టీఆర్పీ కోసం రూ.40 లక్షలిచ్చిన అర్ణబ్.. మాజీ బార్క్ సీఈవో సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2021-01-25T18:10:35+05:30 IST

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, సీనియర్ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇటీవల ఆయన వాట్సాప్ చాట్ లీకైనప్పటి నుంచి అనేక కీలక విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా బ్రాడ్‌కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్(బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా ముంబై పోలీసుల...

టీఆర్పీ కోసం రూ.40 లక్షలిచ్చిన అర్ణబ్.. మాజీ బార్క్ సీఈవో సంచలన ఆరోపణలు

ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, సీనియర్ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇటీవల ఆయన వాట్సాప్ చాట్ లీకైనప్పటి నుంచి అనేక కీలక విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా బ్రాడ్‌కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్(బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా ముంబై పోలీసుల ముందు సంచలన విషయాలను వెల్లడించారు. చానళ్ల టీఆర్పీలో మార్పులు చేసేందుకుగానూ అర్ణబ్ తనకు దాదాపు రూ.40 లక్షల వరకు చెల్లించారని, మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని తాను తీసుకున్నానని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ లిఖిత పూర్వక స్టేట్‌మెంట్‌ను సైతం ఆయన పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్పీ స్కామ్కు సంబంధించి అర్ణబ్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగానే దాస్‌గుప్తాను కూడా పోలీసులు విచారించారు. ఈ విచారణలో భాగంగానే దాస్ గుప్తా అర్ణబ్‌తో తనకు జరిగిన డీల్ గురించి వివరించినట్లు సమాచారం. 


‘అర్ణబ్ 2004 నుంచి నాకు తెలుసు. టైమ్స్ నౌలో మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్లం. 2013లో నేను బార్క్ సీఈవోగా నియమితుడినయ్యాను. ఆ తరువాత 2017లో అర్ణబ్ రిపబ్లిక్ టీవీని ప్రారంభించాడు. చానల్ ప్రారంభించక ముందే అర్ణబ్ నాతో దాని విషయంలో అనేకసార్లు చర్చించేవాడు. తన చానల్ రేటింగ్ పెంచడంలో నా సహాయాన్ని కోరుతూ అంతర్లీనంగా మాట్లాడేవాడు. నాకు టీఆర్పీ గురించి అన్ని విషయాలు తెలుసన్న విషయం అర్ణబ్ బాగా తెలుసు. ఇప్పుడు తనకు సాయం చేస్తే భవిష్యత్తులో నాకు కూడా తాను సాయం చేస్తానని మాటిచ్చాడు. దాంతో నా బృందం సాయంతో రిపబ్లిక్ టీవీ టీఆర్పీని అమాంతం పెంచేశాను. దాంతో అనతికాలంలో అర్ణబ్ చానల్ నెంబర్ వన్ ర్యాంకుకు చేరింది. 2017 నుంచి 2019 వరకు ఇలాగే టీఆర్పీని కావాలని మార్పులు చేస్తూ రిపబ్లిక్ టీవీకి సాయం చేశాను’ అని దాస్ గుప్తా తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.

Updated Date - 2021-01-25T18:10:35+05:30 IST