31 పైసలు బాకీ ఉన్నాడని రైతుకు సర్టిఫికెట్ ఇవ్వని ఎస్‌బీఐ

ABN , First Publish Date - 2022-04-29T02:48:57+05:30 IST

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ సమీపంలోని ఖోరజ్ గ్రామానికి చెందిన శ్యాంజీ భాయ్ అనే వ్యక్తి తన భూమిని ఇద్దరికి 2020లో విక్రయించాడు. అయితే గతంలో ఈ భూమిపై మూడు లక్షల రూపాయలు బ్యాంకు నుంచి శ్యాంజీ రుణం తీసుకున్నాడు..

31 పైసలు బాకీ ఉన్నాడని రైతుకు సర్టిఫికెట్ ఇవ్వని ఎస్‌బీఐ

గాంధీనగర్: నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మోహుల్ చోక్సీ వంటి వారు వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే కిక్కురుమనని బ్యాంకులు సాధారణ వ్యక్తులు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాడంటే ఇంటికి వెళ్లి తాళం వేస్తుంటాయి. సహజంగా బ్యాంకుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా చెప్పే మాటే ఇది. అయితే బ్యాంకులు ఇంతకన్నా క్రూరంగా వ్యహరిస్తాయని గుజరాత్‌లో వెలుగు చూసిన ఒక సంఘటన తెలుసుకుంటే అర్థం అవుతుంది. కేవలం 31 పైసల బాకీ ఉన్నాడని ఒక రైతుకు ‘నో డ్యూ సర్టిఫికెట్’ ఇవ్వలేదు దేశంలోని అత్యున్న బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో భూమిని అమ్ముకునేందుకు ఆ రైతు చాలా ఇబ్బంది పడ్డాడు.


గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ సమీపంలోని ఖోరజ్ గ్రామానికి చెందిన శ్యాంజీ భాయ్ అనే వ్యక్తి తన భూమిని ఇద్దరికి 2020లో విక్రయించాడు. అయితే గతంలో ఈ భూమిపై మూడు లక్షల రూపాయలు బ్యాంకు నుంచి శ్యాంజీ రుణం తీసుకున్నాడు. అయితే అది తిరిగి చెల్లించాడు. కానీ కొద్ది రోజుల క్రితం భూమిని అమ్మేశాడు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగడం లేదు. కారణం బ్యాంకు నుంచి నో డ్యూ సర్టిఫికెట్ రాలేదు. దీనిపై వాళ్లు కోర్టును ఆశ్రయించగా బ్యాంకు తరపు వాదనలు వినిపించి న్యాయవాది ఆశ్చర్యపోయే విషయం వెల్లడించారు. శ్యాంజీ బ్యాంకుకు 31 పైసలు చెల్లించాల్సి ఉందని, అందుకే సర్టిఫికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. వాస్తవానికి 50 పైసల కంటే తక్కువ బాకీ ఉంటే లెక్కలోకి రాదు. విషయం తెలుసుకున్న కోర్టు బ్యాంకుకు చీవాట్లు పెట్టి రైతు శ్యాంజీకి సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది.

Updated Date - 2022-04-29T02:48:57+05:30 IST