స‘పోర్టు’ ఏది?

ABN , First Publish Date - 2022-07-06T06:50:23+05:30 IST

బందరు పోర్టు పనుల ప్రారంభం అంశం మూడడుగులు ముందుకు ఆరడుగుల వెనక్కు అన్నచందంగా మారింది.

స‘పోర్టు’ ఏది?

నిధుల కొరతతో బందరుపోర్టు పనుల ప్రారంభంలో జాప్యం 

  రోడ్డు కం రైలు మార్గానికి నిధులు విడుదల కాని దైన్యం

  ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో మారడంతో కథ మొదటికి.. 

  జిల్లా అభివృద్ధికి పోర్టు నిర్మాణమే కీలకం

బందరు పోర్టు పనుల ప్రారంభం అంశం మూడడుగులు ముందుకు ఆరడుగుల వెనక్కు అన్నచందంగా మారింది. నిధుల కొరత కారణంగా పోర్టు పనులు ఇప్పట్లో ప్రారంభించే సూచనలు కానరావడం లేదు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే బందరు పోర్టు చాలా కీలకం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న  పోర్టు అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. ఇది తమ పరిధిలోనిది కాదన్నట్లుగా పక్కనపెట్టేస్తున్నారు. దీంతో బందరు పోర్టు నిర్మాణానికి నిధులు ఎప్పటికి సమకూరుస్తారో..  పనులు ఎప్పుడు  ప్రారంభిస్తారో స్పష్టత కొరవడింది. 

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు పోర్టు పనులు ప్రారంభం కావాలంటే ముందుగా రోడ్డు కం రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. పోర్టు వరకు రోడ్డు కం రైలుమార్గం కోసం 186 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. రైతుల నుంచి భూమిని తీసుకుంటే రూ.100 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులను నాలుగు నెలల క్రితమే ఏపీ మారిటైమ్‌ బోర్డు ద్వారా సమకూరుస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. పోర్టు నిర్మాణం జరిగే మంగినపూడి, తపసిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం గ్రామాల పరిధిలోని సముద్రం పక్కనే ఉన్న 1730 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. 335 సర్వే నంబరుగా ఈ భూమిని మార్చి కాకినాడ పోర్టు డైరెక్టరుకు అప్పగించింది. ఈ భూమిని తనఖాపెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.  బ్యాంకులు రుణం ఇస్తే రోడ్డుకం రైలు మార్గానికి, పోర్టు నిర్మాణానికి ఈ నగదును ఉపయోగించాలనేది ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల నుంచి రుణం ఎంతమేర వస్తుందనే అంశంపైనా అనేక అనుమానాలున్నాయి. బందరు పోర్టుకు ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేయకుండా బ్యాంకు రుణాలంటూ కాలయాపన చేస్తుండటంతో పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

 భూమి అందుబాటులో ఉన్నా... 

బందరు పోర్టును తొలిదశలోని నిర్మించేందుకు 2వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. భూసేకరణ చేయకుండానే అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంది. అయినా అధికారులు, పాలకులు  ముఖ్యమంత్రిని ఒప్పించి పోర్టు పనులు ప్రారంభించేలా చేయడంలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బందరు పోర్టు పనులను  మెఘా సంస్థ దక్కించుకుంది. ప్రభుత్వం పోర్టు పనులను మెఘా సంస్థలకు అప్పగించాల్సి ఉంది. గతంలో పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఈ కేసు ఈనెల 1వ తేదీన హియరింగ్‌కు వచ్చినట్టు మారిటైమ్‌ బోర్డు అధికారులు చెబుతున్నారు. కోర్టులో ఈ కేసు పరిష్కారమైతేనే పోర్టు పనులు మెఘా సంస్థకు అప్పగించేందుకు మార్గం సుగమం అవుతుంది.

  రామాయపట్నం పోర్టుకు గ్రీన్‌సిగ్నల్‌ 

బందరు పోర్టు అంశం 20 సంవత్సరాలుగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రెండుసార్లు పనులకు శంకుస్థాపన చేసినా వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. ఈ అంశం ఇలా ఉంటే ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టుకు ఈనెల మూడవ వారంలో పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసినట్టు మారిటైమ్‌ బోర్డు అధికారులు చెబుతున్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా విడతలవారీగా రుణం ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని, దీంతో రామాయపట్నం పోర్టు పనులు ఈనెలలోనే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. రామాయపట్నం పోర్టు  పనులు ప్రారంభించడానికి అన్ని వనరులు సమకూరితే, బందరుపోర్టు పనులు ప్రారంభించేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు,  అధికారులు ఏ కారణంలో మిన్నకుండిపోతున్నారనే అంశంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 మురళీధర్‌రెడ్డి స్థానంలో షణ్ముకన్‌ నియామకం

ఏపీ మారిటైమ్‌ బోర్డు ద్వారా బందరు పోర్టుతోపాటు రాష్ట్రంలోని ఇతర పోర్టుల నిర్మాణం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏపీ మారిటైమ్‌ సీఈవోగా గతంలో మురళీధర్‌రెడ్డి పనిచేయగా రెండు నెలల క్రితం ఆయనను మార్చి షణ్ముకన్‌ను సీఈవో నియమించారు. ఆయన ఇటీవల బందరుపోర్టు నిర్మాణం సాధ్యాసాధ్యాలపై సమీక్ష నిర్వహించిట్లు మారిటైమ్‌ బోర్డ్డు అధికారులు చెబుతున్నారు. సీఈవో మారడంతో బందరుపోర్టు నిర్మాణంపై గతంలో చేసిన కసరత్తు మొత్తం మళ్లీ మొదటికి వచ్చిందనే చర్చ నడుస్తోంది.

 పర్యావరణ అనుమతులకు రెండు నెలల సమయం 

బందరుపోర్టు పనులు ప్రారంభించేందుకు పర్యావరణ అనుమతుల కోసం ఈ ఏడాది మేలో ప్రజాభిప్రాయసేకరణ జరిపారు.  పోర్టు నిర్మిస్తే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని పార్టీల నాయకులు, పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతాల ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు. ఏపీ మారిటైమ్‌ బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపే పనిలో అధికారులున్నారు. రెండు నెలల వ్యవధిలో పర్యావరణ అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ లోగా బందరు పోర్టు నిర్మాణానికి అవసరమైన ఆర్థిక అంశాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తే  పనులు ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుంది. ఆ దిశగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చలు జరపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-07-06T06:50:23+05:30 IST