బుర్జ్ ఖలీఫాపై అట్టహాసంగా బతుకమ్మ ప్రదర్శన

ABN , First Publish Date - 2021-10-24T13:01:49+05:30 IST

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించడం ద్వారా ప్రకృతి ఆరాధనా తత్వాన్ని చాటే తెలంగాణ సంస్కృతిక దర్పణం ‘బతుకమ్మ’! ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా. మరి.. ఈ భారీ కట్టడం నలువైపులా పోతపోసినట్లు బతుకమ్మ రూపంలో కనిపిస్తే? ఆ దృశ్యం ఎంత అమోఘమో కదా! శనివారం రాత్రి ఆ అద్భుతమే జరిగింది.

బుర్జ్ ఖలీఫాపై అట్టహాసంగా బతుకమ్మ ప్రదర్శన

బుర్జ్‌ ఖలీఫా సిగలో ‘బతుకమ్మ’

ప్రపంచంలో ఎత్తైన కట్టడంపై 3నిమిషాల వీడియో

తెలంగాణకు గర్వకారణమన్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించడం ద్వారా ప్రకృతి ఆరాధనా తత్వాన్ని చాటే తెలంగాణ సంస్కృతిక దర్పణం ‘బతుకమ్మ’! ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా. మరి.. ఈ భారీ కట్టడం నలువైపులా పోతపోసినట్లు బతుకమ్మ రూపంలో కనిపిస్తే? ఆ దృశ్యం ఎంత అమోఘమో కదా! శనివారం రాత్రి ఆ అద్భుతమే జరిగింది. బుర్జ్‌ ఖలీఫా స్ర్కీన్‌పై రంగురంగుల తీరొక్క పూలతో కూడిన బతుకమ్మ ఆవిష్కృతమైంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా దుబాయ్‌కి వెళ్లారు. ఆమె సమక్షంలో బుర్జ్‌ ఖలీఫా స్ర్కీన్‌పై మూడు నిమిషాల నిడివిగల బతుకమ్మ పండుగ వీడియోను రెండుసార్లు ప్రదర్శించారు.


ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటం కూడా తెర మీద కనిపించింది. స్ర్కీన్‌పై తెలుగు, అరబ్బీ భాషలో బతుకమ్మ, జై హింద్‌, జై తెలంగాణ అనే పదాలు పెద్దపెద్ద అక్షరాలతో కనిపించాయి. ఆ సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన తెలంగాణ ప్రవాసీయులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. కాగా బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం తెలంగాణకే కాదు.. దేశానికి కూడా గర్వకారణమని కవిత అన్నారు. ఎంపీ సురేశ్‌ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ పాల్గొన్నారు. 





Updated Date - 2021-10-24T13:01:49+05:30 IST