సీఎం కేసీఆర్ సొరంగంలో దాక్కున్నా వదలం: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-01-09T21:10:25+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ సొరంగంలో దాక్కున్నా వదలం: బండి సంజయ్

హనుమకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం హనుమకొండలో జరిగిన బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పెద్ద దగాకోరని, అవినీతి ముఖ్యమంత్రి అని సొరంగంలో దాక్కున్నా వదలిపెట్టేదిలేదని, జేసీబీలు పెట్టి చీల్చీ జైలుకు పంపుతామని అన్నారు. ఆయన కుటుంబాన్ని కూడా వదలమని స్పష్టం చేశారు. బండి సంజయ్‌ను లోపలేస్తే అంతా భయపడతారని సీఎం భావించారని.. గూగుల్‌లో ‘వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా’ అని కొడితే కేసీఆర్ పేరే వస్తోందన్నారు.


ఉద్యోగులు ఫెన్ డౌన్ చేస్తే కేసీఆర్ సీఎం అయ్యారని బండి సంజయ్ అన్నారు. 317జీవోతో ఉద్యోగులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికత కోసమే కదా తెలంగాణ తెచ్చుకుంది.. మరి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని జీవో తయారు చేశారని, ఈ జీవో ద్వారా ముఖ్యమంత్రి ఏం సాధిస్తారని నిలదీశారు. ఇప్పటి వరకు 8 మంది ఉద్యోగులు మనస్థాపంతో చనిపోయారన్నారు. ఎంతమంది చనిపోతే సీఎం కనికరిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబానికి సంక్రాంతి లేకుండా చేస్తామన్నారు. గ్యాస్ కట్టర్లతో తన కార్యాలయాన్ని బద్దలు కొట్టారని, ఏ తప్పు చేయని బొడిగ శోభను జైల్లో పెట్టారని మండిపడ్డారు. 317 జీవోను వెంటనే సవరించాలని, లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ జీవోను చెత్తబుట్టలో వేస్తామన్నారు. సూది, దబ్బనం అని హేళన చేసిన కమ్యూనిస్టు పార్టీలకు నిన్న దావత్ ఇచ్చారని, తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో చేయి కలుపుతున్నారని బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-01-09T21:10:25+05:30 IST