పేదలపై ప్రలోభాల వల

ABN , First Publish Date - 2021-01-04T05:42:51+05:30 IST

పేదలందరికి ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న నివేశన స్థలాలపై కొంతమంది బడాబాబుల కన్ను పడింది.

పేదలపై ప్రలోభాల వల

పేదలందరికి ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న నివేశన స్థలాలపై కొంతమంది బడాబాబుల కన్ను పడింది. ఊరికి దగ్గరగా ఉండే లేఅవుట్ల వద్ద వీళ్లు తమ అనుచరులను పంపించి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్లాటుకు రూ.50 వేల నుంచి బేరం మొదలు పెడుతున్నారు. ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షలు ఇచ్చేందుకు కూడా ముందుకొస్తున్నారు. ఇప్పటికే అప్పులఊబిలో ఉన్న కొంతమంది నిరుపేదలు వాటి నుంచి గట్టెక్కేందుకు తమకు వచ్చిన ప్లాట్‌ని అగ్రిమెంట్‌ చేసి ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఒప్పందాలు మరింత ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశం లేకపోలేదు. 


రూ.50 వేలు... రూ.లక్ష... రూ.2 లక్షలు ఇస్తామంటూ బేరాలు

అగ్రిమెంట్లు చేసేందుకు సిద్ధపడుతున్న పేద ప్రజలు 

ఇలాగైతే జగనన్న లేఅవుట్‌ కాలనీలు బడాబాబులు చేతుల్లోకి...!


గుంటూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేదలందరికీ ఇళ్ల పథకం కింద సుమారు 2.85 లక్షల మందికి నివేశన స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గత నెల 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 7వ తేదీతో ప్లాట్ల పంపిణీ, ఇళ్లు మంజూరైన వారితో పక్కా ఇళ్ల్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేయనుంది. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు సెంటున్నర, పట్టణ ప్రాంత లబ్ధిదారులకు సెంటు భూమిని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇందుకోసం రూ.1,535 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టింది. గుంటూరు నగరంలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు స్థలాలు సేకరించే పరిస్థితి లేకపోవడంతో పేరేచర్ల, దామరపల్లి, లాం, జొన్నలగడ్డ, ఏటుకూరు, బుడంపాడు పరిసర ప్రాంతాల్లో భూములను సేకరించింది. కాగా పట్టణ ప్రాంత లబ్ధిదారులకు నివేశన స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నారు. అవి కూడా దాదాపుగా 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ఇచ్చేది సెంటు భూమి(48 చదరపు గజాలు) మాత్రమే కావడంతో అందులో ఒక కుటుంబం జీవించడానికి సరిపడా వైశాల్యంతో ఇల్లు నిర్మించడం సాధ్యపడే విషయం కాదన్నది బహిరంగ రహస్యమే. దీంతో కొంతమంది లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకొనే ఆలోచనలేదు. దీంతో వారు దళారుల ప్రలోభాల వలలో పడుతున్నారు. ఊరికిదూరంగా ఉన్న ప్రాంతాలు కావడంతో ప్లాటుకు రూ.50 వేలు ఇస్తామని బేరసారాలు సాగిస్తున్నారు. ఈ లేఅవుట్‌లు ఇప్పట్లో అభివృద్ధి కాలేవని, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నగరానికి ఆనుకొని ఏర్పడిన కాలనీలే ఇప్పటికీ సమస్యలతో సతమతమౌతున్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఇక్కడికి వచ్చినా మీరు ఉపాధి కోసం నిత్యం పది, పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుందని, అది సాధ్యపడేది కాదని అంటున్నారు. ఈ విధంగా ఏవేవో చెబుతూ ప్లాటు తమకు ఇస్తే వెంటనే నగదు చేతిలో పెడతామంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొన్న వారు ప్లాటుని అమ్మి సొమ్ము చేసుకొనేందుకు సిద్ధపడుతున్నారు.  ఈ బేరసారాలు వెనక కొంతమంది రియల్టర్లు, రాజకీయ నాయకులు ఉన్నట్లు సమాచారం. ఒప్పందాలపై ప్లాట్లు చేతులు మారితే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు. 

Updated Date - 2021-01-04T05:42:51+05:30 IST