రేపు ములుగుకు బండి సంజయ్‌ రాక

ABN , First Publish Date - 2021-03-02T05:19:47+05:30 IST

రేపు ములుగుకు బండి సంజయ్‌ రాక

రేపు ములుగుకు బండి సంజయ్‌ రాక

ఇక్కడి నుంచే బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావం

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకే్‌షరెడ్డి


ములుగు, మార్చి 1 : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఈనెల 3న ములుగుకు వస్తున్నారని, ఇక్కడి నుంచే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి ఏనుగు రాకే్‌షరెడ్డి తెలిపారు. ఉద్యమాలకు పురుడుపోసి, పాలకులచేత వెనుకబాటుకు గురిచేయబడ్డ ములుగు ప్రాంతంపై బీజేపీకి ప్రత్యేక దృష్టి ఉన్నదని, అందుకే ఎన్నికల ప్రచార మొట్టమొదటి వేదికను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ములుగులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారుటైరు పంక్షర్‌ అయ్యిందని, ఇక ఎన్నిటైర్లు మార్చినా రోడ్డుమీద తిరిగే పరిస్థితి లేదన్నారు. 


అవినీతి పాలన, నిరంకుశ నిర్ణయాలతో కేసీఆర్‌ క్రమంగా గుర్తింపును కోల్పోతున్నారని, ఇది గ్రహించే తాను బతికుండానే చరిత్రను రాయించుకోవడంతో పాటు విగ్రహాలు చెక్కించుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం జీవితాన్ని ధారపోసిన జయశంకర్‌సార్‌ స్మృతివనంలో కేసీఆర్‌, కేటీఆర్‌ల బొమ్మలు ఏర్పాటు చేయడం అనైతికమన్నారు. ఈనెల 3న ములుగులో జరిగే సభలో గిరిజనులకు కేసీఆర్‌ ప్రభుత్వం ఇస్తామన్న రిజర్వేషన్‌లు, పోడు భూముల సమస్యలు, వెనుకబాటుకు గురైన ఆప్రాంత ప్రగతి, నిరుద్యోగులు, పట్టభద్రులకు ఉద్యోగ ఉపాధి కల్పన, ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సంజయ్‌ ముఖాముఖిలో చర్చిస్తారని రాకే్‌షరెడ్డి స్పష్టం చేశారు.


సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్‌, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల క్రిష్ణాకర్‌, పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకే్‌షయాదవ్‌, నాయకులు రాయకంటి పరమేశ్వర్‌, చల్లూరి మహేందర్‌, కొత్త సురేందర్‌, బానాల రాజ్‌కుమార్‌, లక్ష్మణ్‌, కిషోర్‌, హరీష్‌, కవిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:19:47+05:30 IST