బెంగళూరు హింస

ABN , First Publish Date - 2020-08-14T06:48:39+05:30 IST

భారతదేశంలో సమ్మిశ్రిత జీవనవిధానం ఉన్నదని గొప్పగా చెప్పుకుంటాము కానీ, అది చిన్నపాటి పరీక్షకు కూడా తట్టుకుని నిలబడడం పెద్ద ప్రయాస అవుతున్నది...

బెంగళూరు హింస

భారతదేశంలో సమ్మిశ్రిత జీవనవిధానం ఉన్నదని గొప్పగా చెప్పుకుంటాము కానీ, అది చిన్నపాటి పరీక్షకు కూడా తట్టుకుని నిలబడడం పెద్ద ప్రయాస అవుతున్నది. మన సమాజంలో మంచితనం, పరస్పర సహనం వంటి విలువలు లేవని కాదు. ఆ ప్రాతిపదిక లేకపోతే, ఇంత పెద్ద దేశంలో ఇంత వైవిధ్యం, ఈ మాత్రం సాపేక్ష శాంతి సాధ్యమయ్యేవి కావు. కానీ, ఆ ప్రశాంతత అన్నది నివురుగప్పిన నిప్పు లాగ మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడు బద్దలవుతుందో అని భయంగా ఉంటుంది. సామరస్యం కత్తిమీద సాము అనిపిస్తుంది. ఈ వాతావరణం సహజంగా ఏర్పడినది కాదు. చారిత్రకంగా ఉన్న వైరుధ్యాలతో పాటు, ఇటీవలి కాలంలో పనిగట్టుకుని సృష్టించిన అగాధాలు కూడా వర్తమానాన్ని అతి సున్నితం చేశాయి, చేస్తున్నాయి.


రెండు రోజుల కిందట బెంగళూరు నగరంలో జరిగిన ఘటనలు, మన సమాజంలో నెలకొని ఉన్న అవిశ్వాసాన్ని తెలియజేస్తాయి. ఒక ఆకతాయి కానీ, ఒక జులాయి కానీ, ఒక ఉన్మాదికానీ సామాజిక మాధ్యమాలలో ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేస్తే, వ్యవస్థ వెంటనే స్పందించి ఆ దుర్మార్గుడిని బోను లో నిలబెడుతుందన్న నమ్మకం లేదు. సంస్కారమో, సామాజిక బాధ్యతో తెలియని ఒక అవివేకి చేసిన పనికి మొత్తం సమాజం మీద ఆగ్రహం చూపకూడదన్న విచక్షణ లేదు. ఆగ్రహంతో ఊగిపోతున్న జనాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆచరించగలిగే, సాధ్యమయ్యే ప్రజాస్వామిక పద్ధతులేమిటో శాంతి రక్షకులకు తెలియదు. పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా చల్లబరిచి, ప్రశాంతతను ఏర్పరచి, దెబ్బతిన్న సఖ్యతను పునరుద్ధరించడానికి ప్రయత్నించకుండా, అగ్గికి ఆజ్యం పోసే వ్యాఖ్యలు చేయకూడదని రాజకీయ నేతలకు తెలియదు. వీటన్నిటి ఫలితం ఏమిటి? నష్టపోయింది ఎవరు? ఏ ప్రాణాలు పోయాయి? ఎవరి ఆస్తులు నష్టపడ్డాయి? శాశ్వతమైన దెబ్బతిన్నది ఏ విలువలు?


ఇతర విశ్వాసాల వారిని, ఇతర జీవనవిధానాల వారిని రెచ్చగొట్టడానికి ప్రతీకాత్మకమైన అవమానాలను, హింసలను చేపట్టడం ఒక అలవాటుగా మారిపోయింది. అంబేడ్కర్ విగ్రహాలను అవమానపరచడం, ఇప్పుడు కొత్తగా ఫూలే విగ్రహాలపై కూడా దాడులు చేయడం, ఒక మతం వారు అత్యంత పవిత్రంగా భావించే అంశాలలో అపచార పూర్వకమైన మాటలో చేతలో చేయడం- ఇవన్నీ సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి, మరో మాటలో చెప్పాలంటే, సామాజిక ఆధిక్యాలను ప్రకటించుకోవడానికి చేస్తుంటారు. భౌతికంగా విగ్రహాలకు అపచారం చేసినట్టే, సామాజిక మాధ్యమాల్లో ఏవో రాతలు, చేతలు చేస్తుంటారు. వీళ్లకు అశాంతి సృష్టించడం కూడా ఒక అలవాటు, అవసరం. ఈ సత్యం తెలిసి కూడా ఎందుకు అశాంతి చెందాలి- అన్న ప్రశ్న వస్తుంది. ఏనుగు దారిన వెడుతుంటే, కుక్కలు మొరుగుతాయని- మంచి వారిపై ఎవరైనా దూషణలు చేస్తుంటే, సామెత చెప్పుకుంటాము కదా! అంటే ఏమిటి అర్థం? అందరి వ్యాఖ్యలకు, అందరి చేతలకు మనం మనసు నొప్పించుకోగూడదు. నొప్పించగలిగే అర్హతను, యోగ్యతను మనం అందరికీ ఇవ్వకూడదు. ప్రపంచాన్నే రక్షించే భగవంతుడు, సర్వాంతర్యామి- ఒక అల్పుడి చేష్టలకు భంగపడతాడా? కాబట్టి, ఎవరో రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే, రెచ్చిపోవడం మానుకోవాలి. మానుకోకపోతే, అవతలివారి ప్రయోజనాలను కాపాడినవాళ్లమవుతాము. 


