ఎంత ‘జాస్తి’ ప్రేమయో!

Jun 10 2021 @ 02:31AM

జస్టిస్‌ చలమేశ్వర్‌ కుమారుడికి పిలిచి పెద్దపీట

గొప్ప పేరు లేకున్నా ఏఏజీగా భూషణ్‌ నియామకం

అప్పటికే ఒక ఏఏజీ ఉన్నా అదనంగా మరొకరు

ఆపై 4 నెలల్లోనే ‘ఆర్థిక ప్రయోజనాలు’ పెంపు

సిట్టింగ్‌లు, పారితోషికం భారీగా పైపైకి

రోజుకు రూ.68 వేలు దక్కేలా ఉత్తర్వులు

ఏఏజీకి సీఎ్‌సతో సమానంగా హెచ్‌ఆర్‌ఏ

ఇతర అలవెన్స్‌లూ భారీగానే 

అడ్వొకేట్‌ జనరల్‌కు మించిన ‘అదనం’

సీఎం ముఖ్య కార్యదర్శి సిఫారసులే ఆధారం


నచ్చిన వాళ్లను, సొంత మీడియాలో పని చేసే వారిని ప్రభుత్వ సలహాదారులుగా, కన్సల్టెంట్లుగా, పీఆర్వోలుగా నియమించుకుని... నచ్చినంత జీతాలు ఇవ్వడమే కాదు! మరింత బాగా నచ్చిన వాళ్లకు జనం సొమ్మును ‘ఇష్టమొచ్చినట్లు’గా సమర్పించుకుంటున్నారు. ఈ విషయంలో నిబంధనలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులు కూడా బేఖాతరే! ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఆదేశిస్తారు... అప్పటికప్పుడు సవరణలతో జీవోలు జారీ అవుతాయి! ఇది రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరళ్లకు అందిస్తున్న భారీ తాయిలాల సంగతి! ఏఏజీలకు అడ్వొకేట్‌ జనరల్‌కు మించి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్న వైనం న్యాయవాద, అధికార వర్గాలను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒక వ్యక్తి కోసం ‘వ్యవస్థ’నే మార్చేస్తున్నారు. అన్ని నియమాలను పక్కకు తోసేసి అత్యధిక పారితోషికాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు... రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జాస్తి నాగభూషణ్‌. ఈయన అధికార పెద్దలకు ప్రీతిపాత్రుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ కుమారుడు! పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి అంతకుముందు నుంచి ఏఏజీగా ఉన్నప్పటికీ... జాస్తి నాగభూషణ్‌ రాగానే ‘పారితోషికాల’ చెల్లింపులు చకచకా మారిపోయాయి.


ఒక్కరు కాదు... ఇద్దరు

సాధారణంగా రాష్ట్రంలో ఒక అడ్వొకేట్‌ జనరల్‌, ఒక అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఉంటారు. కానీ... జస్టిస్‌ చలమేశ్వర్‌ కుమారుడి కోసం మరో ఏఏజీ పోస్టు సృష్టించారు. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఇచ్చిన లేఖ ఆధారంగా గత ఏడాది డిసెంబరు 9న జాస్తి నాగభూషణ్‌ను ఏఏజీగా నియమించారు. 2000 సంవత్సరంలో విడుదల చేసిన జీవో 187, 2016లో వచ్చిన జీవో 219ల ఆధారంగా ఆయనకు వేతనం, అలవెన్సులు, ఇతర సదుపాయాలు ఉంటాయని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. వాస్తవానికి నాగభూషణ్‌ ఉమ్మడి హైకోర్టులోకానీ, రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో కానీ పెద్దగా పేరున్న న్యాయవాది కాదు. అయినా సరే, కీలకమైన ఏఏజీ పోస్టు కట్టబెట్టారు. కేవలం జస్టిస్‌ చలమేశ్వర్‌కు కృతజ్ఞత తెలుపడం కోసమే భూషణ్‌కు ఈ పోస్టు ఇచ్చారని అప్పట్లోనే చర్చ జరిగింది. విషయం ఈ నియామకంతో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆయనకు మరెన్నో ‘మేళ్లు’ చేయాలనుకున్నారు. చేసేశారు. రోజువారీ సిట్టింగ్‌ల (కేసుల్లో అటెండ్‌ కావడం) సంఖ్యను, ఒక్కో సిట్టింగ్‌కు చెల్లించే పారితోషికాన్ని అమాంతం పెంచేశారు. అది కూడా... కేవలం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సిఫారసు మేరకే! ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా... ఆయన ముఖ్య కార్యదర్శి ఇలాంటి సిఫారసు చేయరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!


