యూట్యూబ్‌ చూసి బ్యాంక్ చోరీ

ABN , First Publish Date - 2020-11-29T05:55:48+05:30 IST

నిందితులు ప్రొఫెషనల్స్‌ కాదు.. కనీసం పాత నేరస్తులు..

యూట్యూబ్‌ చూసి బ్యాంక్ చోరీ
నగదును పరిశీలిస్తున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ

ఆర్థిక ఇబ్బందులు.. అప్పులతో బ్యాంకుపై కన్ను 

నిందితుల అరెస్టు.. రూ.77 లక్షల సొత్తు స్వాధీనం

వివరాలు వెల్లడించిన రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ


గుంటూరు(ఆంధ్రజ్యోతి):
నిందితులు ప్రొఫెషనల్స్‌ కాదు.. కనీసం పాత నేరస్తులు కూడా కాదు.. యూ ట్యూబ్‌ చూసి దొంగతనం ఎలా చేయాలి.. ఆనవాళ్లు దొరకకుండా ఏమి చేయాలి.. గ్యాస్‌ కట్టర్‌ను ఎలా వినియోగించాలి.. లాకర్‌ ఎలా తెరవాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పోలీసులకు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలి.. వంటి విషయాలను యూట్యూబ్‌ ద్వారా తెలుసుకున్నారు. ఆ ప్రకారం బ్యాంకులో చోరీ చేశారు. అయినా నిందితులు పోలీసులకు పట్టు బడ్డారు. సంచలనం సృష్టించిన దాచేపల్లి పరిధిలోని తంగెడలోని ఎస్‌బీఐలో జరిగిన చోరీ కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించి రూ.77 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం గుంటూరులోని పోలీస్‌ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ కేసు వివరాలు వెల్లడించారు.


మిర్యాలగూడలోని గాంధీనగర్‌కు చెందిన కేదారి ప్రసాద్‌ (21), అతడికి బాబాయి వరుసయ్యే వినయ్‌ రాములు(37) ఆర్థిక ఇబ్బందులు, అప్పుల పాలయ్యారు. యూటూబ్‌ చూసి బ్యాంక్‌ చోరీ చేయాలని నిర్ణయించారు. నిందితుల్లో ఒకరైన కేదారి ప్రసాద్‌ ఇంటర్‌ వరకు చదివాడు. ఈ క్రమంలో బ్యాంక్‌లో ఎలా చోరీ చేయాలో యూటూబ్‌ చూసి నేర్చుకున్నారు. చివరకు దాచేపల్లి పరిధిలోని తంగెడలో గల ఎస్‌బీఐను చోరీ కోసం ఎంచుకున్నారు. ఈ బ్యాంక్‌ మెయిన్‌రోడ్డుకు కొంచెం దూరంగా ఉండటం, చుట్టుపక్కల ఇళ్ళు లేకుండా ఖాళీ ప్రదేశాలు ఉండటం, భవనం నిర్మాణం కూడా పూర్తి కాకపోవడం వంటి అంశాలు చోరీకి కలిసి వస్తాయని భావించి ఈ బ్యాంక్‌ను ఎంచుకున్నారు. రెక్కీ నిర్వహించి పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చాక పని ప్రారంభించారు.


నిందితులు గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో చోరీకి పాల్పడ్డారు. పోలీస్‌ జాగిలాలు నిందితుల వాసన, ఆనవాళ్ళు గుర్తించకుండా ఉండేందుకు కారప్పొడి చల్లారు. ఏ మాత్రం ఆలస్యమైనా సొమ్ము రికవరీ సాధ్యం కాదని, నిందితులు తప్పించుకునే వీలుంటుందని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఎనిమిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తొలుత బ్యాంక్‌ను పరిశీలించినప్పుడు చోరీ జరిగిన తీరును చూసి ఇది ప్రొఫెషనల్స్‌ పనేనని అనుమానించారు. నిందితులు బ్యాంక్‌లో సీసీ కెమెరాల కనెక్షన్‌ తొలగించడం, విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, ఘటనా స్థలిలో కారప్పొడి చల్లడం, మాస్క్‌లు ధరించడం వంటి వాటిని బట్టి అనుభవం ఉన్నవారే చేసి ఉంటారని భావించారు. కానీ పోలీసులు ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను బట్టి ఇది కొత్త వ్యక్తుల పనేనని చివరకు నిర్ధారించారు. సెల్‌ఫోన్‌ డేటాతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించారు. నిందితులు ఒక్కసారిగా రూ.77 లక్షల నోట్ల కట్టలు చూసేసరికి భయపడ్డారు. వాటిని ఎక్కడ దాచాలో అర్థం కాక ఇంటిలో కాకుండా చెట్లపొదల్లో కొంత, మరో చోట మరికొంత దాచారు.


సమర్థవంతంగా పోలీసుల పని తీరు 

బ్యాంక్‌ చోరీ కేసును ఛేదించే విషయంలో సీసీఎస్‌ అదనపు ఎస్పీ ఎన్‌వీఎస్‌ మూర్తి, గురజాల డీఎస్పీ జయరామ్‌ ప్రసాద్‌, సీసీఎస్‌ డీఎస్పీ రవికృష్ణకుమార్‌, గురజాల రూరల్‌ సీఐ ఉమేష్‌, దాచేపల్లి ఎస్‌ఐ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్‌బీ సీఐ బాలమురళీకృష్ణల ఆధ్వర్యంలో 8 బృందాలు సమర్థవంతంగా పని చేశాయని రూరల్‌ ఎస్పీ వారికి కితాబునిచ్చారు. ముఖ్యమైన కేసులకు డీజీపీ అందించే ఏబీసీడీ అవార్డులకు ఈ కేసును పంపనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బందినీ ప్రత్యేకంగా అభినందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టడం లేదన్నారు. 


Updated Date - 2020-11-29T05:55:48+05:30 IST