Maharashtra Political Crisis: థానేలో ఏక్‌నాథ్ షిండేకు అనుకూలంగా బ్యానర్లు

ABN , First Publish Date - 2022-06-24T00:45:36+05:30 IST

మహారాష్ట్ర సంక్షోభానికి కారణమైన శివసేన ఎమ్మెల్యే, మంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)కు అనుకూలంగా

Maharashtra Political Crisis: థానేలో ఏక్‌నాథ్ షిండేకు అనుకూలంగా బ్యానర్లు

థానే: మహారాష్ట్ర సంక్షోభానికి కారణమైన శివసేన ఎమ్మెల్యే, మంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)కు అనుకూలంగా థానేలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. మరికొన్ని చోట్ల సేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)కు అనుకూలంగా బ్యానర్లు కనిపించాయి. థానేలోని కోప్రి-పచ్‌పఖడి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఏక్‌నాథ్ షిండే (58) శివసేన (Shiv Sena)కు గట్టి పట్టున్న థానే-పల్ఘర్ ప్రాంతంలో ఆ పార్టీ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.


మంగళవారం ఒక్కసారిగా అదృశ్యమైన షిండే ఆ తర్వాత సూరత్‌లోని ఓ హోటల్‌లో సేన ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరగబోతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అనుకున్నట్టే ‘మహా’ రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు వీడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప తాము తిరిగి రాబోమని షిండే తమ డిమాండ్‌ను సీఎం ఉద్ధవ్ ముందు ఉంచారు. 


షిండే తిరుగుబాటు నేపథ్యంలో సేనలోని ఓ వర్గం కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా థానే, కల్యాణ్, డోంబివలి తదితర ప్రాంతాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. థానే మాజీ మేయర్, ప్రస్తుతం శివసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ ఎంహస్కే (Naresh Mhaske) కూడా షిండేకే మద్దతు ప్రకటించారు. షిండే ఫొటోతో ఓ ట్వీట్ చేస్తే తాము మీతోనే ఉంటామని, హిందుత్వకు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. షిండే అనుకూలుడుగా పేరుపొందిన థానే రూరల్ జిల్లా శివసేన చీఫ్ ప్రకాష్ పాటిల్ (Prakash Patil) మాట్లాడుతూ.. ‘సాహెబ్’ వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని చెప్పారు. అయితే, ఆ సాహెబ్ ఎవరన్న విషయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం.

Updated Date - 2022-06-24T00:45:36+05:30 IST