చెరువంత నిర్లక్ష్యం..!

Jun 17 2021 @ 00:10AM
దువ్వూరు మండలం చింతకుంట చెరువుకట్ట దుస్థితి

గతేడాది నివర్‌ తుఫానకు దెబ్బతిన్న 98 చెరువులు

18 చెరువులకు గండ్లు

తాత్కాలిక మరమ్మతులతో మమ

శాశ్విత మరమ్మతులకు రూ.18 కోట్లు అవసరం

సీజన మొదలైనా నిధులు ఇవ్వని ప్రభుత్వం

చెరువుల పరిధిలో 1.25 లక్షల ఎకరాల ఆయకట్టు

ఆధ్వాన్నంగా పంట కాలువలు


పల్లెసీమల నీటి అవసరాలను తీర్చే చెరువుల నిర్వహణలో అడుగడుగున నిర్లక్ష్యం కనిపిస్తోంది. అధిక వర్షాలకు దెబ్బతింటే తక్షణ మరమ్మతులు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చేపట్టిన చర్యలు నామమాత్రమే. కీలకమైన పంట కాలువల నిర్వహణ నానాటికి తీసికట్టుగా మారింది. గత ఏడాది నవంబరులో నివర్‌ తుఫానతో పలు చెరువులు తెగిపోయాయి. వీటిని తాత్కాలిక మరమ్మతులతో సరిపుచ్చారు. ఆ పనుల్లోనూ అధికార వైసీపీ నేతలదే పెత్తనం. శాశ్విత మరమ్మతుల కోసం రూ.18 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపారు. వర్షాకాలం ప్రారంభమైనా నిధులు ఇవ్వలేదు. వానొచ్చి.. వరదొస్తే మళ్లీ కడ‘గండ్లు’ తప్పవని రైతుల ఆవేదన. జిల్లాలో చెరువుల దుస్థితిపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటిపారుదల శాఖ పర్యవేక్షణలో వంద ఎకరాలు పైబడిన ఆయకట్టు కలిగిన చెరువులు 234, ఊట కాలువలు 36, ఊట చెరువులు 18, ఆనకట్టలు 11, వంద ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు కలిగిన చెరువులు 1,542, మీడియం ఇగిరేషన ప్రాజెక్టులు 46 ఉన్నాయి. వాటి పరిధిలో 1,24,093 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువులు, మీడియం ఇరిగేషన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం సరాసరి 15 టీఎంసీలు. వర్షాభావ పరిస్థితులతో నిత్యం తల్లడిల్లే గ్రామసీమలకు కీలక జలాధారమైన చెరువుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. వర్షాకాలం సీజనకు ముందే ఆయకట్టు కాలువులు, తూములు, డిస్ర్టిబ్యూటరీలు మరమ్మతులు చేపట్టాలి. వరదొస్తే చెరువు గట్లు కోతకు గురికాకుండా గట్టుపై అడ్డంగా పెరిగిన ముళ్లపొదలు తొలగించడం, కోతకు గురైన ప్రాంతాల్లో మరమ్మతు వంటి పనులు చేపట్టాలి. ఇందుకు నిధులు అవసరం. కాలువుల్లో పూడికతీత, కంపచెట్ల తొలగింపు పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గండ్లు పూడ్చివేత, తూములు, డిస్ర్టిబ్యూటరీల మరమ్మతులకు మాత్రం నిధులు ఇవ్వలేదు. దీంతో పలు చెరువులు ఆధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. 


గండ్లకు మరమ్మతులు ఏవీ..?:

