తెలంగాణలో లాక్‌డౌన్‌పై బండి సంజయ్ ఏమన్నారంటే...

May 11 2021 @ 14:12PM

హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు అమలు కావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలు, కేసులను తగ్గించి చూపిస్తోందని ఆరోపించారు. రంజాన్ పండుగ తర్వాత రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. వాస్తవ నివేదికలు ఇవ్వకపోవడం వలన తెలంగాణ కేంద్రం సహాయం పూర్తిగా పొందలేకపోతోందన్నారు. ప్రధాని మోదీకి సలహాలిచ్చానని సీఎం కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. అంతర్గత సమావేశ విషయాలు బయటకు చెప్పటం సరైంది కాదన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో పేషెంట్ల మరణాలకు కారకులు ఎవరని, ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో పరిస్థితి అదుపు తప్పిందని, కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడే నిర్ణయాలు తీసుకుంటే సహకరిస్తామన్నారు. రంజాన్ పండుగకు ఇచ్చే ప్రాధ్యాన్యత ప్రజల ప్రాణాలకు సీఎం కేసీఆర్ ఇవ్వటం లేదని విమర్శించారు. రంజాన్ కంటే ముందు లాక్‌డౌన్ పెట్టొద్దని సీఎం కేసీఆర్‌ను ఓవైసీ ఆదేశించారన్నారు. ఓల్డ్ సిటీలో నైట్ కర్ఫ్యూ అమలు కావటం లేదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్క వర్గం కోసమే పనిచేస్తోందని, నిఖార్సైన హిందువునని చెప్పుకునే  కేసీఆర్ ఎందుకు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.