ltrScrptTheme3

సింగపూర్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

Oct 26 2020 @ 11:24AM

ఈనెల 24వ తేదిన(శనివారం) సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్, టాస్-మనం తెలుగు వారి సహకారంతో అంగరంగ వైభవంగా, ధూంధాంగా నిర్వహించారు. ఈ పండుగను సింగపూర్ తెలుగు సమాజం సుమారు 12 సంవత్సరాలకు పైగా ప్రతీ సంవత్సరం దిగ్విజయంగా నిర్వహిస్తోంది. కరోనా కోరల్లోంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు వారందరి క్షేమమే ప్రత్యేక ఉద్దేశంగా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాల్ని సాంఘిక మాధ్యమాల ద్వారా జరిపారు. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఐదుగురు-ఐదుగురు సమూహంగా జూం యాప్ ద్వారా అధిక సంఖ్యలో తెలుగింటి ఆడపడుచులు సింగపూర్ నలువైపులా నుంచి ఆటపాటలతో, కోలాటాల విన్యాసాలతో సద్దుల బతుకమ్మ సంబరాలలో ఆనందంగా పాల్గొన్నారు. క్లిష్టసమయంలో సైతం పండుగ శోభ ఏమాత్రం తగ్గకుండా రకరకాల పువ్వులతో అనేక రంగులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు అందరినీ కనువిందుచేశాయి. 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఈ వేడుకను ఉద్దేశించి మాట్లాడుతూ... కోవిడ్-19 పరిస్థితుల్లో కూడా సింగపూర్‌లోని తెలుగు వారు ఇంత పెద్ద ఎత్తున ఈ పండగ జరుపుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను, ఆంతర్యాన్ని వివరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ తెలంగాణ జానపద గాయకులు నాగులు, కూర్మయ్య, వరం, లావణ్యల బతుకమ్మ పాటలు  ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా ఆటపాటలు మహిళలకు మరింత ఉత్సాహానిచ్చాయి.


సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ మనిషి ప్రకృతితో మమేకమయ్యే పండుగలలో అతి పెద్దదైన ఈ బతుకమ్మ పూల పండుగ ఘనమైన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. వెయ్యి సంత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ పండుగను సింగపూర్‌లో ఇంత సాంప్రదాయబద్ధంగా పెద్దఎత్తున నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారందికీ ఈ సందర్భంగా తెలుగు సమాజం తరపున బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. సింగపూర్ తెలంగాణా ఫ్రెండ్స్ తరపున కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున పండగ చేసుకొనే మనం ప్రత్యేక పరిస్ధితులలో జూమ్ ద్వారా కూడా అట్టహాసంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. టాస్- మనం తెలుగు తరుపున అనితా రెడ్డి మాట్లాడుతూ ప్రాంతాలు, మాండలికాలు వేరైనా అందరం కలసికట్టుగా, సంసృతి సాంప్రదాయాలతో పాటు బతుకుల బంధాలు తెలిపే పండుగ ఈ బతుకమ్మ అని తెలియజేశారు.


ఆన్‌లైన్ ద్వారా ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా పాల్గొన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రత్యక్షప్రసారం చేయబడిందని నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్న తెలిపారు. ఈవేడుకలో పాల్గొని విజయవంతం చేయడంలో సహకరించిన అందరికీ, కార్యవర్గసభ్యులకు, సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్‌కు, టాస్-మనం తెలుగు వారికి, స్పానసర్లకు కార్యదర్శి సత్యచిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు.

TAGS: NRI
Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.