‘ఎంగిలిపూల’ పరిమళం

ABN , First Publish Date - 2022-09-26T05:54:49+05:30 IST

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బత్ముకమ ఉయ్యాలో.. అంటూ జిల్లా అంతటా ఆదివారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ పర్వం తొలి రోజు పూలపరిమళాలు గుప్పుమన్నాయి.

‘ఎంగిలిపూల’ పరిమళం

ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు
మహిళలతో నిండిపోయిన వేయిస్తంభాలగుడి
జిల్లా అంతటా తొలి రోజు సందడే సందడి
కిక్కిరిసిన ఆలయాలు.. మారుమోగిన ఊరు శివారు ప్రాంతాలు
ఉత్సాహంగా పాల్గొన్న వేలాది మంది మహిళలు


హనుమకొండ కల్చరల్‌, సెప్టెంబరు 25:
బతుకమ్మ  బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బత్ముకమ ఉయ్యాలో.. అంటూ జిల్లా అంతటా ఆదివారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ పర్వం తొలి రోజు పూలపరిమళాలు గుప్పుమన్నాయి. యాంత్రిక జీవనాన్ని మైమరింపింపచేసి, ఆటపాటల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసే ఈ పర్వం పల్లె, పట్టణాలు తేడాలేకుండా మొదలయ్యాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మలను తయారు చేశారు. వేలాది మహిళల చప్పట్లు, గొంతుకల ఐక్యతా గానం సాయంవేళ ప్రతిధ్వనించింది. రంగు రంగుల పూల సౌరభం, మహిళల మనసులో పెల్లుబికిన భావాలు బతుకమ్మ పాటలై ప్రవహించాయి.  మహిళలు ఉదయం ఇంట్లో గునుగుపూలు, తంగేడు పూలు, బంతి, చేమంతి, నందివర్ధనం తదితర పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. మధ్యలో గౌరమ్మను ఉంచి పూజలు చేశారు. నైవేద్యాలను సమర్పించారు. సాయంత్రం మహిళలు పిల్లలు, వృద్ధులతో కలిసి బతుకమ్మలతో బయలు దేరారు. వేలాది మంది మహిళలు ఒక్కచోట చేరడంతో జనసంద్రంగా మారింది. ఎక్కడ చూసినా పరికిణీల పలకరింతలు, పట్టు చీరెల ధగధగలు, కొత్త చీరెల సింగారింపులతో బతుకమ్మలను చేతబూని అతివలంతా బయలు దేరిన దృశ్యాలు జిల్లా అంతటా సాక్షాత్కరించాయి.
మొదటి రోజు బతుకమ్మ వేడుకలకు ఆలయ ప్రాంగణాలు, ఆరుబయట విశాల ప్రాంతాలు వేదికలుగా నిలిచాయి. రాగన్న దర్వాజలోని పెద్దకోవలె, ఏకశిల పార్క్‌ సమీపంలోని ఆంజనేయ స్వామి  ఆలయం,  ఎక్సైజ్‌ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరాలయం, రెవెన్యూ కాలనీలోని శ్రీ రామాలయంలో కిక్కిరిసిన మహిళా సందోహం బతుకమ్మ వేడుకలకు వేదికలుగా మంగళహారతులు పట్టాయి. బతుకమ్మలను ఒక చోట ఉంచి చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను గొంతెత్తి పాడారు. కోలాటాలు ఆడారు. నృత్యాలు చేశారు. బతుకమ్మలు ఆడే చోట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బతుకమ్మలు ఆడే ఆలయాలు, ప్రధాన ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉండడంతో వాహనాల రాకపోకలను ఇతర ప్రాంతాలకు మళ్ళించారు.

వేయిస్తంభాల గుడిలో..
హనుమకొండలో బతుకమ్మ ప్రధాన వేడుకకు సుప్రసిద్ధ వేయిస్తంభాల గుడి వేదికగా నిలిచింది. 30వేల మందికిపైగా మహిళలతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆలయంలోపలనే కాకుండా బయట పార్క్‌లో, బయట మహిళలు బతుకమ్మలు ఆడారు. ఆలయ ఆవరణ అంతా ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. సాయంత్రం 4 గంటల నుంచే మహిళలు బతుకమ్మలను చేబూని ఆలయానికి రావడం మొదలు పెట్టారు. సాయంత్రం 6గంటల వరకు ఆలయ పరిసరాలు పూర్తిగా నిండిపోయాయి. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని మహిళల కోసం సకల సౌకర్యాలు కల్పించారు. తాగనీటిని సరఫరా చేశారు. విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. కాగా, వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలో పాల్గొన్నారు.

బతుకమ్మ పోటీలు
వేయిస్తంభాల ఆలయంలో రాధేశ్యామ్‌ సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలు జరిగాయి. బతుకమ్మ పాటల పోటీల్లో 150 మంది పాల్గొన్నారు. ప్రథమ బహుమతి గూడెపు స్వరూపారాణి, ద్వితీయ బహుమతి సంగె మౌనిక, ప్రత్యేక బహుమతులను మామిడాల లహరి, తిరునగరి సాహితి గెలుచుకున్నారు. మరో 50 మంది మహిళలకు కన్సోలేషన్‌ బహుతులుగా చీరలను అందచేశారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈసందర్భంగాఆమె మాట్లాడుతూ.. మన సంస్కృతి  సంప్రదాయాలను కాపాడుకోవడమే కాకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ప్రతీకగా ఆమె అభివర్ణించారు. తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, అన్ని పండుగలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వాటి ఔన్నత్యాని చాటి చెబుతోందన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సతీమణి రేవతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. రాధేశ్యామ్‌ సాహితీ, సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు రావుల సుదర్శన్‌, ప్రతినిధులు పూలగంధం రాజారాం, పులి రజనీకాంత్‌, ఆలయ ఈవో వెంకటయ్య పాల్గొన్నారు.







Updated Date - 2022-09-26T05:54:49+05:30 IST