Bandi Sanjay: వారి అక్రమ సంపాదన చూసి కేసీఆరే షాక్ అవుతున్నారట..

ABN , First Publish Date - 2022-09-06T21:24:54+05:30 IST

అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళటంపై ప్రగతి భవన్‌లో చర్చ జరుగుతోందని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay: వారి అక్రమ సంపాదన చూసి కేసీఆరే షాక్ అవుతున్నారట..

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళటంపై ప్రగతి భవన్‌లో చర్చ జరుగుతోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ (CM KCR)ను మార్చటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పేకాట, లిక్కర్ స్కాం సహా.. అన్ని ఈడీ కేసుల్లో కేసీఆర్ పుత్ర రత్నాలున్నారన్నారని, కొడుకు, కూతురు అక్రమ సంపాదన చూసి కేసీఆరే షాక్ అవుతున్నారట అని వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడే .. టీఆర్ఎస్‌కు మోటార్లకు మీటర్లు గుర్తుకొస్తాయని, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల హామీలు అమలు చేసి.. ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళొచ్చన్నారు. కేసీఆర్ తల్లకిందులుగా తప్పస్సు చేసినా మునుగోడు (Munugodu)లో టీఆర్ఎస్ (TRS) గెలవదని, గెలిచేది బీజేపీ(BJP)నేనని జోస్యం చెప్పారు. 


ఈడీ తన పని తాను చేసుకుపోతోందని బండి సంజయ్ అన్నారు. ఈడీ (ED) సోదాలతో తమకేమి సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ అవినీతిలో కూరుకుపోయారన్నారు. హెల్త్ డైరెక్టర్ నుంచి సీఎంవో.. ఆరోగ్య మంత్రికి భారీగా మూటలు అందుతున్నాయని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం ఘటనపై మంత్రి హరీష్ రావును భర్తరఫ్ చేయకుండా సీఎం కేసీఆర్ కాపాడుతున్నారని, ఘటనపై శ్రీధర్ అనే డాక్టర్‌ను బలి చేయటం అన్యాయమన్నారు. గంటలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పెద్దలు కలిసే ప్రయత్నం చేయకపోవటం బాధాకరమని, మానవత్వం లేని మానవ మృగాలు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17న‌ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-06T21:24:54+05:30 IST