ఛేదనలో ‘పంజా’బ్‌

Published: Mon, 28 Mar 2022 04:20:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఛేదనలో పంజాబ్‌

 బెంగళూరుపై విజయం 

డుప్లెసీ ఫిఫ్టీ వృథా

ముంబై: తమ తొలి మ్యాచ్‌లోనే పంజాబ్‌ కింగ్స్‌ అదరగొట్టింది. 206 పరుగుల భారీ ఛేదనలో ఎక్కడా తడబడకుండా ఓవర్‌కు పది రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. దీంతో ఒక్క బ్యాటర్‌ కూడా ఫిఫ్టీ చేయకపోయినా సమష్టి ఆటతీరుతో మరో ఓవర్‌ ఉండగానే నెగ్గింది. ధవన్‌ (43), రాజపక్స (43), మయాంక్‌ (32) విజయానికి బాటలు వేయగా.. చివర్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఓడియన్‌ స్మిత్‌ (8 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 25 నాటౌట్‌), షారుక్‌ (24 నాటౌట్‌) చెలరేగారు. దీంతో బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు అరంగేట్ర కెప్టెన్‌ డుప్లెసీ (57 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 88) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోహ్లీ (41 నాటౌట్‌), దినేశ్‌ కార్తీక్‌ (32 నాటౌట్‌) రాణించారు.


ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ ఆరంభంలో నిదానంగా సాగినా.. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ పరుగుల వరద పారింది. పవర్‌ప్లే తర్వాత డుప్లెసీ బాదుడుకు బౌలర్లు కుదేలయ్యారు. తొలి 30 బంతుల్లో 17 పరుగులే చేసిన అతను ఆ తర్వాత 11 బంతుల్లోనే మరో 34 పరుగులతో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 118 రన్స్‌ జత చేశాడు. ఇక దినేశ్‌ కార్తీక్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చివరి రెండు ఓవర్లలోనే 34 రన్స్‌ రావడంతో జట్టుస్కోరు 200 దాటింది. భారీ ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసి గెలిచింది. 18వ  ఓవర్‌లో స్మిత్‌ మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 25 పరుగులు సాధించడంతో ఉత్కంఠ వీడింది.


బెంగళూరు: 

20 ఓవర్లలో 205/2 (డుప్లెసీ 88, కోహ్లీ 41 నాటౌట్‌, దినేశ్‌ కార్తీక్‌ 32 నాటౌట్‌; రాహుల్‌ చాహర్‌ 1/22).


 పంజాబ్‌: 

19 ఓవర్లలో 208/5 (ధవన్‌ 43, రాజపక్స 43, స్మిత్‌ 25 నాటౌట్‌; సిరాజ్‌ 2/59).

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.