రిజిస్ట్రేషన్లతోనే.. రాబడి

ABN , First Publish Date - 2022-08-07T05:46:35+05:30 IST

బాపట్ల జిల్లా ఏర్పడి నాలుగు నెలలు అవుతోంది. ఇక్కడ రియల్‌ఎస్టేట్‌ అంతంతమాత్రమే. అయినా ప్రభుత్వం ఆదాయ ఆర్జనకు అసాధారణ రీతిలో లక్ష్యాలను నిర్దేశించింది.

రిజిస్ట్రేషన్లతోనే.. రాబడి
బాపట్లలోని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం

స్థిరాస్తి రంగంపైనే ఆశలన్నీ 

గడచిన నాలుగు నెలల్లో రూ.62 కోట్ల ఆర్జన

2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.196 కోట్ల లక్ష్యం

అసాధారణ రీతిలో రాబడి లక్ష్యాలు నిర్దేశించిన ప్రభుత్వం

రియల్‌ఎస్టేట్‌ పుంజుకుంటేనే ఆశించిన విధంగా ఆదాయం

బాపట్ల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా ఏర్పడి నాలుగు నెలలు అవుతోంది. ఇక్కడ రియల్‌ఎస్టేట్‌ అంతంతమాత్రమే. అయినా ప్రభుత్వం ఆదాయ ఆర్జనకు అసాధారణ రీతిలో లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. జిల్లాలో 12 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. అయితే వీటి ఆదాయంపై ప్రభుత్వం భారీగా అంచనాలు వేసింది. నూతన జిల్లాలో స్థిరాస్తి క్రయ విక్రయాలు ఎక్కువ జరుగుతాయనే ఉద్దేశంతో ఏకంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.196 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. వాస్తవానికి జిల్లాలో ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల సామర్థ్యం దృష్ట్యా ఇంత ఆదాయం ఆర్జన అనేది విపరీతమైన బూమ్‌ ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ ప్రభుత్వం ఆదాయార్జనకు అవకాశం ఉన్న శాఖ కావడంతో అసాధారణ రీతిలో లక్ష్యాలను నిర్దేశించినట్లు సమాచారం.   జిల్లాలోని 12 రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మున్సిపాలిటీలుగా ఉన్న చీరాల, బాపట్ల, రేపల్లెతో పాటు నగర పంచాయతీగా సేవలందిస్తున్న అద్దంకిలో మాత్రమే రిజిస్ట్రేషన్‌ ఆదాయం ఉంటుంది. మిగతా వాటిలో నామమాత్రంగా ఉంటుంది. వీటి పరిధిలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా నెలకు దాదాపు 1800 దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే దాదాపు 60 శాతం వరకు ఆ నాలుగింటి పరిధిలోను ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.196 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ఆర్థికంలో నాలుగు నెలల గడిచిపోయాయి. ఈ నాలుగు నెలలకు రూ.65 కోట్ల ఆర్జన లక్ష్యం పెట్టుకోగా అందులో రూ.62 కోట్ల వరకు చేరుకున్నట్లు సమాచారం. వాస్తవానికి వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఏప్రిల్‌, మే, జూన్‌, జూలైలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. దిగుబడుల సొమ్ము చేతిలో ఉండడం, పనులు లేకపోవడంతో ఎక్కువమంది ఆ దిశగా దృష్టిపెట్టి లావాదేవీలు జరుపుతుంటారు. ఆ తర్వాత నెలల్లో రిజిస్ట్రేషన్లు అంతగా ఉండవు. ఈ పరిస్థితుల్లో తర్వాత నెలల్లో కొంత లోటు ఏర్పడినా తొలి నాలుగు నెలల్లో ఉన్న మిగులు ద్వారా లక్ష్యాన్ని చేరుకునేవారు. కానీ ఈ ఏడాదికి సంబంధించి గడచిన నాలుగు నెలల్లోనే తరుగు కనబడుతోంది. మళ్లీ ఫిబ్రవరిలోనే ఊపందుకునే అవకాశం ఉంటుంది. యంత్రాంగం మాత్రం కొత్త జిల్లా అయినందువల్ల స్థిరాస్తి రంగంపై ఆశలు పెట్టుకుని లక్ష్యాన్ని చేరుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నది.

లక్ష్యాన్ని చేరుకుంటాం

గడచిన నాలుగు నెలల్లో దాదాపు లక్ష్యం మేర ఆర్జించగలిగాం. రాబోయే రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్లు పెద్ద సంఖ్యలో జరిగే అవకాశం ఉంది. నూతనంగా జిల్లా ఏర్పడినందు వల్ల ఇళ్ల స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. సబ్‌రిజిస్టార్లతో సమావేశాలు జరుపుతూ సూచనలు ఇస్తున్నాం. సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం. -జి.లక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్‌ 


Updated Date - 2022-08-07T05:46:35+05:30 IST