గత ఏడాది నవంబరు మాసంలో నివర్‌ తుఫాన ప్రభావంతో వంకలు వాగులు ఉప్పొంగాయి. 98 చెరువులు దెబ్బతిన్నాయి. అందులో 18 చెరువులకు గండ్లు పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.6 కోట్లు తక్షణమే ఇవ్వాలని జిల్లా ఇరిగేషన సర్కిల్‌ ఇంజనీర్లు నివేదిక పంపితే.. ఆ మేరకు కలెక్టరు నిధులు మంజూరు చేశారు. గండ్లు పడిన చోట ఇసుక బస్తాలు, కోతకు గురైన చెరువులకు మట్టితో తాత్కాలిక మరమ్మతులు చేశారు. పనుల్లో అధికార వైసీపీ గ్రామ నాయకులదే పెత్తనం కావడంతో నాణ్యతా ప్రమాణాలు అంతంత మాత్రమేనన్న విమర్శలు లేకపోలేదు. నెలలు గడిచినా బిల్లులు మంజూరు కాలేదు. శాశ్విత మరమ్మతుల కోసం రూ.18 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వర్షాకాలం సీజన ప్రారంభం అయింది. ఇప్పటికే పలు చెరువుల్లో వర్షం నీరు చేరింది.. శాశ్విత మరమ్మతులకు మాత్రం ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. దీంతో వరదొస్తే మళ్లీ కడ‘గండ్లు’ తప్పేలా లేదని, ఆయకట్టు బీడుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నాణ్యత ప్రశ్నార్థకం..?

పుల్లంపేట మండలం దలవాయిపల్లిలో తోటకాలువ ఆనకట్ట రక్షణ, చెక్‌ డ్యాం పునర్నిర్మాణం, కొన్నమ్మ చెరువు మొరవ రక్షణ పనులు, స్థానిక ఊట చెరువు పునరుద్ధరణ, కొత్తపల్లి అగ్రహారం సమీపంలో పెద్దకోన చెక్‌ డ్యాం పునర్నిర్మాణం, ఎర్రవారి ఊట చెరువు పునరుద్ధరణ, కేతరాజుపల్లి సమీపంలో సప్లయ్‌ చానల్‌ రక్షణ పనులు, ఓబులవారిపల్లి మండలం సంజీవనగర్‌ ఎస్సీ కాలనీ సమీపంలోని ఊట చెరువు ఆధునికీకరణ, పున్నటివారిపల్లి సమీపంలో ఎర్రవంక చెక్‌డ్యాం ఆఽధునికీకరణ తదితర పనులు రూ.1.26 కోట్లతో చేపట్టారు. ఏప్రిల్‌ నెలలో టెండర్లు పూర్తిచేసి మూడు నెలల్లోగా పనులు చేసేలా కాంట్రాక్టరుకు అప్పగించారు. ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు విస్మరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గత ఏడాది కురిసిన వర్షాలకు గోపవరం మండలం టి.సండ్రపల్లి చెరువుకు గండి పడింది. రూ.11 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. శాశ్విత మరమ్మతులకు రూ.52 లక్షలతో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. ఈ చెరువు సామర్థ్యం 41.670 ఎంసీఎ్‌ఫటీలు కాగా ఆయకట్టు 1,200 ఎకరాలు ఉంది.


జిల్లాలో చెరువులు, మీడియం ప్రాజెక్టులు వివరాలు

-----------------------------------------------------------------

చెరువులు సంఖ్య ఆయకట్టు

-----------------------------------------------------------------

100 ఎకరాల పైబడిన చెరువులు 234 66,946

100 ఎకరాలలోపు చెరువులు 1,542 32,294

ఊట కాలువలు 36 6,884

ఊట చెరువులు 18 3,469

వంకలు, వాగులపై ఆనకట్టలు 11 1,631

మీడియం ఇరిగేషన ప్రాజెక్టులు 46 12,869

-----------------------------------------------------------------

మొత్తం 2,887 1,24,093

-----------------------------------------------------------------


ప్రభుత్వానికి నివేదిక పంపాం

- వెంకట్రామయ్య, ఈఈ, ఇరిగేషన సర్కిల్‌, కడప

జిల్లాలో గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు 98 చెరువులు దెబ్బతిన్నాయి. అందులో 18 చెరువులకు గండ్లు పడ్డాయి. కలెక్టరు మంజూరు చేసిన రూ.6 కోట్లతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం. వాటికి బిల్లులు రావాల్సి ఉంది. శాశ్విత మరమ్మతుల కోసం రూ.18 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే టెండర్లు పిలిచి పనులు చేపడతాం. కాలువల్లో పూడిక తీత, కంపచెట్ల తొలగింపు పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.