బదిలీల కోసం బేరాలు

ABN , First Publish Date - 2022-01-22T04:31:37+05:30 IST

ఉపాధ్యాయల కొత్త జిల్లాల కేటాయింపుల అనంతరం ప్రభుత్వం పరస్పర బదిలీలపై దృష్టి పెట్టింది. కోరుకుంటున్న జిల్లాకు సాధారణ బదిలీల్లో అవకాశం రాకపోవడంతో, పరస్పర బదిలీల్లో వాటిని దక్కించుకునేందకు పలువురు ఉపాధ్యాయులు దృష్టి సాధించారు.

బదిలీల కోసం బేరాలు
మహబూబ్‌నగర్‌ డీఈవో కార్యాలయం

ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు డబ్బులు ఇచ్చేందుకు రెడీ

ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు డిమాండ్‌

భార్యాభర్తలు ఒక చోటకు వచ్చేందుకు..

కోరుకున్న స్థానంలో పని చేసేందుకు.. ఖర్చుకు వెనుకాడని పరిస్థితి


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం జనవరి 21: ఉపాధ్యాయల కొత్త జిల్లాల కేటాయింపుల అనంతరం ప్రభుత్వం పరస్పర బదిలీలపై దృష్టి పెట్టింది. కోరుకుంటున్న జిల్లాకు సాధారణ బదిలీల్లో అవకాశం రాకపోవడంతో, పరస్పర బదిలీల్లో వాటిని దక్కించుకునేందకు పలువురు ఉపాధ్యాయులు దృష్టి సాధించారు. అందుకోసం అవసరమైతే లక్షల రూపాయలు ఖర్చు చేసేందకు వెనుకాడడం లేదని సమాచారం. ఈ వ్యవహారంలో కొందరు టీచర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. స్థానికతకు ప్రాధాన్యం లేకుండా కొత్త జిల్లాల కేటాయింపులు జరగడంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు దూరమయ్యారు. ఉపాధ్యాయులుగా ఉన్న  భార్యా భర్తలను చెరో జిల్లాకు కేటాయించారు. ఇలాంటి వారు పరస్పర బదిలీల కోసం ఎదురు చూస్తూ, ఇలాంటి అడ్డదారులను వెతుక్కుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరస్పర బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో బదిలీలకు బేరసారాలు మొదలయ్యాయి. అయితే 2013లో జరిగిన పరస్పర బదిలీల్లో చాలా వరకు డబ్బులు చేతులు మారాయి. ఒక్కొక్కరి నుంచి అప్పట్లో రూ.రెండు నుంచి రూ.మూడు లక్షల వరకు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా ఇప్పుడు డీఈవో కలుగజేసుకుని బదిలీలు చేపట్టాలని తెంగాణ పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు దుంకుడు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 


రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డిమాండ్‌

పరస్పర బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు బేరసారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం, జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి వంటి ప్రధాన పట్టణాలకు మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపరాలు, చిట్టీల దందా తదితర వ్యాపారాలు చేసే వారు ఎంత డబ్బు ఇచ్చేందుకైనా వెనుకాడటం లేదని సమాచారం. ఇదిలా ఉంటే భార్యా భర్తలు ఉద్యోగులుగా ఉండి, స్పౌజ్‌ కేటగిరీలో ఒకే చోట అవకాశం రాని వారు, హెచ్‌ఆర్‌ఏ పొందాలనుకునే వారు, జిల్లాల విభజనలో సొంత జిల్లా దక్కకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లిన సర్వీస్‌ ఎక్కువగా ఉన్న వారు పరస్పర బదిలీల్లో ఎంత డబ్బైనా ఖర్చు చేసి, అనుకున్న స్థానం దక్కించుకునేందకు సిద్ధమవుతున్నారని సమాచారం.


ఒప్పందాలు కుదుర్చుకుంటున్న టీచర్లు

ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్‌ గ్రూపుల్లో చర్చలు జరుగుతున్నాయి. కేటాయించిన జిల్లా, పాఠశాల పేరు, చిరునామా, కేటగిరీ, కోరుకుంటున్న జిల్లా, ఫోన్‌ నంబరు పంపించుకుంటున్నారు. వీటి ఆధారంగా బదిలీల బేరసారాలు సాగుతున్నాయి. జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు హైదరాబాద్‌ సమీపంలోని రాజేంద్రనగర్‌లోని ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నాడు. అతను పాలమూరు జిల్లా పరిసర ప్రాంతాలకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతో అతను పని చేస్తున్న పాఠశాలలో పని చేసేందుకు పాలమూరు జిల్లా నుంచి వచ్చే అవకాశం ఉంటే తనకు తెలియజేయలని ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడితో మాట్లాడారని తెలుస్తోంది.


బేరసారాలు ఇలా..

మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ ఉపాధ్యాయుడికి 2001 డీఎస్సీలో రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగం వచ్చింది. అతను హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పాలమూరు జిల్లా పరిసర ప్రాంతాలకు రావాలనుకుంటున్నాడు. శంషాబాద్‌ వచ్చేవారు ఉంటే తనకు రూ.4.50 లక్షలు ఇస్తే వస్తానని ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడి ద్వారా సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఆ నాయకుడు మధ్యవర్తిగా వ్యవహరించగా, దీనికి  ఓ ఉపాధ్యాయుడు ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరో ఉపాధ్యాయుడు శంషాబాద్‌ సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ, జిల్లా కేంద్రం సమీపంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతను శంషాబాద్‌ వెళ్లేందుకు ఎంత ఖర్చయినా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-01-22T04:31:37+05:30 IST