AP new bar licenses: అద్దంకిలో అత్యధికంగా రూ.1.37 కోట్లు

ABN , First Publish Date - 2022-08-01T00:42:14+05:30 IST

ఈ వేలం ద్వారా బాపట్ల జిల్లా (Bapatla District)లో ఆదివారం నిర్వహించిన బార్ల లైసెన్సుల ప్రక్రియ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది.

AP new bar licenses: అద్దంకిలో అత్యధికంగా రూ.1.37 కోట్లు

బాపట్ల: ఈ వేలం ద్వారా బాపట్ల జిల్లా (Bapatla District)లో ఆదివారం నిర్వహించిన బార్ల లైసెన్సుల ప్రక్రియ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. అద్దంకి నగర పంచాయతీ పరిధిలో అత్యధికంగా ఓ బార్‌కు రూ.1.37 కోట్ల ధర పలకింది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన అప్‌సెట్‌ ప్రైజ్‌ రూ.15 లక్షలు కాగా, అధికార, ప్రతిపక్ష పార్టీలు పట్టుదలకు పోవడంతో ఇంత భారీ ధర పలికినట్లు సమాచారం. ఇదే బార్‌ను గత ప్రభుత్వంలో లాటరీ ద్వారా కేవలం రూ.10 లక్షలు చెల్లించి చేజిక్కించుకోగా, ప్రస్తుతం ఏకంగా కోటిపైన ధర పలకడంతో లిక్కర్‌ వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 17 బార్‌లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ (Online Bidding) నిర్వహించగా 26 మంది మాత్రమే దరఖాస్తు చేసుకుని వేలంలో పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో వేలం అయినప్పటికీ పరిమిత సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు రావడం వెనక తెరవెనక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పాటు వ్యాపారుల సిండికేట్‌ మాయాజాలం కూడా పనిచేసినట్లు సమాచారం. చీరాలలో 6 షాపులకు వేలం నిర్వహించగా ఇక్కడ కూడా అత్యధికంగా రూ.86.90 లక్షల ధర పలికంది. బాపట్లలో 5, రేపల్లెలో 5 బార్‌లకు వేలం నిర్వహించగా అప్‌సెట్‌ ప్రైజ్‌కు చేరువలోనే లైసెన్సులు దక్కించుకున్నారు.

Updated Date - 2022-08-01T00:42:14+05:30 IST