ఏజీకి లేనివి ఏఏజీలకు..... 

రాష్ట్ర ప్రభుత్వ తరఫు ప్రధాన న్యాయవాది అడ్వొకేట్‌ జనరల్‌! ఆయనను ‘లీడర్‌ ఆఫ్‌ ది బార్‌’ అని కూడా పిలుస్తారు. ఆయన తర్వాతే ఏఏజీలు! కానీ... జగన్‌ సర్కారు కొన్ని ఆర్థిక ప్రయోజనాలను ఏజీని మించి ఏఏజీలకు కల్పించడం గమనార్హం. అడ్వొకేట్‌ జనరల్‌కు రోజుకు ఐదు అప్పియరెన్స్‌లకు మాత్రమే ఫీజు చెల్లిస్తారు. కానీ, ఏఏజీలకు మాత్రం 8 అప్పియరెన్స్‌లకు చెల్లించాలని నిర్ణయించారు. ఇక... హెచ్‌ఆర్‌ఏ కూడా ఏజీకంటే ఏఏజీకే ఎక్కువ. దీంతోపాటు... ‘పారితోషికం’ కోసం మరో తతంగం కూడా నడుస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అనేక కేసులు దాఖలవుతున్నాయి. వాటిలో వాదించేందుకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించి ఇతర సీనియర్‌ న్యాయవాదులను ప్రభుత్వం నియమించుకుంటోంది. ఆ కేసుల్లో కూడా కంప్యూటర్‌లో లాగిన్‌ అయ్యి అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పాల్గొంటున్నారని... వాటికీ ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోందని తెలుస్తోంది.


ఎందుకింత?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏఏజీలకు ఈ స్థాయి ప్రతేకమైన ‘మేళ్లు’ జరగలేదు. కేవలం ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ముఖ్యకార్యదర్శి సిఫారసు చేసి ఈ ఉత్తర్వులు ఇప్పించడం చర్చనీయాంశంగా మారింది. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లోనూ ఈ తరహా పెంపుదల లేదు. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌కు కర్ణాటకలో రోజుకు ఒక కేసుకు రూ.10వేలు చెల్లిస్తారు. ఆ తర్వాత ఎన్ని కేసులు అటెండ్‌ అయినా... కేసుకు రూ.వెయ్యి చొప్పున గరిష్ఠంగా రోజుకు రూ.30 వేలు మాత్రమే చెల్లిస్తారు. మన రాష్ట్రంలో మాత్రం ఏఏజీకి గరిష్ఠంగా రూ.68 వేలు అందుతాయి.


ఇలా పెంచేశారు..

2016లో జారీ చేసిన జీవో ప్రకారం ఏఏజీకి ఒక సిట్టింగ్‌కు రూ.7500 చొప్పున చెల్లించాలి. ఒకరోజులో గరిష్ఠంగా ఐదు సిట్టింగ్‌లు మాత్రమే ఉండాలి. తాజాగా... ఒక్కో సిట్టింగ్‌కు ఇచ్చే పారితోషికాన్ని రూ.8500 చేశారు. పెంచింది వెయ్యి రూపాయలే కదా అని అనుకోవద్దు. సిట్టింగ్‌ల సంఖ్యను 5 నుంచి 8కి పెంచేశారు. అంటే... ఏఏజీకి గతంలో రోజుకు గరిష్ఠంగా రూ.37,500 పారితోషికం లభించేది. ఇప్పుడు అది ఏకంగా రూ.68 వేలకు చేరింది. అంటే... దాదాపు రెట్టింపు! ఈ ‘పెంపు’ ఉత్తర్వు వెలువడిన సరిగ్గా మూడు రోజులకు, అంటే ఈ ఏడాది మార్చి 15న సర్కారు మరో జీవో జారీ చేసింది. ఇందులో... ఏఏజీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)తో సమానంగా ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాదు... హెచ్‌ఆర్‌ఏకు సమానంగా ఆఫీసు అలవెన్సు కూడా ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి 2019 జూన్‌లో ఏఏజీగా నియమితులయ్యారు. ఆయన ఒక్కరే ఏఏజీగా ఉన్నప్పడు ఇలాంటి భారీ పెంపుదలలు లేనే లేవు. అసాధారణ స్థాయిలో జాస్తి నాగభూషణ్‌ను రెండో ఏఏజీగా నియమించుకోవడంతోపాటు, ఆ తర్వాత నాలుగు నెలల్లోనే ఏఏజీలకు అందే ఆర్థిక ప్రయోజనాలను పెంచుతూ పోవడం గమనార్హం.

Follow Us on:

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.