కీలక మ్యాచ్‌లో ఉసూరుమనిపించిన భారత బ్యాటర్లు.. ఇక భారం బౌలర్లపైనే!

ABN , First Publish Date - 2022-03-22T15:23:37+05:30 IST

మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఉసూరుమనిపించారు.

కీలక మ్యాచ్‌లో ఉసూరుమనిపించిన భారత బ్యాటర్లు.. ఇక భారం బౌలర్లపైనే!

హామిల్టన్: మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఉసూరుమనిపించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మిథాలీసేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 229 పరుగులే చేసింది. బంగ్లాదేశ్‌కు 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం అందించిన ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత అదే స్కోర్ వద్ద టీమిండియా వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మిథాలీ రాజ్ మరోసారి నిరాశపరిచింది. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగింది. మంచి ఫామ్‌లో ఉన్న మరో సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కూడా విఫలమైంది. 14 పరుగులే చేసి పెవిలియన్ చేరింది.


మధ్యలో యస్తీక భాటియా అర్ధశతకం(50) చేయడం కాస్తా ఊరటనిచ్చే విషయం. అంతేగాక వికెట్ కీపర్ రిచా ఘోష్(26)తో కలిసి ఐదో వికెట్‌కు 54 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించింది. చివరలో పూజా వస్త్రాకర్(30), స్నేహ రాణా(27) రాణించడంతో భారత్ పోరాడే స్కోర్ సాధించగలింది. బంగ్లా బౌలర్లలో రీతు మోనీ 3 వికెట్లు తీస్తే.. నహీదా అక్తర్ 2, అలం ఒక వికెట్ పడగొట్టారు. కాగా, సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విఫలం కావడం కలవరపెడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత గెలవాలంటే బౌలర్లు రాణించాల్సిందే. కనుక ఇప్పుడు భారమంత బౌలర్లపైనే ఉంది.  

Updated Date - 2022-03-22T15:23:37+05:30 IST