సమృద్ధపరచాలి. కొవిడ్‌పై పోరులో వ్యాక్సినేషన్ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. అదృష్టవశాత్తు కరోనా టీకాలను మనకు మనమే అభివృద్ధిపరచుకుంటున్నాం. శాస్త్రవేత్తల, ఫార్మా నిపుణుల అంకితభావమే ఈ పురోగతికి ప్రధానకారణమని మరి చెప్పనవసరం లేదు. ఈ సందర్భంగా పూణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావనార్హమైనవి. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రపంచపు అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం చాలా సమర్థంగా అమలవుతోంది. రోజూ వేలాది మంది టీకా వేయించుకుని కరోనానుంచి రక్షణ విషయమై భరోసా పొందుతున్నారు.


మన దేశం ‘ప్రపంచ ఔషధశాల’గా సువిఖ్యాతమయింది. అయినా కొవిడ్ మహమ్మారి విశృంఖలంగా వ్యాపిస్తుండడంతో విదేశీ టీకాలను దిగుమతి చేసుకోవడానికి కేంద్రం అనుమతించింది. ఈ మేరకు రష్యన్ టీకా స్పుత్నిక్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దిగుమతి చేసుకొంటుంది. మొదటి దశలో 1,50,000 డోసుల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్స్ దిగుమతి చేసుకొంది. 


50 శాతం వ్యాక్సిన్‌ను ప్రైవేట్ ఆసుపత్రులకు సమకూర్చేందుకు కేంద్రం అనుమతించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్లను నేరుగా కొనుగోలుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్రం అనుమతించింది. వ్యాక్సిన్లను మరింతగా ఉత్పత్తిచేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రైవేట్ సంస్థల సహకారంతో ప్రభుత్వరంగ సంస్థలు సంబంధిత కార్యకలాపాలను చేపట్టేందుకుకూడా కేంద్రం సమ్మతించింది. ప్రతి వయోజన భారతీయుడు ఆరునెలల్లో వ్యాక్సిన్ పొందడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. 


కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఇంతవరకు రాష్ట్రాలకు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు 17.02 వాక్సిన్ డోసులను ఉచితంగా సమకూర్చడం జరిగింది. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికీ 94.47 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇంకా ప్రజలకు ఇవ్వవలసి ఉంది. రాబోయే కొద్దిరోజుల్లో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 36 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు సమకూరనున్నాయి. పన్నెండు రాష్ట్రాలలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న వారిలో 4,06,339 మందికి మొదటి డోసు ఇవ్వడం జరిగింది. అలాగే 45–60 సంవత్సరాల మధ్యవయసులో ఉన్నవారిలో 5,30,50,669 మందికి మొదటి డోసు ఇచ్చారు. వీరిలో 41,42,786 మందికి రెండో డోసు కూడా ఇచ్చారు. అలాగే 60 సంవత్సరాల పైబడిన వయసుకల వారిలో 1,19,98,443 మందికి మొదటి డోసు ఇవ్వడం జరిగింది. 


వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు సైతం ప్రభుత్వం విశేషంగా ఆర్థిక సహాయమందిస్తోంది. గత నెల 28న సీరమ్ సంస్థకు 11 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గాను రూ.1700 కోట్లు ఇచ్చింది. అలాగే భారత్ బయోటెక్‌కు కూడా ఐదుకోట్ల కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులకుగాను రూ.772.5 కోట్లు ఇచ్చింది. వచ్చే జూలైనాటికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో, మరింత శీఘ్రగతిన అమలుపరిచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దేశ ప్రజలు అందరూ ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నారు. కనుక ఎవరూ ఈ పరిస్థితులను తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా సంయమనం చూపాలి. ప్రతి ఒక్కరూ మానవతా విలువలతో వ్యవహరించవలసిన ఆపత్కాల మిది. ఈ విషయాన్ని మనం విస్మరించకూడదు.

 

కరోనా మహమ్మారి ప్రజ్వరిల్లక ముందు మన దేశం ప్రతిరోజూ వైద్య అవసరాలకు 6500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేది. ఇప్పుడు ఆ ఉత్పాదక సామర్థ్యం 7200 మెట్రిక్ టన్నులకు పెరిగింది. గతంలో మెడికల్ ఆక్సిజన్ రోజుకు 700 మెట్రిక్ టన్నులు అవసరముండగా ఇప్పుడు ఆ అవసరం 5000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో కొవిడ్ రోగులు ఓర్పుగా ఉండవలసిన అవసరముంది. ఆక్సిజన్ అవసరమైన ప్రతి ఒక్కరికీ సమకూర్చేందుకు ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది రైళ్లు, విమానాలు, ఉపరితల రవాణా సాధనాల ద్వారా అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. మహమ్మారి మరింతగా విజృంభిస్తుండడంతో ఆక్సిజన్‌కు డిమాండ్ ఇతోధికంగా పెరిగింది. దేశవ్యాప్తంగా 500 ఫ్యాక్టరీలు గాలి నుంచి ఆమ్లజనిని సంగ్రహించి శుద్ధిచేస్తున్నాయి. ఆ ఆమ్లజనిని ద్రవ రూపంలోకి మార్చి ఆసుపత్రులకు సరఫరా చేస్తారు. మెడికల్ ఆక్సిజన్‌ను ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తారు. కనుక ట్యాంకుల సదుపాయాన్ని కూడా పటిష్ఠం చేసుకోవలసివుంది. 


కొవిడ్ రెండో దఫా విజృంభణ ప్రభావం మన యువత పై తీవ్రస్థాయిలో ఉంది. ముఖ్యంగా 15-–30 సంవత్సరాల వయస్సు మధ్య యువజనుల విద్యాభ్యాసానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. అయినప్పటికీ కోటి మందికిపైగా యువతీ యువకులు స్వచ్ఛందంగా కొవిడ్‌పై పోరులో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే మన బలం. యువజనుల శక్తిసామర్థ్యాలను మరింతగా వినియోగించుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రాష్ట్ర గవర్నర్లతో జరిపిన ఆన్‌లైన్ సమావేశంలో కొవిడ్‌పై పోరులో కమ్యూనిటీ సంస్థలు, రాజకీయ పార్టీలు, ఎన్‌జిఓలు, సామాజిక సంస్థలు సమష్టిగా కృషిచేయాలని విజ్ఞప్తిచేశారు. ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచనలతో కొవిడ్‌పై పోరుకు సహకరించాలి. ఆ మహమ్మారి వ్యాప్తి గురించిన ప్రతికూల ప్రచారాన్ని నివారించాలి. ధైర్యం, ఆత్మ విశ్వాసం, ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు మనకు అవసరం. వాటి సహాయంతో మనం కరోనా మహమ్మారిపై యుద్ధంలో తప్పక విజయం సాధించగలుగుతామనడంలో ఎలాంటి సందేహం లేదు.బండారు దత్తాత్రేయ

(వ్యాసకర్త హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.