Burj Khalifa పై బతుకమ్మ

ABN , First Publish Date - 2021-10-23T15:38:13+05:30 IST

తెలంగాణ పూల పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌ వేదికగా ప్రపంచం దృష్టిని ఆకర్షించబోతుంది. విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం(23వ తేదీన) ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయిలోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

Burj Khalifa పై బతుకమ్మ

విశ్వ వేదికపై గొప్పతనాన్ని చాటేందుకు సిద్ధమైన బతుకమ్మ

యూఏఈ: తెలంగాణ పూల పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌ వేదికగా ప్రపంచం దృష్టిని ఆకర్షించబోతుంది. విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం(23వ తేదీన) ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయిలోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.40 గంటలకు, 10.40 గంటలకు రెండు సార్లు బుర్జ్‌ ఖలీఫాపై 3 నిమిషాల బతుకమ్మ వీడియోను ప్రదర్శించనున్నారు. దీంతో దేశవిదేశాలకు చెందిన లక్షలాది మంది ఒకేసారి బుర్జ్‌ ఖలీఫా అతిపెద్ద స్క్రీన్‌పై బతుకమ్మను వీక్షించనున్నారు.


బతుకమ్మ వేడుకల ద్వారా మన సంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పేందుకే ఎమ్మెల్సీ కవిత ఈ గోప్ప కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ జాగృతి వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం కోసం కవిత ఇప్పటికే దుబాయ్‌ చేరుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అత్యాధునిక సాంకేతికతతో అమర్చిన ఎల్‌ఈడీ స్క్రీలపై రెండు సార్లు బతుకమ్మ వీడియోను ప్రదర్శించనున్నారు.


దుబాయ్‌లో జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నేతలు, తెలంగాణ ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. అలాగే యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు కూడా హాజరవుతారని సమాచారం. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. 2010 జనవరి 4న ప్రారంభమైన ఈ భవనం ఎత్తు 829.8 మీటర్లు. ఇందులో మొత్తం 163 అంతస్తులున్నాయి.

Updated Date - 2021-10-23T15:38:13+05:30 IST