బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్‌

ABN , First Publish Date - 2021-10-27T06:32:41+05:30 IST

క్రికెట్‌ బెట్టింగ్‌ మూలాలు బెంగళూరులో వున్నట్టు నగర పోలీసులు గుర్తించారు.

బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్‌

పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ



విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ బెట్టింగ్‌ మూలాలు బెంగళూరులో వున్నట్టు నగర పోలీసులు గుర్తించారు. మాధవధారలోని ఒక అపార్టుమెంట్‌లో వుంటూ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న లాలం ప్రభాకర్‌ను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రభాకర్‌ను లోతుగా విచారించగా తన స్వస్థలం అనకాపల్లి అని, తాను ఫైనాన్సియర్‌గా పనిచేసి కొన్నాళ్ల కిందట నగరానికి వచ్చి మాధవధారలో ఫ్లాట్‌ కొనుగోలు చేసినట్టు వివరించాడు. తనకు బెంగళూరులో వుండే ప్రధాన బుకీలు బెట్టింగ్‌ యాప్‌లతోపాటు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయిస్తారని అందుకోసం వారికి కొంత మొత్తం కమీషన్‌గా చెల్లించాల్సి వుంటుందని వివరించినట్టు సమాచారం. తన కింద 20 మందిని ఫంటర్స్‌గా (స్థానికంగా బెట్టింగ్‌ కాసేవాళ్లను) నియమించుకుని, వారి నుంచి ముందుగానే రూ.50 వేలు వరకూ డిపాజిట్‌ చేయించుకున్న తర్వాతే బెట్టింగ్‌ లింక్‌ను వారికి షేర్‌ చేస్తానని వెల్లడించినట్టు తెలిసింది. ఫంటర్స్‌ కూడా తమ కింద మరికొందరిని నియమించుకోవడం, నేరుగా బెట్టింగ్‌ కాయడం వంటివి చేస్తుంటారని పోలీసులకు ప్రభాకర్‌ వివరించినట్టు సమాచారం. అయితే బెట్టింగ్‌ కట్టేవారి నుంచి ప్రధాన బుకీ వరకూ ఒకరితో ఒకరికి వ్యక్తిగత సంబంధాలు ఉండవని, కేవలం యాప్‌లోనే కాంటాక్ట్‌ అవుతుంటారని పోలీసులు పేర్కొంటున్నారు. టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో బెట్టింగ్‌పై గట్టి నిఘా ఏర్పాటుచేయాలని సీపీ మనీష్‌కుమార్‌సిన్హా పోలీసు సిబ్బందిని ఇప్పటికే ఆదేశించారు. 


Updated Date - 2021-10-27T06:32:41+05:30 IST