Advertisement

బంద్‌ సక్సెస్‌

Mar 6 2021 @ 00:32AM
నిర్మానుష్యంగా ఉన్న కడప ఆర్టీసీ బస్టాండు

ర్యాలీలు, నిరసనలు

మధ్యాహ్నం వరకు రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకోవాలి

అఖిలపక్ష నాయకుల డిమాండ్‌

కడప, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీలుప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో అఖిలపక్ష నేతలు నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. బీజేపీ, జనసేన మినహా అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలంటూ డిమాండ్‌ చేశాయి. బంద్‌ సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కును సమైఖ్యంగా పరిరక్షించాలని అందరూ నినదించారు. 


కడపలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి, అసెంబ్లీ ఇనచార్జి అమీర్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి పోతుగంటి పీరయ్య ఆధ్వర్యంలో టీడీపీ నేతలు అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి కోటిరెడ్డిసర్కిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, ఏడురోడ్లు, వనటౌన మీదుగా గోకుల్‌లాడ్జి వరకు మోటరుసైకిలు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుటిల రాజకీయ దోపిడీకి గురవుతున్న ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పోరాటానికి అందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్టీలు ప్లాంటు లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదం, భూముల్లో వాటా కొట్టేయడానికి వైసీపీ మొసలికన్నీరు కారుస్తోందని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి వెంకటశివ, రామ్మోహన, సీపీఐ నేతలు రామ్మోహన, వైసీపీ నగర కార్యదర్శి పులి సునీల్‌కుమార్‌, నిత్యానందరెడ్డిలు ఆర్టీసీ బస్టాండు వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ, ఏఐటీయూసీ నేతలు బాదుల్లా, నాగసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాతబస్టాండు నుంచి ఏడురోడ్లు, గోకుల్‌లాడ్జి, వనటౌన, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు. విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాల ప్రముఖ  సంఘ సేవకులు సలావుద్దీన, దస్తగిరిరెడ్డి, మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. 


ప్రొద్దుటూరులో వామపక్షనేతలు సత్యం, రామయ్య, సుబ్బరాయుడు, విద్యార్థిసంఘం నేతలు, వ్యాపార సంస్థల నిర్వాహకులు బంద్‌లో పాల్గొన్నారు. జమ్మలమడుగులో విద్యార్థి యువజన సంఘాల నాయకులు శివకుమార్‌, ఓబులేసు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. రాజంపేటలో సీపీఐ, సీఐటీయూ నేతలు రాముడు, రవికుమార్‌ తదితర నాయకులు రాజంపేట బైపాస్‌ రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని అరెస్టు చేసి విడుదల చేశారు. రైల్వేకోడూరులో అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మైదుకూరులో టీటీడీ మాజీ చైర్మన పుట్టా సుధాకర్‌యాదవ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వామపక్ష నేతలు సుబ్బరాయుడు నాలుగురోడ్ల కూడలిలో మానవహారం చేపట్టి ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. బద్వేలు నాలుగురోడ్ల కూడలిలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరశేఖర్‌, డివిజన కార్యదర్శి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పోరుమామిళ్లలో టీడీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాయచోటిలో సీపీఐ నేతలు విశ్వనాధం, ఎన్జీవో సంఘం నేతలు వెంకటేశ్వర్‌ రెడ్డి, పారామెడికల్‌ రాష్ట్ర నేత విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం నుంచి గాంధిబజారు, తానా, నేతాజి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. 30 మంది త్యాగాలతో ఏర్పడిన ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్నం తర్వాత బస్సులు యథావిధిగా నడిచాయి. బంద్‌ ఉందని ముందే ప్రకటించినప్పటికీ కొంతమంది ప్రయాణికులు బస్సులకోసం బస్టాండ్లలో ఎదురుచూస్తూ కనిపించారు. బంద్‌ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.