బ్యాంకుల ప్రైవేటీకరణ ఆగదు

ABN , First Publish Date - 2022-03-19T08:17:49+05:30 IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణ ప్రక్రియ త్వరితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది...

బ్యాంకుల ప్రైవేటీకరణ ఆగదు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణ ప్రక్రియ త్వరితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అడ్డంకిగా ఉన్న 1949 నాటి బ్యాంకింగ్‌  నియంత్రణ చట్టానికి సవరణ చేయబోతోంది. ఈ చట్టం ప్రకారం పీఎస్‌బీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 20 శాతం మించి ఉండకూడదు. దీన్ని అధిగమించే సవరణ బిల్లు ప్రతిపాదనను అధికార వర్గాలు త్వరలోనే కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి పంపనున్నాయి. నిజానికి రెండు పీఎస్‌బీల ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి కావాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మార్కెట్‌ పరిస్థితులు సరిగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ విషయంలో వెనుకంజ వేసింది. 

ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ : కాగా ఏయే పీఎస్‌బీలను ప్రైవేటీకరించేది ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సీబీఐ), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ)లను ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినట్టు సమాచారం. దీంతో ఈ రెండు బ్యాంకుల సిబ్బందికి త్వరలోనే వీఆర్‌ఎస్‌ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేబినెట్‌ ఆమోదానికి సమర్పించే ప్రతిపాదనలో ఈ అంశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు మాత్రం దీనిపై ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడేది లేదని ప్రకటించాయి. 

Updated Date - 2022-03-19T08:17:49+05:30 IST