శాంతిభద్రతల యంత్రాంగం పని ఏమిటి? తన పని తాను సమర్థంగా, సమయలోపం లేకుండా చేయడం. మంగళవారం నాడు సాయంత్రమే, ఫేస్ బుక్ అపచారం గురించి ఫిర్యాదు చేస్తే పోలీసులు తక్షణం స్పందించకపోవడం ఒక పొరపాటు. జరిగిన అపచారం గురించి ఆ నోటా ఈ నోటా విని ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే సరికి, విషమిస్తున్న పరిస్థితిని అదుపులోకి తేవడానికి రాజకీయమైన మార్గాలను వెంటనే ఉపయోగించి ఉండవలసింది. తీరా ఆలస్యం జరిగాక, ఆందోళనకారులకు నచ్చచెప్పే పనిలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. కోపంలో ఉన్నవారిని అదుపులో పెట్డడానికి కాల్పులు జరపడం ఒక్కటే మార్గమా, దాని వల్ల పరిస్థితి మరింత విషమించలేదా?- ఇవన్నీ సమీక్షించుకోవలసిన విషయాలు. 


మైనారిటీల ప్రతినిధులు, వారి రాజకీయ ప్రతినిధులు- ఈ సంఘటన పూర్వాపరాలను పూర్తిగా వివేచించుకుని, ఒక అవగాహనకు రావాలి. ప్రజల ఉద్వేగాలను నియంత్రించే శక్తిలేని వారు, ఆవేశాలను రెచ్చగొట్టకూడదు. ప్రజాప్రతినిధి ఇంటిని, రోడ్డుమీద వాహనాలను, పోలీస్ స్టేషన్లను దహనం చేయడానికి పూనుకోవడం- ఏ విధంగానూ సమర్థనీయం కాదు. అపచారం పేరు చెప్పి ఏదైనా చేయవచ్చుననుకోవడం తప్పు. రాజ్యాంగానికి, చట్టానికి అందరూ లోబడి ఉండాలి. దేశవ్యాప్తంగా అనేక చోట్ల మైనారిటీల విషయంలో సమాజం నుంచి, ప్రభుత్వాల నుంచి ఎదురవుతున్న పరిస్థితులను ప్రస్తావించి, బెంగళూరులో జరిగిన దాన్ని సమర్థించడం కానీ, బెంగళూరు హింసను ప్రశ్నించకూడదనడం కానీ సరి కాదు. నియమబద్ధంగా ఉండవలసి రావడం బాధితులపై ఒక నైతిక భారం. దాన్ని మోయవలసిందే. 


బెంగళూరులో జరిగిన సంఘటన చిన్నదో పెద్దదో- దాని ప్రభావాన్ని సాధ్యమైనంత త్వరలో తొలగించడం అవసరం. అంతేకాక, అటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా సంబంధిత పక్షాలన్నీ చర్యలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమంలో వ్యాఖ్య చేసినతను, అది మరెవరో తన ఖాతాను దొంగిలించి చేసిన వ్యాఖ్య అంటున్నాడు. అదే నిజమైతే, ఈ పరిణామాల వెనుక ఉన్న కుట్రను ఛేదించాలి. ఇస్లామిక్ రాడికలిజం- దీని వెనుక ఉన్నట్టు తమకు తెలుస్తోందని కర్ణాటక హోంమంత్రి అంటున్నారు. ముస్లిముల సంస్థ పాపులర్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ -సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా- ప్రమేయం ఇందులో ఉన్నట్టు ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటిపై, పోలీస్ స్టేషన్లపై దాడి కేసులో ఆపార్టీ ప్రముఖులను నిందితులుగా పెట్టారు. ఈ కేసును విచారించేటప్పుడు భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి. జరిగిన ఘటన కంటె, దర్యాప్తు పేరుతో బాధితులు పెరగకుండా చూడాలి. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా వ్యవహరించకూడదు. 


దేశంలోని అన్ని అవాంఛనీయ సంఘటనలను ఖండించినట్టే బెంగళూరు ఘటనలను కూడా ఖండించాలి. బెంగళూరు విషయంలో నిక్కచ్చిగా ఉన్నట్టే దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనల విషయంలోనూ ఉండాలి. పారదర్శకత, సమానన్యాయం, సమాన పరిగణన- ప్రజాస్వామ్యానికి కీలకమయినవి. జనజీవనంలో ఐక్యతను సాధ్యమైనంత దృఢత్వంతో నిర్మించడానికి కూడా ఆ విలువలు అవసరం.

Updated Date - 2020-08-14T06:48:39+05:30 IST