చంద్రబాబును విమర్శిస్తే సహించేది లేదు

ABN , First Publish Date - 2022-07-02T07:04:08+05:30 IST

గుడివాడకి, గన్నవరానికి తాడెవరో, బొంగరమెవరో 2024లో ప్రజలు తేలుస్తారని, కొడాలి నానీకి చంద్రబాబు తండ్రి ఖర్జూరపు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఫైర్‌ అయ్యారు.

చంద్రబాబును విమర్శిస్తే సహించేది లేదు

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఫైర్‌ 

గన్నవరం, జూలై 1 : గుడివాడకి, గన్నవరానికి తాడెవరో, బొంగరమెవరో 2024లో ప్రజలు తేలుస్తారని, కొడాలి నానీకి చంద్రబాబు తండ్రి ఖర్జూరపు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఫైర్‌ అయ్యారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో అర్జునుడు మాట్లాడుతూ గుట్కాలు, ఖైనీలు నములుతూ తిరిగే నువ్వు ఖర్జూరపు నాయుడు, చంద్రబాబు గురించి పదేపదే మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జీవితంలో ఎప్పుడైనా నీ తండ్రికి పిండం పెట్టావా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ నీ తల్లిదండ్రులను పట్టించుకోలేదు. ఇంకా గుడివాడను ఏం బాగు చేస్తావన్నారు. 2024లో టీడీపీ గెలిచేది ముందు గన్నవరం, గుడివాడ అని అప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. నీకు దమ్ముంటే గన్నవరం నుంచి పోటీ చేసి తనపై గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు. గుడివాడలో టీడీపీ సభ్యత్వం అడిగితే రావి శోభనాద్రి కాలితో తన్నిన రోజులు మరిచిపోయావా అని గుర్తు చేశారు. గుడివాడలో ఖైనీలు, మూడు ముక్కలాట, కాసినో ఆడించే నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడే అంతటి వాడివా అని ప్రశ్నించారు. మంత్రి పదవి పోయాక కొడాలి నానికి మతి భ్రమించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే పిచ్చికుక్కను కొట్టినట్లు కొడతారన్నారు. సీఎం అవ్వాలన్న ఆశతో తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు చేయించుకున్నది మీరు కాదా? సొంత బాబాయిని చంపించింది మీరు కాదా అని ప్రశ్నించారు. రక్తచరిత్రలు మీకు, మీ పార్టీ వారి కుటుంబాలకు ఉన్నాయన్నారు. ఆర్టీసీ చార్జీలు రెండున్నర నెలలు తిరగకుండానే మళ్లీ పెంచారని విమర్శించారు. జగన్‌రెడ్డి రివర్స్‌ పాలనలో సామాన్యుడి వాహనం ధరలకు రెక్కలొచ్చాయన్నారు. ఆర్టీసీ సంస్థను గాలికి వదిలేశారన్నారు. పాలన చేతకాకపోతే దిగిపోవాలన్నారు. పెంచిన ఆర్టీసీ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, మండల అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, ఆరుమళ్ల వెంకట కృష్ణారెడ్డి, కొండేటి వెంకటేశ్వరరావు, దొడ్ల కుమార్‌, మండవ రమ్యకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T07:04:08+05:30 IST